గెలుపు ఎవరిది?
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:47 PM
నగర పంచాయతీకి ఆదివారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. చైర్మన్, 28 వార్డులకు 119 మంది పోటీ చేశారు.
నేడు డోన్ మున్పిపాలిటీ, బేతంచెర్ల
నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
బేతంచెర్ల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): నగర పంచాయతీకి ఆదివారం ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. చైర్మన్, 28 వార్డులకు 119 మంది పోటీ చేశారు. చైర్మన్ పీఠం కోసం టీడీపీ అభ్యర్దిగా లోకేశ్ గౌడ్, వైసీపీ అభ్యర్ధిగా దస్తగిరి, స్వతంత్ర అభ్యర్ధులుగా దూదేకుల ఖాజాబీ, నూర్ కమాల్, పాలకొల్లు హరి ప్రసాద్, కిరణ్ కుమార్, రియాజ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. గెలుపుపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కర్నూలు రహదారి గోరుమానుకొండ సమీపంలోని ఎంజేపీ పాఠశాలలో నగర పంచాయతీ ఓట్ల లెక్కించనున్నారు.
చైర్మన్‌కు ఐదు రౌండ్లు, కౌన్సిలర్‌కు రెండు..
చైర్మన్ ఓట్లను ఐదు రౌండ్లు, 28 వార్డుల కౌన్సిలర్ల ఓట్లను ఒక్కోటి రెండు రౌండ్ల చొప్పున అధికారులు లెక్కించనున్నట్లు ఆర్‌వో తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో మొత్తం 31,285 మంది ఓటర్లు ఉండగా, 24,571 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 78.55 శాతం పోలింగ్ నమోదైందని ఆర్‌వో హరి ప్రసాద్ తెలిపారు. ఒట్లు లెక్కించేందుకు 310 మంది అధికారులు విధులు నిర్వర్తిసారు. కాగా ఎన్నికల్లో గెలుపెవరిదని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
డోన్ టౌన్/బేతంచెర్ల: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బేతంచెర్ల సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో స్ర్టాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను డోన్ డీఎస్పీ పి.శ్రీనివా్‌సతో కలిసి పరిశీలించారు. స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించారు. బ్యాలెట్ బాక్సుల వద్ద భద్రతకు సంబందించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఓట్ల లెక్కింపు సందర్బంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సీఐలు ఇంతియాజ్ బాషా, సీఎం రాకేష్, వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు శరత్ కుమార్ రెడ్డి, మమత ఉన్నారు.
ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి : కమిషనర్
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కమిషనర్ కే.నరేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని 24 టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. కౌన్సిలర్ అభ్యర్థులకు 18టేబుళ్లును, చైర్‌పర్సన్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం 6టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. చైర్మన్‌తో పాటు, 36 వార్డుల కౌన్సిలర్లకు నాలుగు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందన్నారు. ఆర్డీవో కేపీ నరసింహులు కౌంటింగ్ నిబంధనలను అధికారులకు వివరించారు.