Share News

మేల్కొంటారా..? ముప్పు తప్పిస్తారా..?

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:20 PM

సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలపై జలవనరులు, నగరపాలక సంస్థ అధికారులు మేల్కోవాల్సిన తరుణమిది.

మేల్కొంటారా..? ముప్పు తప్పిస్తారా..?
సుంకేసుల జలాశయం

తగ్గిపోతున్న సుంకేసుల నీటి నిల్వలు

ప్రస్తుత నీటి నిల్వ 1.064 టీఎంసీలు

ప్రతి రోజు 950 క్యూసెక్కులకు పైగా వినియోగం

నిర్లక్ష్యం చేస్తే వేసవిలో కర్నూలు నగరానికి తాగునీటి ముప్పు

సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలపై జలవనరులు, నగరపాలక సంస్థ అధికారులు మేల్కోవాల్సిన తరుణమిది. రాబోయే వేసవి నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నీటి నిల్వలు సంరక్షించాలి. జలాశయం ఎగువన సాగు, తాగునీటి అవసరాల పేరిట రోజుకు 950 క్యూసెక్కులకు పైగా వాడేస్తున్నారు. మరో వైపు తుమ్మెళ్ల లిఫ్టు ద్వారా తెలంగాణ రాష్ట్రం తోడేస్తోంది. నీటి నిర్వహణపై దృష్టి సారించాలి. లేకుంటే వేసవిలో తీవ్రమైన తాగునీటి ఉపద్రవం ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో 1.064 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఏప్రిల్‌, మే నెలల్లో తుంగభద్ర జలాశయం నుంచి కేసీ కాలువ నీటి వాటా జలాలు తీసుకున్నా.. 176 కిలో మీటర్లు నదిలో ప్రవహించి సుంకేసులకు 50-60 శాతం కూడా చేరే అవకాశాలు లేవు. వేసవి అవసరాలు దృష్ట్యా సుంకేసుల, గాజులదిన్నె జలాశయాల్లో నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎవసరం ఎంతైనా ఉంది.

కర్నూలు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగర జనాభా 8 లక్షలకు పైమాటే. వేసవి వచ్చిందంటే శివారు కాలనీల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్‌ వార్డుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. శివారు కాలనీల్లో కార్పొరేషన్‌ వాటర్‌ ట్యాంక్‌ వచ్చిందంటే భగభగ మండే ఎండల్లోనూ బిందెడు నీటి కోసం జల సమరం చేయాల్సి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు రోజుకు ప్రతి మనిషినికి 135 లీటర్లు సరఫరా చేయాలి. ప్రస్తుతం 126 లీటర్లు సరఫరా చేస్తున్నామని ఇంజనీర్లు తెలిపారు. నగర జనాభా తాగు, పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం రోజుకు 83 మిలియన్‌ లీటర్లు (ఎంఎల్‌డీ) సరఫరా చేయాల్సి ఉంటే.. 78.15 మిలియన్‌ లీటర్లు సరఫరా చేస్తన్నారు. నగరవాసుల దాహం తీర్చే ఎస్‌ఎస్‌ ట్యాంకు సామర్థ్యం 4,410 లిమియన్‌ లీటర్లే. నీటి ఆవిరిపోనూ 45-50 రోజులకు మాత్రమే సరిపోతున్నాయి. సుంకేసుల, తుంగభద్ర, గాజులదిన్నె జలశయాలపై ఆధార పడక తప్పడం లేదు. 2007, 2012, 2014లో సుంకేసుల బ్యారేజీ పూర్తిగా ఎండిపోతే తంగభద్ర నదిలో దేవమ్మమడుగుపై ఆధారపడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే జలవనరుల శాఖ, నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో నీటి నిర్వహణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తగ్గిపోతున్న సుంకేసుల నీటి నిల్వలు

నగరవాసుల జీవనాడి సుంకేసుల జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 1.20 టీఎంసీలు. ప్రస్తుతం 1.064 టీఎంసీలు ఉన్నాయి. సుంకేసుల నుంచి దాదాపు 19 కిలోమీటర్లు ఫోర్‌ఫోర్‌ ఏరియా (నీటి నిల్వ ప్రాంతం) ఉంది. నది ఇరువైపుల ఇటు వైపున కర్నూలు జిల్లా, ఆవలి వైపున తెలంగాణ రాష్ట్రం గద్వాల జోగులాంబ జిల్లాల్లో 550కి పైగా రైతులు విద్యుత్‌ మోటార్ల ద్వారా పంటలకు నీటిని ఎత్తిపోస్తున్నారు. రేమట, మునగాల ఎత్తిపోతలు పథకాలు ద్వారా సాగునీరు తీసుకుంటున్నారు. తెలంగాణ వైపు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సుంకేసుల జలాలు తోడేస్తున్నారు. అంటే.. నీటి ఆవిరితో కలిపి రోజుకు సరాసరి 950 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. ఇలాగే కొనసాగితే 13-15 రోజులకే జలాశయం ఖాళీ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే.. సుంకేసుల బ్యారేజీ 0.75 టీఎంసీలకు పడిపోతే తెలంగాణ ప్రభుత్వం తుమ్మెళ్ల లిఫ్టు ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉండదు. జలవనరుల శాఖ, కార్పొరేషన్‌ ఇంజనీర్లు మేల్కోనకపోతే నీటి ఇబ్బందులు ముందే వచ్చే అవకాశాలు ఉన్నాయని సీమ సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కర్నూలు నగరపాలక సంస్థ తాగునీటి వివరాలు

నగరం జనాభా : 8 లక్షలు

గృహ తాగునీటి కుళాయిలు : 70,954

వాణిజ్య సరఫరా కుళాయిలు : 971

అవసరమైన తాగునీరు : 85 ఎంఎల్‌డీ

ప్రస్తుతం సరఫరా : 78.15 ఎంఎల్‌డీ

ప్రస్తుతంఅందుబాటులో ఉన్న నీరు

ఎస్‌ఎస్‌ ట్యాంకు : 4,410 మిలియన్‌ లీటర్లు

సుంకేసుల బ్యారేజీ : 1.064 టీఎంసీలు

ట్యాంకర్ల ద్వారా సరఫరా : 20 ట్రిప్పులు

తుంగభద్ర డ్యాంలో 11.4 టీఎంసీలు

తుంగభద్ర డ్యాం గేట్లు ఏర్పాటు దృష్ట్యా రబీకి సాగునీరు ఇవ్వలేదు. ప్రస్తుతం డ్యాంలో 26.962 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. అందులో ఏపీ వాటాగా కేసీ కాలువ నీటి వాటా 4.9 టీఎంసీలు, టీబీపీ ఎల్లెల్సీ వాటా 6.5 టీఎంసీలు కలిపి 11.4 టీఎంసీలు ఉన్నాయని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆర్డీఎస్‌ వాటా కూడా 3.5 టీఎంసీలు ఉన్నాయి.తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసుల బ్యారేజీ నీటి చేరాలంటే నదిలో 176 కిలో మీటర్లు ప్రవహించాలి. కనిష్టంగా రోజుకు 4 వేల క్యూసెక్కులు డ్యాం నుంచి విడుదల చేస్తే 2 వేల నుంచి 2,500 క్యూసెక్కులు సుంకేసులకు చేరే అవకాశం ఉంది. వేసవిలో అంతకంటే తక్కువ తీసుకుంటే నదితీర గ్రామాల ప్రజలు వినియోగం, నీటి ఆవిరి వల్ల 10-15 శాతం కూడా వచ్చే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. అదే క్రమంలో గాజులదిన్నె జలాశయంలో లైవ్‌ కెపాసిటీ 2.80 టీఎంసీలు ఉన్నాయి. అత్యవసరం అయితే కాలువ ద్వారా కేసీ కాలువకు, అక్కడి నుంచి ఎస్‌ఎస్‌ ట్యాంక్‌కు మళ్లించే అవకాశం ఉంది. వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని ఇంజనీర్లు చెబుతున్నప్పటికీ.. నీటి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే తాగునీటి ముప్పు తప్పదని అంటున్నారు.

తాగునీటికి ఇబ్బంది ఉండదు

సుంకేసుల బ్యారేజీలో నీటి నిల్వలు పడిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. తుంగభద్ర డ్యాంలో కేసీ కాలువ, టీబీపీ ఎల్లెల్సీ వాటా కలిపి 11.90 టీఎంసీలు మన నీటి వాటా ఉంది. తాగునీటి అవసరాన్ని బట్టి డ్యాం నుంచి నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ వైపు తుమ్మెళ్ల లిఫ్టు, మన జిల్లాలో కూడా రేమట, మునగాల లిఫ్టుల ద్వారా సుంకేసుల జలాలు ఎత్తిపోస్తున్నారు. బ్యారేజీ నీటి నిల్వ స్థాయి 0.75 టీఎంసీలకు పడిపోతే ఆయా ఎత్తిపోతల పథకాల పంపులకు నీరు అందవు. గాజులదిన్నె జలాశయం నుంచి కూడా కర్నూలు నగరానికి తాగునీరు తీసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.

- బాలచంద్రారెడ్డి, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, కర్నూలు

Updated Date - Jan 29 , 2026 | 11:20 PM