Share News

న్యాయం చేస్తారా? ఉరేసుకోమంటారా?

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:36 PM

పాతికేళ్ల కింద తమకు ఇచ్చిన ఇండ్ల పట్టాల విషయంలో న్యాయం చేయకుంటే ఉరేసుకుంటామని మంత్రాలయం మండలం చౌళహళ్లి గ్రామ దళితులు ఆందోళనకు దిగారు.

న్యాయం చేస్తారా? ఉరేసుకోమంటారా?
తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న బాధితులు, జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు

ఇళ్ల పట్టాల కోసం హైవేపై బైఠాయించిన చౌళహళ్లి దళితులు

తహసీల్దారు కార్యాలయం ముందు పోలీసులతో వాగ్వాదం

మద్దతు ఇచ్చిన జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ నాయకులు

మంత్రాలయం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): పాతికేళ్ల కింద తమకు ఇచ్చిన ఇండ్ల పట్టాల విషయంలో న్యాయం చేయకుంటే ఉరేసుకుంటామని మంత్రాలయం మండలం చౌళహళ్లి గ్రామ దళితులు ఆందోళనకు దిగారు. మంగళవారం మంత్రాలయంలో జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కిం జానయ్య ఆధ్వర్యంలో ఉరితాళ్లతో దళితులు అంబేద్కర్‌ సర్కిల్లో హైవే రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రాలయం సీఐ దస్తగిరిబాబు, తన సిబ్బందితో వచ్చి ధర్నాను విరమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని బాధితులు తేల్చి చెప్పారు. సమస్య పరిష్కారానికి తహసీల్దారును కలిసి మా ట్లాడమని సీఐ కోరడంతో బాధితులు తహసీల్దారు కార్యాలయం దగ్గరికెళ్లి ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాధితులు యేసయ్య, యేసేపు, బొజప్పలు మాట్లాడుతూ సర్వేనెం. 19/బీ1ఏలో 2.89 ఎకరాల భూమిని 1999లో 50 మంది దళితులకు ప్రభుత్వం 1.5 సెంట్ల ప్రకారం ఇంటి పట్టాలు ఇచ్చిందన్నారు. ఆ స్థలాల్లో తాము కొట్టాలు వేసుకునేందుకు వెళ్తే అదే గ్రామానికి చెందిన ముత్తమ్మ అడ్డుకుంటున్నారని తెలిపారు. అందువల్ల తాము హైకోర్టును ఆశ్రయించగా నోటీసులు ఇచ్చి విచారణచేసి నివేదిక సమర్పించాలని తహసీల్దారును ఆదేశించిందని, అయితే తహసీల్దారు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ తమకుు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఇంటి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే విధంగా అనుమతులు ఇవ్వకపోతే ఇక్కడే ఉరితాళ్లతో ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దారు రమాదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జైభీమ్‌ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కిం జానయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న, డేవిడ్‌, అనిల్‌ కుమార్‌, మారెన్న, నాగేంద్ర, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:36 PM