Share News

గుండ్రేవుల నిర్మిస్తా

ABN , Publish Date - Feb 06 , 2026 | 11:50 PM

గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య అని, తెలంగాణ, కర్ణాటక భూములు కూడా ముంపుకు గురవుతాయి

గుండ్రేవుల నిర్మిస్తా
ప్రసంగిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు

వేదవతి, ఆర్డీఎస్‌ పూర్తి చేస్తా

కర్నూలు-బళ్లారి నేషనల్‌ హైవే రోడ్డు నిర్మాణానికి చర్యలు

గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.45 కోట్లు మంజూరు

పులికనుమ సామర్థ్యం పెంచేందుకు చర్యలు

కలుగొట్ల సభలో సీఎం చంద్రబాబు

మీ భూమి- మీ హక్కు సభ సూపర్‌ సక్సెస్‌

కర్నూలు/ఎమ్మిగనూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి) గుండ్రేవుల జలాశయం మూడు రాష్ట్రాల మధ్య సమస్య అని, తెలంగాణ, కర్ణాటక భూములు కూడా ముంపుకు గురవుతాయి కాబట్టి ఆ రాష్ట్రాలతో సంప్రదించి ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో సర్పంచ్‌ చిట్టెమ్మ అధ్యక్షతన ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామ సభ నిర్వహించారు. కలుగొట్లలో 1884 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు తరలి వచ్చారు. కలుగొట్ల పొలాలు రైతులతో నిండిపోయాయి. చంద్రబాబును చూసేందుకు పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. అంతకుముందు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వేదికపై రైతులతో మాట్లాడారు. పట్టాదారు పాసు పుస్తకంలో అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయా..? అంటూ కలుగొట్లకు చెందిన రైతులు బుడగ జంగాల నడిపన్న, రంగన్న గౌడ్‌లను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు వేదికపై రైతులు నీరుగంటి రాముడు, ఈడిగ సుజాతలకు స్థానం కల్పించారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు రైతులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. చంద్రబాబు హయాంలోనే తమకు మద్దతు ధర, రైతులకు భరోసా లభిస్తుందని నినదించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానన్నారు. గతంలో గుండ్రేవుల ప్రాజెక్టుకు తానే నిధులు ఇచ్చానని, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో చర్చించి ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. తుంగభద్ర జలాలు కర్నూలు జిల్లా ఎక్కువగా వినియోగించుకుని పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేలా చేస్తామన్నారు. వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తే ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి తీసుకుంటుందని వివరించారు. అదే క్రమంలో ఆర్డీఎస్‌ కుడికాలువ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి సాగునీరు ఇస్తామని చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వంలో గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని, ఈ ప్రాజెక్టు మరమ్మతుల కోసం రూ.44 కోట్లు ఇప్పుడే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమకు గత టీడీపీ ప్రభుత్వంలో 120 ప్రాజెక్టులు మంజూరు చేస్తే ఆ తర్వాత వచ్చిన వైసీపీ పాలకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చంద్రబాబు వివరించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు విన్నపం మేరకు కర్నూలు- బళ్లారి జాతీయ రహదారి నిర్మాణం చేపడతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మిగనూరు- బళ్లారి మీదుగా డోర్నగల్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

టెక్స్‌టైల్‌ పార్కు ద్వారా చేనేతలకు ఉపాధి

ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మెగా టెక్స్‌టైల్‌ పార్కులో భాగంగా సాకారం అందిస్తుంది. దీని ద్వారా 2వేల మంది చేనేతలకు ఉపాధి లభిస్తుందని చంద్రబాబు వివరించారు. ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు పులికనుమ ప్రాజెక్టును 3.5 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతాం.. గాజులదిన్నె ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు బైపాసు రోడ్డుకు రూ.130 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని చంద్రబాబు వివరించారు. జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించే బాధ్యత తీసుకుంటామన్నారు. కలుగొట్ల గ్రామంతో పాటు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శ్మశానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను చంద్రబాబు ఆదేశించారు. కర్నూలు ఉల్లి రైతులను ఆదుకోవాలనే లక్ష్యంగా హెక్టారుకు రూ.50వేలు బోనస్‌ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని తెలిపారు.

మా కుటుంబంతో బీవీకి విడదీయని అనుబంధం

ఎమ్మిగనూరు అంటేనే గుర్తుకు వచ్చేది బీవీ మోహన్‌రెడ్డి అనొ, ఆయనకు తమ కుటుం బంతో, ఎన్టీఆర్‌ కుటుంబంతో విడదీయరాని అనుబంధం ఉందని చంద్రబాబు అన్నారు. తమ ఇంట్లోకి నేరుగా వచ్చే స్వేచ్ఛ ఒక్క బీవీకే ఉందని గుర్తు చేశారు. ఆయన బతికి ఉన్నప్పుడు పట్టుబట్టి గురురాఘవేంద్ర ప్రాజెక్టును సాధించుకున్నారని తెలిపారు. బీవీ మోహన్‌రెడ్డి కుటుంబం టీడీపీకి నిబద్ధతగా ఉంటుందని తనకు తెలుసని, ఆయన తనయుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలంటూ తన వెంట పడుతున్నారని, ఇది మంచి పద్ధతి అని చంద్రబాబు పేర్కొన్నారు.

కార్యకర్తలే పార్టీకి జీవనాడులు

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి

టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు

కర్నూలు/ ఎమ్మిగనూరు/ టౌన్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు సూపర్‌ సిక్స్‌, బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీతో ముందుకు వెళ్లాం.. కార్యకర్తలు కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో 2024 ఎన్నికల్లో ఊహించని విజయం అందుకున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కలుగొట్ల దగ్గర పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తెలుగు తమ్ముళ్లను ఉత్తేజపరుస్తూ ప్రసంగం సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లు రూ.4వేలు, రూ.6వేలు, రూ.10వేలు, రూ.15వేలు ఇస్తున్నాం. నెలనెల రూ.3వేల కోట్లచొప్పున ఏడాదికి దాదాపు రూ.35కోట్లు ఇస్తున్నాం. పింఛన్‌ పంచేటప్పుడు ప్రతి కార్యకర్త వెళ్లాలి.. ప్రజలకు కార్యకర్తలే కనిపించాలి. అప్పుడే మనకు ఓట్లుగా మారుతారని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో 90శాతం సంతృప్తి తీసుకురావాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లే బాధ్యత మీరు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఏవైనా ఏకపక్షంగా విజయం సాధించే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు. ఇండియా టుడే సర్వేలో ఎంతో పాజిటివ్‌ ఉందన్నారు. అదే ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయాల న్నారు. ఈ మూడేళ్లలో 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలను కలుస్తానన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గతంలో పోలిస్తే సంతృప్తి పెరిగిందని, అది మహిళల్లో ఎక్కువగా ఉందని సూచించారు. పురుషుల్లో కూడా పార్టీపై అభిమానం పెరిగేలా చూడాలన్నారు. ప్రధాని మోదీని చూసి కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో నన్ను, పవన్‌ కల్యాణ్‌ను చూసి టీడీపీ, జనసేన కార్యకర్తలు ఓట్లు వేస్తారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 86శాతం సంతృప్తి ఉంటే, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిపై 91శాతం పాజిటివ్‌ ఉందని వివరించారు. ప్రజలకు న్యాయం జరగాలంటే ఎమ్మెల్యే ఇక్కడే ఉం డాలని హితోపదేశం చే శారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, టీజీ భరత్‌, అనగాని సత్యప్రసాద్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, కేఈ శ్యాంబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌, ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్‌, ఆదోని, మంత్రాలయం, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జిలు మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, ఎన్‌.రాఘవేంద్రారెడ్డి, వైకుంఠంజ్యోతి, కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంక టేశ్వర్లు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ నాగేశ్వరరావు యాదవ్‌, మారె ్కట్‌ యార్డు చైర్మన్‌ మల్లయ్య, కురువ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 11:50 PM