బుగ్గన ఇలాఖాలో గెలుపెవరిది?
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:51 PM
బేతంచెర్ల మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బుగ్గన సొంత ఊరు. పంచాయతీగా ఉన్న సమయంలో రెడుదఫాలు సర్పంచ్‌గా పనిచేశారు. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయ్యాక రెండో దఫా ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఎవరు గెలుస్తారోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
బేతంచెర్లలో ఆసక్తికర పోరు
టీడీపీ తరపున లోకేశ్‌గౌడ్, వైసీపీ తరపున దస్తగిరి, ఇండిపెండెంటెండ్‌గా హరిప్రసాద్
బేతంచెర్ల, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాఖాగా పేరున్న బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో ఈ దఫా ఆసక్తికర పోరు సాగుతోంది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో రెడుసార్లు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం బేతంచెర్ల 2021 జనవరిలో నాటి వైసీపీ ప్రభుత్వం నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేసింది. అదే ఏడాది నవంబరులో ఎన్నికలు నిర్వహించగా టీడీపీ, వైసీపీ మధ్య పోరుసాగగా వైసీపీ అభ్యర్థి చలం రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ పరిధిలో 31,285 మంది ఓటర్లు ఉండగా, పురుషులు - 15,126, మహిళలు-16143, ఇతరులు-16 మంది ఉన్నారు.
పెరిగిన వార్డులు
గతంలో 20వార్డులు ఉండగా 14 వార్డుల్లో వైసీపీ గెలవగా, 6వార్డుల్లో టీడీపీ విజయం సాధించింది. కాగా ప్రస్తుతం నగర పంపచాయతీని 28వార్డులకు విస్తరించారు.
త్రిముఖ పోరు
ఈ ఏడాది నగర పంచాయతీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నట్లు సమచారం. కూటమి చైర్మన్ అభ్యర్థిగా లోకేశ్ గౌడ్, వైసీపీ తరపున దస్తగిరి ఉండగా స్వతంత్ర అభ్యర్ధిగా పాలకొల్లు హరి ప్రసాద్ బరిలో నిలిచారు. కాగా ఇండిపెండెంట్ అభ్యర్థి వైసీపీలో ఉండగా, తీరా ఎన్నికల సమయంలో నామినేషన్ వేశారు.
లోకేశ్ గౌడ్‌కు మద్దతుగా కోట్ల కుటుంబం
చైర్మన్ టీడీపీ అభ్యర్థి లోకేశ్ గౌడ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే కోట్లతో పాటు, కటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేశారు. కోట్ల తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి, కోట్ల చిత్రమ్మ వార్డుల్లో కౌన్సిలర్లు, చైర్మన్ అభ్యర్థి తరుపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే వైసీపీ అభ్యర్ధి దస్తగిరి తరపున మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్ధి పాలకొల్లు హరి ప్రసాద్ యువకులు, మహిళలతో ప్రచారం చేశారు. నేడు ఎన్నికలు నిర్వహించనుండటంతో చైర్మన్ పీఠంతోపాటు, కౌన్సిలర్లుగా ఏ పార్టీవారు గెలుస్తారోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.