లక్కు కిక్కు దక్కేదెవరికో..?
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:24 PM
లక్కు కిక్కును ఆస్వాదించేందుకు మద్యం దుకాణాల దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 44 దుకాణాలకు నోటిఫికేషన్
నంద్యాల జిల్లాలో 72, కర్నూలులో 62 దరఖాస్తులు
9 దుకాణాలకు దరఖాస్తులు నిల్
నేడు లక్కీ డిప్, అనుమతులు
శిరివెళ్ల, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): లక్కు కిక్కును ఆస్వాదించేందుకు మద్యం దుకాణాల దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2026-27 నూతన మద్యం పాలసీ విధానం అమలులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలో 27 మద్యం దుకాణాలకు, కర్నూలు జిల్లాలో 17 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ రావడంతో మద్యం రోజూవారీ విక్రయాలు, ఆదాయ వ్యయాలను అంచనా వేసుకుని పలువురు వ్యాపారులు తమకు నచ్చిన దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లాలో 16, కర్నూలులో జిల్లాలో 15 దుకాణాలకు మాత్రమే నిబంధనల మేరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో నంద్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ కాన్ఫరెన్స్‌హాల్‌లో, కర్నూలు జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ భవనంలో కలెక్టర్లు, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో గురువారం ఉదయం లక్కీడిప్ నిర్వహించి యజమానులకు అనుమతులు మంజూరు చేయనున్నారు.
నంద్యాల జిల్లాలో ఇలా..
నంద్యాల జిల్లాలో ఓపెన్ కేటగిరీలో 26 దుకాణాలకు, రిజర్వుడు కేటగిరీలో ఒక దుకాణానికి నోటిఫికేషన్ రావడంతో జిల్లా వ్యాప్తంగా 72 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో పరిశీలిస్తే శిరివెళ్ల మండల పరిధిలోని ఓ దుకాణానికి, నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని రెండు దుకాణాలకు, బేతంచెర్ల రూరల్ పరిధిలోని ఓ దుకాణానికి నాలుగు దరఖాస్తుల చొప్పున వచ్చాయి. డోన్ రూరల్ పరిధిలోని రెండు దుకాణాలకు, కోవెలకుంట్ల, సంజామల, ఉయ్యాలవాడ మండలాల పరిధిలోని ఒక్కో దుకాణానికి, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడు దుకాణాలకు, రూరల్ పరిధిలోని ఓ దుకాణానికి నాలుగు దరఖాస్తుల చొప్పున వచ్చాయి. నంద్యాల రూరల్, బేతంచెర్ల నగర పంచాయతీ, రుద్రవరం మండల పరిధిలోని ఒక్కో దుకాణానికి ఐదు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. దీంతో నంద్యాల జిల్లాలో పైన ఉన్న 16 మద్యం దుకాణాలకు మాత్రమే అధికారులు నేడు లక్కీడిప్ తీస్తారు. బనగానపల్లె పరిధిలోని రెండు దుకాణాలకు, సంజామల మండలంలోని మరో దుకాణానికి దరఖాస్తులు తక్కువగా రావడంతో వీటికి లక్కీడిప్ నిర్వహించరు.
కర్నూలు జిల్లాను పరిశీలిస్తే..
కర్నూలు జిల్లాను పరిశీలిస్తే ఓపెన్ కేటగిరీలోని 17 మద్యం దుకాణాల పరిధిలో 62 దరఖాస్తులు వచ్చాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు మద్యం దుకాణాలకు, కర్నూలు రూరల్ పరిధిలోని ఓ దుకాణానికి నాలుగు చొప్పున దరఖాస్తులు వేశారు. కోసిగి, పత్తికొండ మండలాల పరిధిలోని నాలుగు దుకాణాలకు, ఓర్వకల్లు, కౌతాళం, పెద్దకడబూరు, హాలహర్వి, చిప్పగిరి మండలాల పరిధిలోని దుకాణాలకు నాలుగు చొప్పున దరఖాస్తులు పడ్డాయి. అలాగే గూడూరు మున్సిపాలిటీలోని ఓ దుకాణానికి ఆరు దరఖాస్తులు వచ్చాయి. దీంతో 15 దుకాణాలకు మాత్రమే లక్కీడిప్ నిర్వహించి అనుమతులు మంజూరు చేస్తారు.
దరఖాస్తులు నిల్
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 9 దుకాణాలు ఒక్క దరఖాస్తుకూ నోచుకోలేదు. నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల, కొత్తపల్లె మండలాల పరిధిలోని ఒక్కో మద్యం దుకాణానికి, ఆళ్లగడ్డ రూరల్, నందికొట్కూరు రూరల్, బేతంచెర్ల రూరల్, ఆత్మకూరు రూరల్ పరిధిలోని ఒక్కో దుకాణానికి, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఓ దుకాణానికి కనీసం ఒక దరఖాస్తు కూడా రాలేదు. అలాగే పగిడ్యాల పరిధిలో రిజర్వుడు కేటగిరీలో కేటాయించిన దుకాణానికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు ముందుకు రాలేదు. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు రూరల్, కర్నూలు రూరల్ పరిధిలోని ఒక్కో దుకాణానికి దరఖాస్తులు కరువయ్యాయి.
లక్కీడి్‌పకు సర్వం సిద్ధం
మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా నిర్వహిస్తున్న లక్కీడి్‌పకు సర్వం సిద్ధం చేశాం. జిల్లాలో 16 దుకాణాలకు కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ తీయడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటికే 86 దుకాణాలను రెన్యువల్ చేసుకోవడంతో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు మిగిలిన దుకాణాలకు డిప్ నిర్వహిస్తున్నాం.
- రవి కుమార్, డీపీఈవో, నంద్యాల జిల్లా
పారదర్శకంగా నిర్వహణ
లాటరీ విధానాన్ని పారదర్శకంగా నిర్వహిస్తాం. వంద శాతం లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికతో వ్యవహరించాం. దీంతో నూతన ఎక్సైజ్ విధానం అమలులో (98.16 శాతం) కర్నూలు జిల్లా రాష్ట్రంలో నాల్గవ స్థానంలో నిలిచింది. లక్కీడిప్ పూర్తైన వెంటనే దుకాణాలకు అనుమతులను కూడా ఖరారు చేస్తాం.
- సుధీర్ బాబు, డీపీఈవో, కర్నూలు జిల్లా