గెలిచేదెవరో..!
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:59 PM
పరిషత్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఎన్నికయ్యేది ఎవరో తేల్చే అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు సమయం వచ్చేసింది.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరులో ఓట్ల లెక్కింపు
ఒక్కో మండలానికి ఒక్కో కౌంటింగ్ టేబుల్
ఉదయం 8 గంటలకు ప్రారంభం
ఓట్ల లెక్కింపునకు 2,060 మంది అధికారులు, సిబ్బంది
లెక్కించాల్సిన ఓట్లు 8,53,077
బరిలో 97 జడ్పీటీసీ, 928 ఎంపీటీసీ అభ్యర్థులు
కర్నూలు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పరిషత్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా ఎన్నికయ్యేది ఎవరో తేల్చే అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు సమయం వచ్చేసింది. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలకు 97 మంది అభ్యర్థులు, 358 ఎంపీటీసీ స్థానాలకు 1,002 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమ ప్రతినిధిని ఎన్నుకోవడానికి 8,53,077 మంది ఓటేశారు. శనివారం ఓటరు తీర్పు రానుంది. జిల్లాలో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండలో తొమ్మిది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఒక్కో మండలం ఓట్లు లెక్కించడానికి ఒక్కో టేబుల్ ఏర్పాటు చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లు వేరుచేసి ఆ తరువాత లెక్కింపు ప్రక్రియ మొదలు పెడతారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. గెలిచేదెవరు? ఓడేదెవరు? అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. జిల్లాలో 26 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (జడ్పీటీసీ)కు 165 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విత్‌డ్రా తరువాత 97 మంది బరిలో నిలిచారు. అధికార కూటమి (టీడీపీ-22, జనసేన-3, బీజేపీ-1) 26, ప్రతిపక్ష వైసీపీ 26, ఇతరులు 45 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26 మండలాల్లో 432 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు 2,056 మంది నామినేషన్లు వేశారు. 1,054 మంది నామినేషన్లు ఉప సంహరించుకోగా, 1,002 మంది మిగిలారు. 74 ఎంపీటీసీలు ఏకగ్రీవం కావడంతో 358 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ నుంచి 339, జనసేన నుంచి 38, బీజేపీ నుంచి 16, వైసీపీ నుంచి 351 మంది, వివిధ పార్టీలు, స్వతంత్రులు 184 మంది చొప్పున 928 మంది అభ్యర్థులు ఓటరు ఇచ్చిన తీర్పు కోసం ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. బుధవారం 1,432 పోలింగ్ కేంద్రాల్లో 8,52,335 మంది ఓటు వేశారు. ఓటరు తీర్పు నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల్లో భద్రపరిచారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన కేంద్రాల్లోనే శనివారం ఓట్లు లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆఽధ్వర్యంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ, ఫలితాలు అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు ఇలా
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొదట ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయానికి అందిన పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తారు. పోస్టల్ కవర్లను ఓపెన్ చేసి, వాటిలోని డిక్లరేషన్ ఫారాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తారు. డిక్లరేషన్ సక్రమంగా ఉంటే ఆ ఓటును చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించి లెక్కింపులోకి తీసుకుంటారు.
లెక్కింపు: బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంల నుంచి కౌంటింట్ టేబుళ్ల వద్దకు చేరుస్తారు. అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లను పరిశీలించి ఓపెన్ చేస్తారు. బ్యాలెట్ పత్రాలను జడ్పీటీసీ, ఎంపీటీసీ వారీగా వేరు చేస్తారు. బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున కట్టగా కడుతారు. ఆకట్టను రౌండ్ల వారిగా కౌటింగ్ సిబ్బందికి కేటాయించి, అభ్యర్థుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు.
చెల్లని ఓట్ల గుర్తింపు: బ్యాలెట్ పత్రాలపై ఓటరు ఎవరో తెలిసేలా రాతలు, సంతకాలు, ప్రత్యేక గుర్తులు పెట్టడం చేయరాదు. అభ్యర్థి గుర్తు కాకుండా వేరే చోట లేదా ఒకరికి కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ముద్ర వేయడం, ఎన్నికల సంఘం నిర్దేశించి స్వస్తిక్ ముద్రకు బదులుగా వేరే పెన్నుతో లేదా ఇతర వస్తువులతో గుర్తు పెట్టడం, బ్యాలెట్ పత్రం వెనుక భాగంలో పోలింగ్ అధికారి సంతకం లేకపోవడం.. వంటి బ్యాలెట్ పత్రాలను తిరస్కరిస్తారు. వాటిపై ఆర్‌వో రిజెక్టెడ్ అని రాసి ప్రత్యేకంగా ఉంచుతారు.
ఫలితాలు: ప్రతి రౌండ్ ముగిసిన తరువాత అభ్యర్థుల వారిగా వచ్చిన ఓట్లను లెక్కిస్తూ.. ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో లీడ్ వివరాలు వెల్లడిస్తారు. ఎంపీటీసీ స్థానానికి వచ్చిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత విజేత అభ్యర్థిని, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తరువాత జడ్పీటీసీగా గెలిచిన అభ్యర్థులను ఆర్‌వో అఽధికారికంగా ప్రకటించి డిక్లరేషన్ ఫారం అందజేస్తారు.
రీకౌంటింగ్: ఫలితాలు ప్రకటనకు ముందు ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండి, ఓడిపోయిన అభ్యర్థికి అనుమానాలు ఉంటే, రీకౌంటింగ్ కోరుతూ ఆర్‌వోకు 15 నిమిషాల్లో రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి విన్నపంపై సహేతుకమైన కారణాలు ఉన్నాయని ఆర్‌వో భావిస్తే రీకౌంటింగ్‌కు అనుమతి ఇస్తారు.
అభ్యర్థుల్లో ఉత్కంఠ
శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు పోటి చేసిన 97 మంది, ఎంపీటీసీ స్థానాలకు బరిలో ఉన్న 928 మంది అభ్యర్థుల భవితవ్యం కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఓటర్లు తీర్పు ఎలా ఉందో..? గెలిచేదెవరు..? ఓటమి తీరాలకు చేరేదెవరు..? క్యాబినెట్ హోదాకు సమానమైన జడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకునేదెరు..? బరిలో అభ్యర్థులే కాదు, వారికి బీ-ఫారాలు అందజేసిన రాజకీయ పార్టీ నాయకులు, అనుచరులు, కార్యకర్తల్లో ఒకటే టెన్షన్. 26 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగితే 18-20 స్థానాల్లో కూటమి విజయం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే క్రమంలో 22-24 మండలాల్లో ఎంపీపీని ఎన్నుకోవడానికి అసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఎంపీటీసీ స్థానాలే కూటమికి వస్తాయని అంటున్నారు. ఇదిలా ఉండగా పలు మండలాల్లో జడ్పీటీసీ ఎన్నికపై భారీగా బెట్టింగ్ జోరుగా నడుస్తుంది.
ఓట్ల లెక్కింపు వివరాలు
ఓట్ల లెక్కింపు ప్రాంతాలు : కర్నూలు, ఆదోని,
ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు
కౌంటింగ్ టేబుళ్లు : 431
ఓట్ల లెక్కింపు సిబ్బంది : 2,060 (సూపర్‌వైజర్లు - 515,
సహాయకులు - 1,545)
లెక్కించాల్సిన ఓట్లు : 8,53,077
ప్రారంభ సమయం : ఉదయం 8 గంటల నుంచి
8 గంటల నుంచే లెక్కింపు : కలెక్టర్
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కౌంటింగ్ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సిరి వెల్లడించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు, అభ్యర్థులు, ఏజెంట్లు ఎన్నికల అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
కర్నూలు క్రైం: జిల్లాలో శనివారం జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, నిష్పక్షపాత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. ఇద్దరు ఏఎస్పీల పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, 40 మంది సీఐలు, 60 మంది ఎస్‌ఐలు, 297 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 774 పోలిస్ కానిస్టేబుల్స్, 90 మంది మహిళా పోలీసులు, 130 మంది ట్రైనీ పోలీసులు, 240మంది హోంగార్డులు, 8 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు, స్పెషల్ పార్టీలతో కలిపి మొత్తం 1,875 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఆధునిక సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమలులో ఉంటుంది, విజయోత్సవ ర్యాలీలు, సభలు నిర్వహించడానికి అనుమతి లేదని ఎస్పీ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గౌరవించాలన్నారు.