విధులు నిర్వహించకపోతే జీతాలెందుకు?
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:12 AM
మండలంలో ఉపాధి కూలీలకు పనులు కల్పించలేనప్పుడు మీకు జీతాలెందుకివ్వాలని పీడీ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఉపాధి సిబ్బందిపై పీడీ సూర్యనారాయణ ఆగ్రహం
కొలిమిగుండ్ల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఉపాధి కూలీలకు పనులు కల్పించలేనప్పుడు మీకు జీతాలెందుకివ్వాలని పీడీ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సామాజిక తనీఖీ బహిరంగ సభ నిర్వహించారు. కూలీల పని దినాలను పరిశీలించిన పీడీ, గ్రామాల్లో 10, 20శాతం మందికి మాత్రమే పని కల్పించడం పట్ల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవీవో పరమేశ్వరుడు, ఎస్‌అర్‌పీ చంద్రమోహన్, ఎంపీడీవో దస్తగిరిబాబు, ఎపీవో తదితరులు పాల్గొన్నారు.
తనిఖీల్లో వెలుగుచూడని అవినీతి
సామాజిక తనిఖీల్లో అవినీతి వెలుగు చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2024-25 సంవత్సరానికి సంభంధించి మండలంలో రూ.9.60కోట్లు నిధులు ఖర్చు చేశారు. నెల రోజులుగా సామాజిక తనీఖీ బృందాలు గ్రామాల్లో పర్యటించి, తనిఖీలు నిర్వహించారు. మంగళవారం మండల స్థాయి బహిరంగ సభ నిర్వహించారు. అయితే అధికారులు కేవలం రూ.71,585 మాత్రమే అవినీతి చోటుచేసుకుందని, రికవరీకి ఆదేశించారు. మరోవైపు బహిరంగ సభలో ఉపాధి అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తనీఖీ బృందం సభ్యులు మాత్రమే కనిపంచగా, కూలీలు రైతులు, ప్రజలెవ్వరూ ఈసభలో పాల్గొనలేదు.