జడ్పీ పీఠం ఎవరిదో?
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:45 PM
జడ్పీ చైర్మన్ జిల్లా ప్రథమ పౌరుడు. అత్యంత కీలకమైన పదవి ఇది. బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కల్పించారు. ఎలాగైనా అఽధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, మంత్రి నారా లోకేశ్‌ను ఒప్పించి పీఠం దక్కించుకో వడం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.
బీసీ జనరల్‌కు రిజర్వేషన్
టీడీపీలో పెరుగుతున్న ఆశావహులు
అధిష్ఠానం ఆశీస్సులు ఎవరికి?
ఎమ్మెల్యేలు, ఇన్చార్జీల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు
కర్నూలు , అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జడ్పీ చైర్మన్ జిల్లా ప్రథమ పౌరుడు. అత్యంత కీలకమైన పదవి ఇది. బీసీ జనరల్‌కు రిజర్వేషన్ కల్పించారు. ఎలాగైనా అఽధినేత, సీఎం చంద్రబాబు, యువనేత, మంత్రి నారా లోకేశ్‌ను ఒప్పించి పీఠం దక్కించుకో వడం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. టీడీపీలో ఆశా వహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బలబలాలను పరిగణలోకి తీసుకొని చైర్మన్ అభ్యర్థి ఎంపికై అధిష్ఠానం కుస్తీ పడుతోంది. తొలి దశలో నగర, పురపాలక ఎన్నికలు ఉండడంతో, మేయర్, చైర్మన్ అభ్యర్థుల ఎంపిక తర్వాత జడ్పీ, మండల పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న రాష్ట్ర నాయకత్వం ద్వారా ప్రయత్నాలు తీవ్రం చేస్తున్నారు. నాకు అవకాశం ఇస్తే పార్టీ నిర్ణయం మేరకు రూ.కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ సంకేతాలు పంపుతున్నారు. దీంతో టీడీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరు? ఆ పీఠంపై కూర్చునేదెవరు? అన్న చర్చ జిల్లాలో ప్రధానంగా జరుగుతోంది. అదే క్రమంలో వైసీపీ సైతం బలమైన అభ్యర్థి ఎంపికలో నిమగ్నమైంది.
రాజకీయ వ్యూహాలు
కర్నూలు జిల్లా పరిషత్ 1959లో ఏర్పడింది. తొలి చైర్మన్‌గా దివంగత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు 13 సార్లు జడ్పీ ఎన్నికలు జరిగాయి. 16 మంది చైర్మన్లుగా పనిచేశారు. జిల్లా విభజన తర్వాత 26 జడ్పీటీసీ స్థానాలతో కర్నూలు జిల్లా పరిషత్ మిగిలింది. కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల నుంచి జడ్పీటీసీ సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత బీసీ జనరల్‌కు రెండో సారి రిజర్వేషన్ కల్పించారు. బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఎలాగైనా అధిష్ఠానాన్ని ఒప్పించి చైర్మన్ పీఠంపై కూర్చోవాలని రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. స్థానికంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు
జడ్పీ పీఠం కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తన రాజకీయ వారసుడిగా కుమారుడు కేఈ రుద్రఫణిని రంగంలోకి దింపుతున్నారు. ఎలాగైనా కొడుకుని చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు రాజకీయంగా అస్త్రాలు సంధిస్తున్నారు. జడ్పీ ఎన్నికల్లో కుమారుడు రుద్రఫణిని కృష్ణగిరి మండలం నుంచి జడ్పీటీసీగా బరిలో దింపి.. ఆ తర్వాత చైర్మన్ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. అందులో భాగంగానే కర్నూలు ప్రభుత్వ అతిథిగృహంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిని కేడీసీసీ మాజీ చైర్మన్ మల్లికార్జునరెడ్డితో పాటు కేఈ ప్రభాకర్ కలిశారు. అదేక్రమంలో అధిష్ఠానం వద్దకు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
తుగ్గలి నాగేంద్ర ఆశలు..
మొదటి నుంచి జడ్పీపీఠం ఆశించిన తుగ ్గలి నాగేంద్రకు తుగ్గలి మండలం జడ్పీటీసీ బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయన ఆశలు ఎండమావులుగా మారాయి. గోనెగండ్లకు చెందిన కురువ కార్పొరేషన్ డైరెక్టర్ గాజులదిన్నె రామకృష్ణ సైతం పదవిని ఆశిస్తున్నారు. అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో? వేచి చూడాల్సిందే.
వాల్మీకి సామాజికవర్గంలో..
గత ఎన్నికల్లో మంత్రాలయం టికెట్ ఆశించిన కౌతాళం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గోతులదొడ్డి ఉలిగయ్య వాల్మీకి సామాజిక వర్గం కోటాలో జడ్పీ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు. వీరితో పాటు ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్పర్సన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఏపీ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప జడీ ్ప చైర్మన్ పీఠం ఆశిస్తున్నారు. కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు బతికి ఉండగ జడ్పీ పీఠం అంచుల దాకా వెళ్లి ఫ్యాక్షన్ ముద్రతో ఆ పదవికి దూరమయ్యారు. తనకు అవకాశం కల్పించాలని బొజ్జమ్మ ఇప్పటికే అధిష్ఠానానికి సంకేతాలు పంపారు. హోళగుంద మండలం నుంచి ఈడిగ సామాజిక వర్గానికి చెందిన గౌడ్ తెరపైకి వచ్చారు