కోడుమూరు ఎంపీపీ ఎవరో?
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:40 PM
కోడుమూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ నేడు తీరనుంది. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీలు ఉన్నారు.
మండలంలో 21 మంది ఎంపీటీసీలు
వైసీపీ ఎంపీటీసీలు 10, టీడీపీకి 9
ఒకరు సీపీఎం, మరొకరు స్వతంత్ర అభ్యర్థి
నేడు ఉత్కంఠకు తెర
కోడుమూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కోడుమూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ నేడు తీరనుంది. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో వైసీపీ నుంచి 10 మంది ఎంపీటీసీలు గెలుపొందారు.. టీడీపీ నుంచి 9 మంది గెలిచారు. సీపీఎం నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు విజయం సాధించారు. వైసీపీతో పొత్తులో భాగంగా సీపీఎం నుంచి గెలిచిన కనికె నాగిరెడ్డి కోడుమూరులోనే ఉన్నారు. మరో వైపు ఎంపీపీ పదవిని టీడీపీ చేక్కించుకునేందుకు కేడీసీసీబీ చైర్మన్ డి. విష్ణువర్థన్‌రెడ్డి తనదైన ప్రయత్నాలు సాగిస్తున్నారు. టీడీకి 9 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా స్వాతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎంపీటీసీ సభ్యుడి మద్దతు టీడీపీకి ఉంది. ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవడానికి టీడీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రఘునాథరెడ్డి పేరు తెరపైకి : వైసీపీ తరపున ఎంపీపీ అభ్యర్థిగా రఘునాథరెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇతర ఎంపీటీసీల మద్దతు మీద ఈయన విజయం ఆధారపడి ఉంది. సీపీఎం ఎంపీటీసీ మద్దతుతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని వైసీపీ పావులు కదుపుతోంది. ఇందుకు ప్రతి ఫలంగా సీపీఎం అభ్యర్థి కనికె నాగిరెడ్డికి మండల ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేందుకు వైసీపీ సుముఖంగా ఉందని తెలిసింది.
టీడీపీ వ్యూహాలపై ఆసక్తి : మరోవైపు సీపీఎం, స్వాతంత్ర అభ్యర్థులను తమ వైపు తిప్పుకొని ఎంపీపీ పీఠాన్ని తమ ఖాతాలో వేసుకునెందుకు టీడీపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీ మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎంపీపీ ఎన్నిక చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగే అవకాశముంది. మొత్తంగా కోడుమూరు మండల పరిషత్ అధ్యక్ష పీఠం ఎవరిని వరించేదీ వేచి చూడాల్సిందే.