Share News

పశ్చిమ తీర్పు ఎటు?

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:12 PM

గ్రామ సీమలపై పట్టుండే పంచాయతీ సమరం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత పోరు ముగిసింది.

పశ్చిమ తీర్పు ఎటు?

నేడు రెండో విడత పంచాయతీ పోరు

170 సర్పంచ్‌ స్థానాలు, 1590 వార్డులకు పోలింగ్‌

4.39 లక్షల మంది ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ

భారీగా డబ్బు, మద్యం పంపిణీ

కర్నూలు, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ సీమలపై పట్టుండే పంచాయతీ సమరం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత పోరు ముగిసింది. అధికార కూటమి మద్దతుదారులు జైత్రయాత్ర సాగించారు. కర్నూలు జిల్లాకు పశ్చిమాన ఉండే పల్లెల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. పల్లెపీఠం కోసం పోటీ పడిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. వారికి మద్దతుగా నాయకులు గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. చివరి అస్త్రంగా ప్రలోబాలకు తెరతీశారు. ఓటుకు రూ.500-1000 వరకు పంపిణీ చేశారు. మద్యం పంపిణీతో పల్లెల్లో ఎన్నికల వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారో..? ఆసక్తికరంగా మారింది. ఆదోని, కర్నూలు రెవెన్యూ డివజిన్ల పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సిరి పర్యవేక్షణలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. అభివృద్ధికి పట్టం కడుతారా..? ప్రలోబాలకు లొంగుతారా..? నేడు వెలువడే పల్లె తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జిల్లాలో 484 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ స్థానాలతో పాటు 5,100 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో 148 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఈ నెల 26న పోలింగ్‌ ముగిసింది. రెండో విడతలో ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో నేడు 186 గ్రామ పంచాయతీలు, 1,972 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో 16 సర్పంచ్‌ స్థానాలు, 381 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 170 సర్పంచ్‌ స్థానాలు, 1,590 వార్డు స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ సిరి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ బందోబస్తుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసే అవకాశం కల్పించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

4.39 లక్షల ఓటర్ల తీర్పు

రెండో విడతలో మొత్తం 186 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 16 సర్పంచ్‌ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 170 సరం్పంచు స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం 1,972 వార్డులకు గానూ 381 వార్డులు ఏకగ్రీవం కాగా, 1,590 వార్డులకు ఓటింగ్‌ జరగనుంది. ఇందు కోసం 1,783 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,39,381 ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 2,16,191 మంది పురుషులు, 2,23,135 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 55 మంది ఉన్నారు. పురుషు ఓటర్లు కంటే మహిళా ఓటర్లు 6,944 మంది అధికంగా ఉన్నారు. గెలుపు ఓటముల్లో మహిళా ఓటర్ల నిర్ణయం కీలకం కానుంది.

రెండో విడత ఎన్నికల వివరాలు

మొత్తం గ్రామ పంచాయతీలు : 186

ఏకగ్రీవమైన సర్పంచులు : 16

పోలింగ్‌ జరిగే సర్పంచ్‌ స్థానాలు : 170

మొత్తం వార్డులు : 1972

ఏకగ్రీవమైన వార్డులు : 381

నామినేషన్లు రాని వార్డులు : 01

పోలింగ్‌ జరిగే వార్డులు : 1590

పోలింగ్‌ కేంద్రాలు : 1783

మొత్తం ఓటర్లు : 4,39,381

పురుషులు : 2,16,191

మహిళలు : 2,23,135

ఇతరులు : 55

మండలాల వారీగా ఎన్నికల వివరాలు

మండలం జీపీ ఎన్నికలు జరిగే వార్డులు పోలింగ్‌ ఓటర్లు

పంచాయతీలు కేంద్రాలు

గోనెగండ్ల 20 17 168 205 53615

కోసిగి 24 23 208 240 55524

కౌతాళం 30 28 226 262 57519

మంత్రాలయం 20 16 136 152 40933

నందవరం 15 15 152 171 48111

పెద్దకడుబూరు 20 19 197 198 45864

ఎమ్మిగనూరు 17 16 172 190 55851

కల్లూరు 18 15 141 153 33647

ఓర్వకల్లు 22 21 190 212 48317

మొత్తం 186 170 1590 1783 439381

Updated Date - Nov 28 , 2026 | 11:12 PM