సామాజిక తనిఖీలపై సర్వత్రా విమర్శలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:34 AM
మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో 2024 - 25 సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల్లో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించి రూ.9కోట్లతో జరిగిన పనుల్లో రూ.23,645 అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చడంతో మండలంలో తనిఖీల బృందంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కోవెలకుంట్ల, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని 17 గ్రామపంచాయతీల్లో 2024 - 25 సంవత్సరంలో జరిగిన ఉపాధి పనుల్లో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించి రూ.9కోట్లతో జరిగిన పనుల్లో రూ.23,645 అక్రమాలు జరిగినట్లు నిగ్గు తేల్చడంతో మండలంలో తనిఖీల బృందంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం పట్టణంలోని ఉపాధి హమీ కార్యాలయం ఆవరణంలో ఉపాధి హమీ పథకం జిల్లా అధికారి సూర్యనారాయణ అధ్యక్షతన సామాజిక తనిఖీ బహిరంగ సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో జరిగిన తనిఖీలపై డీఆర్‌పీలు ప్రగతిని చదివి వినిపించారు. మండలంలో 01/04/2024 నుంచి 31/03/2025 వరకు వివిధ గ్రామాల్లో మొత్తం రూ.9 కోట్లతో ఉపాధి పనులు జరిగాయి. ఈ పనుల్లో అక్రమాలను బటయపెట్టేందుకు సామాజిక తనిఖీ బృందం 17/11/2025 నుంచి 14/02/2026 వరకు గ్రామాలలో సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించి రూ 23,645లు అక్రమాలు జరిగినట్లు నిరూపించారు. దీంతో జిల్లా అధికారులు రికవరీకి ఆదేశించారు. ఇంతకు ఉపాధి హమీ పథకం పనులలో అవినీతి జరిగిందా ? లేక తనిఖీ బృందం ఉపాధి సిబ్బంది ఒకటయ్యారా అనే విమర్శలు మండలంలో వినిపిస్తున్నాయి. ఏపీడీ సాంబశివరావు, డివిఓ పరమేశ్వరుడు, ఎస్‌ఆర్‌పి చంద్రమోహన్, ఎంపిడిఓ వరప్రసాదరావు, ఏపీవోలు శ్రీకళ, శ్రీవిద్య, ఈసీలు హరికిశోర్, మగ్బుల్, ఉపాధి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.