విజయం ఎవరిదో?
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:13 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం విజయ డెయిరీ వ్యవహారం వేడిపుట్టిస్తోంది.
తారస్థాయికి విజయ డెయిరీ వ్యవహారం తాజాగా ముగ్గురు డైరెక్టర్ల
నియామకానికి నోటిఫికేషన్
డైరెక్టర్ల ఎన్నికకు 46 మందికే అవకాశం
ఓటింగ్‌కు 39 మందికి అనర్హత
చర్చనీయాంశంగా డెయిరీ తీర్మానాలు
నంద్యాల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం విజయ డెయిరీ వ్యవహారం వేడిపుట్టిస్తోంది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డెయిరీపై ఆధిపత్యం సాధించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు భూమా విఖ్యాత్ వర్గం చూస్తోంది. అయితే ప్రస్తుత డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి అధికారపార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఇటీవల డెయిరీలో పలు కీలక అంశాలు, నిర్ణయాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పక్కా స్కెచ్‌తో డెయిరీ యాజమాన్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. చైర్మన్ ఎంపికలో కీలకంగా వ్యవహరించే బోర్డు కమిటీలో మూడు డైరెక్టర్ పదవులు ఖాళీ అయ్యాయి. ఆ డైరెక్టర్ స్థానాల ఎన్నిక కోసం సోమవారం ఎన్నికల అధికారి హరిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. మ్యాక్స్ నిబంధనల ప్రకారం డెయిరీకి చెందిన 15 మంది డైరెక్టర్ల జాబితాలో ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో ముగ్గురు డెరెక్టర్ల పదవులు (పురుషులు-2, మహిళ-1) ముగుస్తాయి. పాల సొసైటీ సభ్యులు సొసైటీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన అధ్యక్షులు బోర్డు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైన 15 మంది బోర్డు డైరెక్టర్లు డెయిరీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం మూడు కీలకమైన డైరెక్టర్ పదవులకు సంబంధించి ఎన్నికల అధికారి హరిబాబు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్, అదే రోజున నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, తిరస్కరణకు అవకాశం ఇచ్చారు. తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులకు 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్లు లెక్కించి ఫలితాలను విడుదల చేస్తారు.
46 మందితో కూడిన జాబితా విడుదల
రాష్ట్రమంతా కూటమి ప్రభుత్వ హవా కొనసాగుతుంటే విజయ డెయిరీలో మాత్రం వైసీపీదే పైచేయి. ప్రస్తుత చైర్మన్, మేనేజర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి డెయిరీకి చెందిన పలు విషయాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో నిబంధనలకు లోబడి ఎన్నికల నిర్వహణ, సమావేశాలు నిర్వహిస్తున్నామని డెయిరీ వర్గం చెబుతోంది. ఈ క్రమంలో తాజా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వైసీపీ పాలనలో డెయిరీ పరిధిలో 89 సొసైటీలు ఉన్నాయి. అయితే గతేడాది భూమా జగత్ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె సొసైటీని పక్కా ప్రణాళికతో రద్దు చేయించారు. అదే విధంగా పాణ్యం మండలం నెరవాడ సొసైటీ, గోనవరం సొసైటీలను కూడా రద్దు చేసి అధ్యక్షులు సరళమ్మ, సుబ్బరాయుడులను అనర్హులుగా ప్రకటించారు. శిరివెళ్ల మండల సొసైటీ అధ్యక్షుడు సుబ్బరాయుడిపై కూడా ఇదేవిధంగా వేటువేశారు. వివిధ లోపాలను చూపుతూ ఆయా సొసైటీలను రద్దు చేయడంలో చైర్మన్ ఎస్వీ జగన్‌మోహన్ రెడ్డి విజయవంతం అయ్యారు. మిగిలిన 85 సొసైటీలలో తమకు అనుకూలంగా ఉన్న 46 సొసైటీలకు చెందిన అధ్యక్షులతో ఇటీవల కర్నూలులో బోర్డు మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌కు హాజరు కాలేదని సాకుగా చూపి 39 మంది అధ్యక్షులను తాజా ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు మీటింగ్‌కు హాజరైన 46 మంది అధ్యక్షులు మాత్రమే ఈ మూడు డైరెక్టర్లను ఎన్నుకునేందుకు అర్హులుగా ప్రకటించడం పలు విమర్శలకు తావిస్తోంది.
పెరిగిన పోటీ : కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి చైర్మన్ పీఠం కోసం చేయని ప్రయత్నాలు లేవు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లవుతున్నా డెయిరీ సమస్య కొలిక్కి రాలేదు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భూమా విఖ్యాత్ కాకుండా.. మరో టీడీపీ కీలక నాయకుడి పేరు కూడా డెయిరీ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీలోనూ డెయిరీ పీఠం కోసం పోటీ పెరిగింది. విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం అటు వైసీపీతో పాటు ఇటు టీడీపీలోను ఉత్కంఠ రేపుతోంది.
కోర్టును ఆశ్రయించనున్న భూమా విఖ్యాత్
డెయిరీలో నిత్యం జరిగే పరిణామాలు, తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ పక్రియ.. తమ సోసైటీ రద్దు తదితర అంశాలపై భూమా విఖ్యాత్‌రెడ్డి కోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే డెయిరీ వ్యవహారం టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. డెయిరీలో తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించి ఎన్నికపై స్టే తెచ్చేందుకు భూమా విఖ్యాత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేకాధికారిని నియమించి డెయిరీ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికార టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.