Share News

జడ్పీ పీఠముడి వీడేనా?

ABN , Publish Date - Oct 29 , 2026 | 11:05 PM

కర్నూలు జడ్పీ పీఠం రేసులో ఎవరున్నదీ అంతుచిక్కని ప్రశ్న.

జడ్పీ పీఠముడి వీడేనా?

రేసులో కౌతాళం జడ్పీటీసీ అభ్యర్థి ఉలిగయ్య

కొత్తగా తెరపైకి షేక్‌ సాదిక, జ్ఞానేశ్‌ పేర్లు

రుద్రఫణి నామినేషన్‌ తిరస్కరణతో మారిన సమీకరణలు

టీడీపీ అధినేత మనసులో ఎవరున్నట్లు?

ఆశావహుల్లో ఉత్కంఠ

కర్నూలు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జడ్పీ పీఠం రేసులో ఎవరున్నదీ అంతుచిక్కని ప్రశ్న. మొదటి నుంచి రేసులో ఉన్నవారిలో కొందరు నామినేషన్‌ దశలోనే వెనకబడ్డారు. మరికొందరి పేర్లు అనూహ్యంగా తెరపైకి వస్తున్నాయి. రాజకీయ అనుభవం, పార్టీలో సీనియారిటీ, సామాజిక సమీకరణలు, పార్టీ విధేయత.. వీటిలో దేనికి ప్రాధాన్యత దక్కనుంది? కీలకమైన జడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికపై టీడీపీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. కౌతాళం జడ్పీటీసీ అభ్యర్థి చుడి ఉలిగయ్య పేరు మొదట నుంచి వినిపిస్తుంది. కేఈ రుద్రఫణి నామినేషన్‌ తిరస్కరణకు గురికావడంతో జడ్పీ చైర్మన్‌ ఎంపికపై రాజకీయ సమీకరణలు మా రుతున్నాయి. తాజాగా దేవనకొండ, కోసిగి జడ్పీటీసీ అభ్యర్థులు షేక్‌ సాదిక, జ్ఞానేశ్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చైర్మన్‌ ఎంపికపై అంతిమ నిర్ణయం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుదే. ఆయన మనసులో ఎవరున్నారు? అన్నది హాట్‌ టాపిక్‌గా మారింది.

తొలి చైర్మన్‌గా మసాల ఈరన్న

1987లో జడ్పీకి తొలిసారిగా నిర్వహించిన ప్రత్యక్ష ఎన్నికల్లో దివంగత ఆలూరు మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న విజయం సాధించి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 2026 సెప్టెంబరు వరకు 16 మంది జడ్పీ చైర్మన్లుగా పని చేశారు. వారిలో ఏడుగురు రెడ్డి, నలుగురు బీసీ, ముగ్గురు ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన వారు ఉన్నారు. ముస్లిం మైనార్టీ సామాజికవర్గానికి చెందిన మహిళ కేవలం ఐదు రోజులు మాత్రమే చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా జరుగుతన్న ఎన్నికల్లో జడ్పీటీసీగా విజయం సాధించి 17వ జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేది ఎవరు? అన్న దానిపై జిల్లాలో ప్రధాన చర్చగా మారింది.

పలువురు పోటీకి సై..

కర్నూలు జడ్పీలో 26 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు తరువాత టీడీపీ 21, జనసేన 3, బీజేపీ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కేఈ రుద్రఫణి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థి కటారికొండ మర్రి శ్రీరాములుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. ఎన్నికల ప్రచార సరళి పరిశీలిస్తే టీడీపీ సారథ్యంలోని కూటమి విజ యం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జడ్పీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం, చైర్మన్‌ పీఠం బీసీ జనరల్‌కు రిజర్వు చేయడంతో చైర్మన్‌ పీఠం కోసం టీడీపీలో పలువురు పోటీకి సై అన్నారు.

తెరపైకి ఉలిగయ్య పేరు..

మొదట కౌతాళం జడ్పీటీసీ అభ్యర్థి గోతులదొడ్డి చుడి ఉలిగయ్య పేరు తెరపైకి వచ్చింది. తర్వాత ఏపీ వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, హొళగుందకు చెందిన సీనియర్‌ నాయకుడు ఈడిగ గోవిందగౌడ్‌, ఏపీ కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గాజలదిన్నె రామకృష్ణ పేర్లు వినిపించాయి. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ తన యుడు కేఈ రుద్రఫణి జడ్పీ చైర్మన్‌ ఆశిస్తూ కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఆయన కాబోయే జడ్పీ చైర్మన్‌ అని అందరు భావించారు. ఆయన ఓటు కర్నూలు అర్బన్‌ పరిధిలో ఉండటంతో నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. అధిష్టానం బీ-ఫారాలు ఇవ్వకపోవడంతో కప్పట్రాళ్ల బొజ్జమ్మ. రామకృష్ణ నామినేషన్లు ఉప సంహరించుకోగా గోవిందగౌడ్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా చుడి ఉలిగయ్య ఒక్కరే రేసులో మిగిలారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నాడు ఆదోని, ప్రస్తుతం మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ లోనే కొనసాగుతున్న ఉలిగయ్యకు చైర్మన్‌ పీఠం ఖాయమని విశ్లేషకులు అంచనాలు వేశారు. తాజాగా దేవనకొండ, కోసిగి మండలాల జడ్పీటీసీ స్థానాల నుంచి బరిలో దిగిన షేక్‌ సాధిక, జ్ఞానేశ్‌ పేర్లు తెరపైకి రావడం కొసమెరుపు. ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

జిల్లా అంతటా చర్చ

జడ్పీ చైర్మన్‌ ఎంపికలో అంతిమ నిర్ణయం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌దే అని ఆ పార్టీ వర్గీయులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జడ్పీ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టిన వారిలో బీసీలు కేవలం నలుగురే. కేఈ కృష్ణమూర్తి, మల్లెల రాజశేఖర్‌ ఈడిగ సామాజికవర్గం కాగా బత్తిన వెంకటరాముడు కురువ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన సి.తిక్కన్న ఇన్‌చార్జి చైర్మన్‌గా కేవలం నాలుగైదు నెలలే పనిచేశారు. జడ్పీ ఎన్నికల్లో వాల్మీకి సామాజిక వర్గానికి జడ్పీ చైర్మన్‌ పీఠం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. ఆ వర్గానికి చెందిన ఉలిగయ్య రేసులో ముందు వరుసలో ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అక్క కొడుకు జ్ఞానేశ్‌ తెరపైకి వచ్చింది. అంతిమ నిర్ణయం అధినేత చందబాబుదే అంటున్నారు. ఆయన మనసులో ఎవరున్నారో? జిల్లా అంతటా జరుగుతున్న చర్చ.

Updated Date - Oct 29 , 2026 | 11:05 PM