హైవే పూర్తయ్యేనా?
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:16 PM
హైవే పూర్తయ్యేనా?
రోడ్డు విస్తరణ పనుల్లో నిర్లక్ష్యం
సహకరించని కేఎంసీ అధికార యంత్రాంగం
తల పట్టుకుంటున్న ఎన్‌హెచ్ శాఖ
నాణ్యతపై అనుమానాలు
నగర శివారులో హైవే 341సీ రోడ్డు నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? అనేది సర్వత్రా ప్రశ్నార్థకంగా మారింది. కర్నూలు- గుంటూరు జాతీయ రహదారి నిర్మాణానికి నంద్యాల చెక్‌పోస్టు నుంచి గార్గేయపురం వరకు 9 కిలోమీటర్లకు రూ.60కోట్ల నిధులు 2022 ఫిబ్రవరి 4న కేటాయించారు. భూసేకరణ .. నిధుల జారీలో జాప్యం జరిగింది. అధికారులు గడువు మీద గడువు కోరుతూ వచ్చారు. ప్రస్తుతం మరో మూడు నెలల గడువు కోరారు. ఆలోపైనా పనులు పూర్తయితాయా? అంటే.. అనుమానమే అనేది స్పష్టంగా కనిపిస్తోంది.
కర్నూలు అర్బన్, మార్చి 25(ఆంధ్రజ్యోతి): నగర శివారులో హైవే 341సీ రోడ్డు నిర్మాణం 4 ఫిబ్రవరి 2023కి పూర్తికావాల్సి ఉంది. గార్గేయపురం నుంచి పుల్లయ్య కళాశాల వరకు నిర్మాణాలు 80శాతం పూర్తిచేశారు. అక్కడి నుంచి నగరం లోని నంద్యాల చెక్‌పోస్టు వరకు 2.88 కిలోమీటర్ల పనులు మొం డికేశాయి. భూసేకరణ పరిహారం టీడీఆర్ బాండ్ల జారీలో నిర్లక్ష్యంగా బాధితులు నిర్మాణాలను అడ్డుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి జోక్యంతో ప్రస్తుతం నిర్మాణాలు ముందుకు సాగుతున్నప్పటికీ ఇక్కట్లు తప్పడం లేదు. ఫలి తంగా నేటికి పూర్తికాకపోవడంతో మరో 3నెలల గడువును ఎన్ హెచ్ శాఖ కోరింది.
అటకెక్కిన నిర్మాణాలు
కర్నూలు కార్పొరేషన్ అధికారులు రోడ్ల విస్తరణ పనుల నిర్మాణాలకు సహకరించడం లేదని ఎన్ హెచ్ శాఖ ఆరోపిస్తోంది. టీడీపీ పాలనలో 2018లోనే హైవే నిర్మాణాలకు ప్రతిపాదనలు పూర్తయిన్పటికీ 2022లో టెండర్ల దశ ముగించుకుని రోడ్లు విస్తరణ పనులు ప్రారంభించారు. ఈనిర్మాణాలపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నగరపాలక సంస్థకు కమిషనర్ల బదిలీలు, ఎన్‌హెచ్ శాఖ చేపట్టిన రోడ్డు నిర్మాణాలకు ఇబ్బందికరంగా తయారైంది. నిర్మాణాలకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై నిర్లక్ష్యం కారణంగా నిర్మాణాలు అటకెక్కాయి.
నేటికీ కొనసాగుతున్న జాప్యం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి రోడ్లు భవనాల శాఖకు ఉన్నప్పటికీ పనుల్లో పురోగతి లేదనే విమర్శలు న్నాయి. కర్నూలు నుంచి రాజధాని అమరావతికి జాతీయ రహదారిని కేంద్రం నిర్మాణాలకు అవసరమైన నోటిఫికేషన్ జారీ చేసి టెండర్లు ఖరారు, నిర్మాణాల్లో జాప్యం జరిగింది.. ఆదే జాప్యం నేటి వరకు కొనసాగుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
లబోదిబోమంటున్న బాధితులు
నగరంలోని 2.88 కిలోమీటర్ల రోడ్డుకిరువైపుల భూసేకరణలో స్థలాలు కోల్పోయిన 216 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. పరిహారం అందించకపోవడంతో నాలుగేళ్లుగా టీడీఆర్ బాండ్ల జారీలో జాప్యం జరుగుతూ వస్తోంది. నగరపాలక సంస్థ(కేఎంసీ) అఽధికారులు జారీచేయాల్సి ఉండగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు నిర్మాణాలను ముందుకు సాగకుండా అడ్డుకుం టున్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఎన్‌హెచ్ ఉన్నతాధికారులు బాధితులకు హామీఇస్తూ నిర్మాణాలు ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒమెగా ఆస్పత్రి సమీప పరిసరాల్లో కొందరు భూయజమానులు నిర్మాణాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
తూతూ మంత్రంగా..
నిర్మాణాల్లో నాణ్యతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఎస్ గార్డెన్ నుంచి సెయింట్ జోసేఫ్ కళాశాల వరకు గల రోడ్డు నిర్మాణాల్లో పాత రోడ్డును తొల గించకుండానే వాటిపైనే మట్టివేసి తూతూ మంత్రంగా పనులు కొన సాగిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. పాత రోడ్డుపై మట్టిని వేసి నిర్మాణాల ప్రక్రియను పూర్తిచేయడంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని వాహనదారులు అంటున్నారు.
మరో 3 నెలలు గడువు కోరాం
భూసేకరణ జాప్యంతో నిర్మాణాల్లో ఆలస్యం అవుతోంది. మరో 3నెలలు గడువు కోరాం. నాణ్యతలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తేలేదు. నంద్యాల చెక్‌పోస్టు నుంచి ఎస్‌ఎస్ గార్డెన్ వరకు నిర్మాణాలు పూర్తిచేస్తున్నాం.
జగదీష్ గుప్త, డీఈ, ఎన్ హెచ్ శాఖ