మాట ఇచ్చిన ముప్పై రోజుల్లోనే..
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:36 PM
గత నెల 9వ తేదీన మండలంలోని కొత్తబురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న సీఎం అక్కడికక్కడే పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు.
గత నెల9న కొత్తబురుజులో పర్యటించిన సీఎం
గ్రామానికి హామీలు ఇచ్చిన చంద్రబాబు
ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్ ప్రారంభం
డోన్ టౌన్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గత నెల 9వ తేదీన మండలంలోని కొత్తబురుజు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా గ్రామస్థుల సమస్యలు తెలుసుకున్న సీఎం అక్కడికక్కడే పరిష్కరిస్తానంటూ హామీనిచ్చారు. ఇచ్చిన హామీ మేరకు సీఎంఓ కార్యాలయం పర్యవేక్షణలో సరిగ్గా నెల రోజుల్లోనే ఇంటింటికీ తాగునీటి పైప్‌లైన్ వచ్చేసింది. రూ.30లక్షల నిధులతో ఏర్పాటు చేసిన పైప్‌లైన్‌ను గురువారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. అదేవిధంగా ఐహెచ్‌ఎల్ కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తబురుజు గ్రామంలోని సమస్యలను ప్రజల నుంచి తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రణాళికలో బాగంగా 30 కొత్త టాయిలెట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో అవసరమైనన్ని వీధిలైట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కొత్తబురుజు నుంచి శభా్‌షపురం, గుండాల నుంచి కొత్తబురుజు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కలెక్టర్‌ను ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ శ్రీనివాసులు, డీఈ రమేష్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రవి, ఎంపీడీవో వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ నారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వలసల రామకృష్ణ, లక్ష్మిరెడ్డి, శేషిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షుడు టీఈ రాఘవేంద్రగౌడు, పీఏసీఎస్ చైర్మన్ చనుగొండ్ల శ్రీరాములు, నాయకులు నాగేశ్వరరెడ్డి, లీలావతి, జయన్న, గోవిందు రంగన్న, సుధాకర్ రెడ్డి, గిరి ప్రసాద్ రెడ్డి, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
అధికారులపై కలెక్టర్ ఆగ్రహం : అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన కలెక్టర్ రాజకుమారి అక్కడ గ్రామస్థుల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించారు. గ్రామంలో సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కలెక్టర్ రాజకుమారి.. ఆర్డీఓ, తహసీల్దార్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
సీఎంకు రుణపడి ఉంటాం
మార్చి 9న సీఎం చంద్రబాబు మీ భూమి-మీ హక్కు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి వచ్చారు. మా గ్రామానికి తాగునీరు సమస్యను పరిష్కరించాలని సీఎం కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్, ఎమ్మెల్యే చొరవ తీసుకుని గోరకల్లు రిజర్వాయరు నుంచి రూ.30 లక్షలతో ప్రతి ఇంటికి తాగునీరు అందించి శాశ్వత పరిష్కారం చూపడం సంతోషంగా ఉంది. సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటాం.
- ఎం.ప్రమీల, కొత్తబురుజు
మాకు చాలా సంతోషంగా ఉంది
మా గ్రామం తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు ఐహెచ్‌ఎల్ కింద ప్రతి ఇంటికి మరుగుదొడ్లు మంజూరు చేయడం చాలా ఆనందంగా ఉంది. గత నెల 9న మా గ్రామానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం సమస్యలను పరిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యే కోట్లకు, కలెక్టర్‌లకు రుణపడి ఉంటాము.
- తిమ్మప్ప, కొత్తబురుజు