Share News

సంగ్రామంలో గెలిచేదెవరో?

ABN , Publish Date - Nov 24 , 2026 | 11:51 PM

పల్లెపోరులో మహా సంగ్రామం జరగనుంది.

సంగ్రామంలో గెలిచేదెవరో?
మండిగిరి గ్రామ పంచాయతీ కార్యాలయం

రసవత్తరంగా మారిన మండిగిరి సర్పంచ్‌ పీఠం

25 ఏళ్లగా వైసీపీకి కంచుకోట

బద్దలు కొట్టేందుకు టీడీపీ వ్యూహాలు

కూటమికి రెబల్స్‌ బెడద

జనరల్‌ స్థానం కావడంతో ఉత్కంఠ పోరు

రేపు పోలింగ్‌

పల్లెపోరులో మహా సంగ్రామం జరగనుంది. మండిగిరి సర్పంచ్‌ పీఠం కోసం ఆయా పార్టీలు పోటీ పడుతున్నాయి. గణనీయంగా ఆదాయం ఉండటం.. వేగంగా విస్తరిస్తుండటంతో ఈ పంచాయతీపై జెండా ఎగరేయాలని ప్రధాన పార్టీలు కృషి చేస్తున్నాయి. 1995లో పంచాయతీ ఏర్పడినప్పటికి వైసీపీకి కంచుకోటగా మారింది. 2001లో మాత్రం టీడీపీ మద్దతుదారుడు సతీష్‌ విజయం సాధించారు. 25ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఆతర్వాత వైసీపీ హవా కొనసాగుతోంది. ఈసారైనా మండగిరిని టీడీపీ కైవసం చేసుకునేందుకు వ్యూహాలు పన్నుతోంది. కూటమి పార్టీల్లో బెడద అధికంగా ఉండటంతో అది వైసీపీకి కలిసొచ్చే అవకాశముంది.

ఆదోని, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): మేజర్‌ గ్రామ పంచాయతీ మండిగిరి మినీ మున్సిపాలిటీని తలపిస్తోంది. ఇక్కడ సర్పంచ్‌ పీఠం కోసం రసవత్తరంగా పోరు సాగుతోంది. ఏటా రూ.4కోట్ల భారీ బడ్జెట్‌, కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, శరవేగంగా విస్తరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ పంచా యతీపై జెండా ఎగరవేసేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. పట్టణ విస్తరణ అంతా మండగిరి వైపే జరుగుతుండడంతో ఇక్కడ భారీ వ్యాపార సముదాయాలు, కొత్త కాలనీలు వెలిశాయి. కేవలం ఇంటి పన్నులు, వాణిజ్య సముదాయాల ద్వారానే ఏటా రూ.2కోట్ల వరకు పంచాయతీకి సొంత ఆదాయం సమకూరుతోంది. దీనికి ప్రభుత్వ గ్రాంట్లు తోడవడంతో ఏటా రూ.4కోట్ల మేర నిధులు అందుబాటులో ఉంటున్నాయి.

ఒక్కసారి మాత్రమే టీడీపీ..

1995లో సాదాపురం పంచాయతీ నుంచి విడిపోయి మండిగిరి పంచాయతీగా అవతరించింది. అప్పటి నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే 2001లో టీడీపీ ఇక్కడ గెలిచింది. 25ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ఆతర్వాత వైసీపీకి కంచుకోటగా మండిగిరి పంచాయతీ మారింది. ఈసారి సర్పంచ్‌ పదవి జనరల్‌ (అన్‌ రిజర్వు) కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

బీసీ ఓటర్లే..

ఈనెల 26న జరగనున్న తొలివిడత ఎన్నికల్లో పాతికేళ్ల చరిత్రను తిరగరాయాలని టీడీపీ, పట్టు నిలుపుకోవాలని వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో సుమారు 8,500 మంది ఓటర్లు ఉన్నారు. 6,500 మందికి పైగా బీసీ ఓటర్లే ఉన్నారు. జనరల్‌ స్థానం కావడంతో అగ్రవర్ణ నేతలు బరిలో నిలిచినప్పటికీ గెలుపోటములను శాసించేది మాత్రం బీసీ ఓటర్లే.

వైసీపీ ఆధిపత్యం..

పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల సరళిని పరిశీలిస్తే వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. తొలి ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. కాంగ్రెస్‌ మద్దతుతో గోపీయాదవ్‌ తొలి సర్పంచ్‌గా గెలిచారు. 2001లో ప్రముఖ పారిశ్రామికవేత్త విట్టా రమేశ్‌ను ఏకగ్రీవం చేయాలని గ్రామస్థులు భావించినా మారిన సమీకరణలతో జరిగిన పోరులో టీడీపీ మద్దతుదారుడు సతీశ్‌ విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఆరోపణల నేపథ్యంలో సతీశ్‌ రాజీనామా చేయగా, ఉప సర్పంచ్‌ శేషిరెడ్డి పీఠాన్ని అధిష్టించారు. 2006లో అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి హవాతో ఎన్నిక ఏకగ్రీవమైంది. శేషిరెడ్డి సతీమణి దేవయాని శేషిరెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2013లో బీసీ రిజర్వేషన్‌ రావడంతో మాజీ సర్పంచ్‌ గోపీ యాదవ్‌ సోదరుడు సత్యయాదవ్‌ వైసీపీ మద్దతుతో ఘన విజయం సాధించారు. 2021లో ఆదోని మున్సిపాలిటీలో మండిగిరి విలీన ప్రతిపాదనలపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు బ్రేక్‌ పడింది.

కూటమిలో ముసలం..

ఆదోని మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికల్లో జనసేన రెబల్‌ అభ్యర్థి విజయం సాధించిన వేడి చల్లారక ముందే ఇప్పుడు మండగిరిలోనూ కూటమి పార్టీల మధ్య ఐక్యత లోపించడం చర్చనీయాంశమైంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లప్ప తదితరులు బుద్ధారెడ్డి సతీమణి శ్రీదేవి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు అనుచరుడైన మాజీ ఎంపీపీ పద్మావతి భర్త మురళి కూడా టీడీపీ మద్దతుదారుడిగా బరిలో నిలిచారు. బీజేపీ రెబల్‌ అభ్యర్థి, మరో ముగ్గురు స్వతంత్రులు ప్రచారంలో దూసుకు పోతున్నారు. టీడీపీ నుంచి ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీ పడుతుండడం, బీజేపీ రెబల్‌ కూడా బరిలో ఉండడంతో కూటమి ఓట్లు భారీగా చీలి తమ అభ్యర్థి గెలుపు సులభమవుతుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది.

ప్రచార హోరు

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార హోరు పెంచారు. మరి ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత వెలువడే ఫలితాల్లో మండగిరి ఓటర్లు ఎవరికి పట్టం కడుతారో వేచి చూడాల్సిందే.

Updated Date - Nov 24 , 2026 | 11:51 PM