Share News

దాడులు చేసి సమర్థించుకుంటారా?

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:39 PM

రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. వాళ్లే దాడులు చేస్తారు.. నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై వేస్తారు.

దాడులు చేసి  సమర్థించుకుంటారా?
ఎమ్మెల్యే, అనుచరుల దాడుల్లో గాయపడిన సుచిత, భర్త నాగరాజును పరామర్శిస్తున్న టీడీపీ నేతలు

నేమకల్లు ఘటనపై ప్రజల ఆగ్రహం

దళితులు, బీసీలపై వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దండయాత్ర

దళిత మహిళ సుచిత్రపై దాడి, అనుచిత ప్రవర్తన

ప్రాణాపాయ స్థితిలో టీడీపీ నాయకుడు నక్కలదొడ్డి శేఖర్‌

బాధితులకు అండగా టీడీపీ నేతలు

పరామర్శించిన ప్రభుత్వ విప్‌ కాల్వ శ్రీనివాసులు

కర్నూలు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ నాయకుల అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. వాళ్లే దాడులు చేస్తారు.. నిందలు మాత్రం కూటమి ప్రభుత్వంపై వేస్తారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో శనివారం రాత్రి చోటు చేసుకున్న సంఘటన ఇందుకు నిదర్శనం. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తన అనుచరులతో కలసి ఐదు వాహనాల్లో వెళ్లి రెచ్చిపోయిన సంఘటన రాష్ట్రమంతా చూసింది. దళితులు, మహిళలు అని కూడా చూడకుండా టీడీపీ నాయకుల ఇళ్లపైకి వెళ్లి ఆయన చేసిన వీరంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ దాడిలో దళిత మహిళ సుచిత్రపై భౌతిక దాడికి దిగడమే కాకుండా ఆమె పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారని ప్రధాన ఆరోపణ. వైసీపీ శ్రేణుల కర్రలు, రాళ్ల దాడిలో తీవ్ర గాయాలకు గురైన టీడీపీ నాయకుడు నక్కలదొడ్డి శేఖర్‌ బళ్లారి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ అమానుష ఘటనపై స్పందించిన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమే కాకుండా అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. బాధితులు దళిత మహిళ సుచిత్ర, టీడీపీ నాయకులను ఆ పార్టీ నాయకత్వం పరామర్శించి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే.. వాస్తవాలను వక్రీకరిస్తూ వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి వెళ్లిన ఆ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేత, మాజీ సీఎం జగన్‌ ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారాయి. ‘దాడులు చేసింది మీ ఎమ్మెల్యే.. ఖండికపోగా సమర్థిస్తారా..’ అంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కాగా.. టీడీపీ మండల కన్వీనర్‌ కొండా పురుషోత్తంపై దాడికి దిగి వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే విరూపాక్షి, మరో 11 మందిపై మరో కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి విలేకరులకు తెలిపారు.

బళ్లారిలో చికిత్స పొందుతున్న శేఖర్‌

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరుల దాడుల్లో తీవ్రంగా గాయపడిన గొల్ల సామాజికర్గానికి నక్కలదొడ్డి శేఖర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆయనను కర్ణాటక రాష్ట్రం బళ్లారి నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి టీడీపీ నాయకులు తరలించారు. యాక్సిడెండ్‌ జోన్‌ బ్లాక్‌లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో తలకు బలమైన గాయం కావడంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు.

ఎమ్మెల్యే విరూపాక్షిపై మరో కేసు నమోదు

టీడీపీ నాయకుల ఇళ్లపై ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు దాడులకు తెగపడ్డారని తెలిసి తమ నాయకులను పరామర్శించడానికి నేమకల్లు గ్రామానికి వస్తున్న చిప్పగిరి టీడీపీ మండల కన్వీనర్‌ వాల్మీకి/బోయ సామాజికివర్గానికి కొండా పురుషోత్తంపై వైసీపీ శ్రేణులు కర్రలతో దాడులకు తెగబడి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. బీసీ వాల్మీకి ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్న విరూపాక్షి అదే సామాజికవర్గానికి చెందిన టీడీపీ నేతపై దాడులకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై కొండా పురుసోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ సహా 12 మందిపై చిప్పగిరి పోలీస్‌ స్టేషన్‌లో సీఆర్‌ నంబరు.40/2026, బీఎన్‌ఎస్‌ 126(2), 115(2), 324(4) అర్‌/డబ్ల్యూ 3 (5) సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Aug 03 , 2026 | 11:39 PM