జడ్పీ పీఠం ఎవరికో ?
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:57 PM
కర్నూలు జడ్పీ చైర్మన్ పీఠం ఎవరిది? ఆ కుర్చీలో కూర్బుబోయే భాగ్యం దక్కేదెవరికి? జిల్లాలో ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ.
టీడీపీ నుంచి నలుగురి ప్రయత్నాలు
కేఈ రుద్రఫణి నామినేషన్‌పై టెన్షన్.. టెన్షన్
అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషణ
కర్నూలు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జడ్పీ చైర్మన్ పీఠం ఎవరిది? ఆ కుర్చీలో కూర్బుబోయే భాగ్యం దక్కేదెవరికి? జిల్లాలో ఏ ఇద్దరు కలసినా ఇదే చర్చ. కర్నూలు జడ్పీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల గడువు కూడా ముగిసింది. ఈ నెల 27న బరిలో తలపడే అభ్యర్థులు ఎవరో కూడా తేలిపోతుంది. అయితే.. నామినేషన్లు వేసిన బీసీ అభ్యర్థుల్లో బలమైన, సరైన అభ్యర్థి కోసం అధికార కూటమిలో ప్రధాన భాగస్వామ్య పార్టీ టీడీపీ సహా వైసీపీలు వెతుకుతున్నాయి. టీడీపీ నుంచి చైర్మన్ పీఠం ఆశిస్తున్న ఆశావహులు ఇప్పటికే అధిష్టానానికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో జడ్పీ బరిలో దిగిన రాజకీయ నేపఽథ్యం ఉన్న జూనియర్లు, సీనియర్లు ఉన్నారు. చైర్మన్ పీఠంపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో 26 జడ్పీ చైర్మన్ స్థానాలు ఉన్నాయి. పొత్తుల్లో భాగంగా ఈ పీఠం బీజేపీ కూడా ఆశిస్తుంది. అయితే.. మొత్తం జడ్పీటీసీ స్థానాల్లో సింహభాగం టీడీపీకే దక్కేతాయి. దీంతో చైర్మన్ పీఠం ఆ పార్టీకే కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బరిలో దిగిన టీడీపీ అభ్యర్థుల్లో ఆ పీఠం దక్కించుకునేదెవరు..? అంతటా ఇదే చర్చ. వైసీపీ కూడా బలమైన జడ్పీ చైర్మన్ అభ్యర్థిని అన్వేషిస్తున్నా.. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మెజార్టీ జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉండడంతో.. ఫలితాలు వచ్చాక చూద్దామనే ధోరణిలో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీలో ఎవరికి వారే ప్రయత్నాలు
జడ్పీ చైర్మన్ పీఠం కోసం తెలుగుదేశం పార్టీలో ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ జనరల్‌కు రిజర్వుడ్ చేయడంతో అదే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు జడ్పీటీసీ బరిలో దిగారు. జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తన కుమారుడు కేఈ రుద్రఫణిని సరైన సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ఇన్నాళ్లు వేచిచూశారు. జడ్పీ పీఠం బీసీలకు రిజర్వు కావడంతో ఇదే సరైన సమయమని భావించిన ఆయన కుమారుడు కేఈ రుద్రఫణిని క్రిష్ణగిరి జడ్పీటీసీ స్థానం నుంచి నామినేషన్ వేయించారు. అయితే.. ఆయన పేరు ఓటరు జాబితాలో లేదని నామినేషన్ తిరస్కరించడం వల్ల అప్పీల్‌కు వెళ్లడంతో టెన్షన్ నెలకొంది. కౌతాళం టీడీపీ సీనియర్ నాయకుడు గోతులదొడ్డి చుడి ఉలిగయ్య జడ్పీ చైర్మన్ పీఠం ఆశిస్తూ కౌతాళం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కూడా నామినేషన్ వేయడం, పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి ఇస్తే, పీఠం ఆశలు గల్లంతవుతాయని ఉలిగయ్య చివరి మంత్రాలయం జడ్పీటీసీ స్థానానికి కూడా నామినేషన్ వేయడం కొసమెరుపు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ బలోపేతం కోసం మా కుటుంబం కష్టపడుతుంది. జడ్పీ చైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని ఉలిగయ్య అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. అదే క్రమంలో ఏపీ వాల్మీకి/బోయ కార్పొరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ కూడా చైర్మన్ పీఠం ఆశిస్తున్నారు. దేవనకొండ జడ్పీటీసీ స్థానం నుంచి చివరి రోజు నామినేషన్ వేశారు. హొళగుంద మండలానికి టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్‌గౌడ్ కూడా జడ్పీ చైర్మన్ పీఠం ఆశిస్తున్నారు. ఆయనకు ఏపీ, కర్ణాటకలో పలు వ్యాపారాలు ఉన్నాయి. అయితే.. దేవనకొండ, హొళగుంద జడ్పీటీసీ స్థానాల నుంచి ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి సూచన మేరకు వేరే వ్యక్తులు టీడీపీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం కొసమెరుపు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కూడా పీఠం ఆశిస్తున్నారు.
సరైన అభ్యర్థి కోసం వైసీపీ అన్వేషణ
జడ్పీ చైర్మన్ అభ్యర్థి సరైన వ్యక్తి కోసం వైసీపీ అధిష్టానం అన్వేషణ చేపట్టింది. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపినా వారిలో చైర్మన్ పీఠం ఆశించే బలమైన అభ్యర్థి కనిపించడం లేదని ఆ పార్టీ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం జిల్లా పరిషత్ ఎన్నికలు అధికార కూటమికే అనుకూలంగా ఉన్నాయి.. అదృష్టం కొద్ది గెలిస్తే అప్పుడు చూద్దామని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే.. పెద్దకడుబూరు జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా హనుమాపురం పూజారి ఈరన్న నామినేషన్ వేశారు. ఈయన కూడా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆస్పరి జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థి కూడా చైర్మన్ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం.
కేఈ రుద్రగౌడ్ అభ్యర్థిత్వంపై టెన్షన్
జడ్పీ చైర్మన్ పీఠం ఆశిస్తూ.. కృష్ణగిరి జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి కేఈ రుద్రఫణి అభ్యర్థిత్వంపై టెన్షన్ కొనసాగుతోంది. ఈయన ఓటు కర్నూలు అర్బన్ ఓటర్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. నెలన్నర క్రితమే కర్నూలులో తన ఓటును తొలగించి స్వగ్రామైన కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామంలో ఇంటి నంబరు.2-30లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ బీఎల్‌వోలకు దరఖాస్తు చేశారు. పరిశీలించిన ఎన్నికల సంఘం అదే అడ్రసులో ఓటరు ఐడీ నంబరు: జడ్‌జీఎఫ్3374634 కింద కేఈ రుద్రఫణికి ఓటు హక్కు కల్పించారు. ఓటరు ఐడీ కార్డు కూడా జారీ చేశారు. అయితే.. ఎన్నికలు జరిగే జిల్లా పరిషత్ ఓటర్ల జాబితాలో పేరు లేదని ఆర్‌వో తిరష్కరించడం చర్చగా మారింది. దీనిపై ఆదివారం కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి అప్పీల్ చేసినట్లు సమాచారం. అదే క్రమంలో తనకు అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా విన్నవించినట్లు తెలుస్తోంది. నేడు న్యాయస్థానం తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యే అన్నమయ్య జిల్లాలో గాలివీడు జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నాయకుడు సుగువాసి ప్రసాద్‌బాబుకు ఎదురైంది. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో పోటీ అవకాశం కల్పించాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ జిల్లా కలెక్టరు నామినేషన్‌ను ఆమోదించారు. కేఈ రుద్రఫణికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందా..? కలెక్టరు డాక్టర్ ఏ.సిరి నామినేషన్ ఆమోదిస్తారా? కేఈ వర్గీయులు, టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. న్యాయస్థానం నుంచి అనుకూలంగా తీర్పు వచ్చి, కలెక్టర్ నామినేషన్ ఆమోదిస్తే ఆయనే టీడీపీ చైర్మన్ అభ్యర్థి అవుతారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.