Share News

తప్పించుకోలేరు..!

ABN , Publish Date - May 26 , 2026 | 12:52 AM

గతంలో ఎవరైనా వ్యక్తి అదృశ్యమైతే ఆ వ్యక్తి ఫొటో తీసి అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించేవారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఆ వ్యక్తిని గుర్తిస్తే తప్ప కేసును చేధించలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చులతో కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా అంతటా వెతుకుతూ అదృశ్యమైన వ్యక్తి కోసం గాలించేవారు

తప్పించుకోలేరు..!

పోలీసుల అమ్ముల పొదిలో మరో అస్త్రం

అత్యాధునిక టెక్నాలజీతో దర్యాప్తు

మిస్సింగ్‌ కేసుల ఛేదనలో పురోగతి

కర్నూలు జిల్లాలో 772 మ్యాట్రిక్‌ స్టార్ట్‌ సీసీ కెమెరాలు

సత్ఫలితాలిస్తున్న నూతన పద్ధతి

కర్నూలు క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): గతంలో ఎవరైనా వ్యక్తి అదృశ్యమైతే ఆ వ్యక్తి ఫొటో తీసి అన్ని పోలీస్‌ స్టేషన్లకు పంపించేవారు. ఆయా స్టేషన్ల పరిధిలో ఆ వ్యక్తిని గుర్తిస్తే తప్ప కేసును చేధించలేని పరిస్థితి. దీంతో కుటుంబ సభ్యులు తమ సొంత ఖర్చులతో కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా అంతటా వెతుకుతూ అదృశ్యమైన వ్యక్తి కోసం గాలించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒకసారి అదృశ్యమైన వ్యక్తి ఫొటోను సీసీ కెమెరాకు చూపిస్తే చాలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాలో ఆ వ్యక్తి తిరిగినా వెంటనే పసిగట్టేస్తుంది. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో కర్నూలు పోలీసులు ముందంజలో ఉన్నారు. ఇటీవల అదృశ్యమైన ముగ్గురు వ్యక్తులను ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే వెతికి పట్టుకోగలిగారు. అసలు ఏంటి ఆ సాంకేతిక పరిజ్ఞానం.. ఎలా పోలీసులు వినియోగిస్తున్నారో అనే కథనంపై ఆంధ్రజ్యోతి కథనం...

ఎఫ్‌ఆర్‌ఎస్‌ అంటే

ఫేషియల్‌ రికగ్నజేషన్‌ సిస్టమ్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌) టెక్నాలజీ యాప్‌తో తప్పిపోయిన, పాత నేరస్థుల ముఖచిత్రాలు ఫీడ్‌ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనలిటిక్స్‌ కెమెరాలో తప్పిపో యిన, పాత నేరస్థుల ముఖ చిత్రాలు కనిపిస్తే వెంటనే ఆయా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లలో ఉన్న మానిట రింగ్‌ సిస్టమ్స్‌ అలాట్‌ అవుతాయి. ఒక పోలీస్‌ స్టేషన్‌లో ఒక వ్యక్తి తప్పిపోయాడని ఫిర్యాదు నమోదైన తర్వాత ఆ వ్యక్తి ముఖ చిత్రాన్ని ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లో నమోదు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనలిటిక్స్‌ కెమెరాలో ఆ వ్యక్తి ఎక్కడైనా తారసపడితే సంబంధిత పోలీస్‌ స్టేష న్‌లకు ముందే సమాచారం అందుతుంది. దీం తో వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుంటారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం తప్పిపోయిన వ్యక్తులతో పాటు దొంగలను, పాత నేరస్థులను గుర్తించేలా ఎఫ్‌ఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ కెమెరాలు వ్యక్తుల ముఖాలు గుర్తించే ఆధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ కెమెరాలు వ్యక్తుల ముఖాలను స్కాన్‌ చేసి పోలీస్‌ డేటా బేస్‌లో ఉన్న ఫొటోలతో పోల్చి వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తాయి. దీంతో ప్రాపర్టీ నేరస్థులు, పరారిలో ఉన్న నిందితులు నేరచరిత్ర కలిగిన వ్యక్తుల అనుమానస్పద కదలికలపై పోలీసులకు కమాండింగ్‌ వస్తుంది. బస్టాండులు, రైల్వేస్టేషన్లు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, మార్కెట్‌ యార్డులలో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఆధునిక టెక్నాలజీ

రాష్ట్ర వ్యాప్తంగా కనిపించకుండా పోయిన ఆ వ్యక్తులను గుర్తించేందుకు పాత నేరస్థుల కదలికలను పసిగట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. ‘సీసీటీఎన్‌ఎస్‌ ఏపీ 360 యాప్‌’ ద్వారా ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌) టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌ నెట్‌ సర్వీసుల ఆధారంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 15వేల అనలిటిక్స్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో 722 మ్యాట్రిక్స్‌ స్మార్ట్‌ టెకాల్నజీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలో ఎఫ్‌ఆర్‌ఎస్‌, ఏఎన్‌పీఆర్‌ (ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌) లాంటి ఇతర అనలిటిక్స్‌ కెమెరాలు పని చేస్తాయి. ఈ కెమెరాలన్నీ అమరావతిలో ఆర్‌టీజీఎస్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఈ యాప్‌కు కంట్రోల్‌ చేయబడుతుంది. ఈ యాప్‌ అన్ని జిల్లాలో పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లు, పోలీస్‌ స్టేషన్లకు అనుసంధానించారు.

ఇటీవల ఛేదించిన కేసులు

ఫ పెద్దకడుబూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హెచ్‌.మురవని గ్రామానికి చెందిన ఓ బాలిక అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా ఆ బాలికతో పాటు మరో యువకుడు వెళ్లిపోయాడని గుర్తించిన పోలీసులు ఆ ఇద్దరి ఫొటోలను సీసీటీఎన్‌ఎస్‌ ఏపీ 360 యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. తిరుపతి బస్టాండులో ఏర్పాటు చేసిన ఓ సీసీ టీవీలో వీరి కదలికలు రికార్డు కావడంతో తిరుపతి పోలీసులు కర్నూలు కమాండ్‌ కంట్రోల్‌ కు అలర్ట్‌ చేశారు. పెద్దకడుబూరు పోలీసులు తిరుపతి పోలీసులతో మాట్లాడి ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం సీసీటీఎన్‌ఎస్‌ 360 యాప్‌ ద్వారా గుర్తించి ఆ ఇద్దరిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

నందవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అధృశ్యమైంది. ఈ బాలికతో పాటు మరో యువకుడు వెళ్లిపోయాడన్న గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వా రా వీరిద్దరు విజయవాడలో ఉన్నట్లు గుర్తించారు. తీరా వారిని అదుపులోకి తీసుకున్న సమయంలో వారు కనిపించలేదు. ఎట్టకేలకు వారు మరో సీసీటీవీలో వారి కదలికలు రికార్డు కావడంతో వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

తాలుకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ అదృశ్యం కేసులో తప్పిపోయిన వ్యక్తి మదనపల్లిలో ఉన్నట్లు గుర్తించి సురక్షితంగా తీసుకువచ్చి బందువులకు అప్పగించారు.

ఏఎన్‌పీఆర్‌ అంటే..?

ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ ద్వారా ఏదైనా వాహనం దొంగలిం చబడితే.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వాహనం నెంబర్‌ను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ అన్ని కెమెరాల్లో ఆ నెంబర్‌ ప్లేట్‌ను గుర్తించిన వెంటనే సమాచారం పోలీసులకు చేరుతుంది.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ కెమెరాలతో సత్ఫలితాలు

కర్నూలు జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఎఫ్‌ఆర్‌ఎస్‌ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. ఈ టెక్నాలజీ ద్వారా మిస్సింగ్‌ వ్యక్తుల, నేరస్థుల ట్రాకింగ్‌ సులువు అవుతుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎవరైనా తప్పిపోతే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వాహనాలు కనిపించకుండా పోయిన సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది. - విక్రాంత్‌ పాటిల్‌, ఎస్పీ, కర్నూలు

Updated Date - May 26 , 2026 | 12:52 AM