నగరడోన ఎక్కడ ?
ABN , Publish Date - May 27 , 2026 | 12:12 AM
తుంగభద్ర ఎగువ కాల్వ (హెచ్చెల్సీ) ఎగువన కర్ణాటక రైతుల జలచౌర్యంతో టీబీ డ్యాం నుండి రావాల్సిన నీటి వాటా ఏటేటా తగ్గిపోతోంది. ఈ ఆలూరు బ్రాంచి కెనాల్ (ఏబీసీ) నీటి వాటాకు గండి పడుతోంది. గతంలో పచ్చని పైర్లతో కళకళలాడిన ఆయకట్టు నేడు బీడుబారింది.
2007లో రూ.11. 50 కోట్లతో శిలాఫలకం
14,255 ఎకరాల ఏబీసీ ఆయకట్టుకు సాగునీరు లక్ష్యం
రూ.59 కోట్లకు చేరిన నిర్మాణ వ్యయం
కూటమి ప్రభుత్వంలోనైనా పూర్తియ్యేనా?
ఆలూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ఎగువ కాల్వ (హెచ్చెల్సీ) ఎగువన కర్ణాటక రైతుల జలచౌర్యంతో టీబీ డ్యాం నుండి రావాల్సిన నీటి వాటా ఏటేటా తగ్గిపోతోంది. ఈ ఆలూరు బ్రాంచి కెనాల్ (ఏబీసీ) నీటి వాటాకు గండి పడుతోంది. గతంలో పచ్చని పైర్లతో కళకళలాడిన ఆయకట్టు నేడు బీడుబారింది. పంటకాల్వలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చినుకు రాలితే తప్ప పంటలు పండని పరిస్థితి, తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఏబీసీ కాల్వ ఆయకట్టు సాగునీరు అందించాలనే సంకల్పంతో నగరడోన జలశయం నిర్మాణానికి బీజం పడింది. 2007లో జీవో ఎంఎస్ నం.11 కింద పరిపాలన అనుమతి ఇస్తూ రూ.11.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ శిలాఫలకం వేశారు. రాజకీయ పైరవీలతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ చేతులేత్తేయడంతో పూనాది రాయితోనే పనులు నిలిచిపోయ్యాయి. ఆ తర్వాత పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ జలాశయం మరుగునపడింది. ఇంతకూ నగరడోన ఉందా? అనే సందేహం కలుగుతోంది. 2026 మే 7న ఆలూరుకు వచ్చిన ముఖ్మంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.32 కోట్లు ఇస్తానని హామీ ఇవ్వడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఆలూరు నియోజకవర్గంలో తుంగభద్ర హెచ్చెల్సీ కాల్వకు అనుసందానంగా ఉన్న ఆలూరు బ్రాంచ్ కాల్వ 39.68 కీలోమీటర్లు ప్రవహిస్తుంది. చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలల్లోని 19 గ్రామాల పరిధిలో 14,255 ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు అందించాలి. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ నుండి 262 క్యూసెక్కుల నీటీ వాటా ఉంది. ఈ కాల్వ కిందగతంలో పుష్కలంగా సాగునీరు అంది ఆయకట్టు పచ్చని పైర్లతో కళకళలాడింది. ఎగువన కర్ణాటక జలచౌర్యంతో, టీబీ డ్యాం నుండి రావాల్సిన నీటి వాటాకు కోత పడటం తదితర కారణాలతో శివారున ఉన్న ఆలూరు బ్రాంచ్ కెనాల్(ఏబీసీ) నీటి ప్రవాహం లేక ఆనవాళ్లు కోల్పోతుంది. ఆయకట్టు వర్షాధారంపై ఆధారపడిల్సివస్తుంది.
రూ.11 .10 కోట్లు మంజూరు
చిప్పగిరి మండలం నగరడోన గ్రామ సమీపంలో 712.26 ఎరకాల విస్తీర్ణంతో 10.4 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా లక్ష్యంతో నగరడోన జలశయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2005 లో జిల్లా జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా 2006లో నాటీ ప్రభుత్వం అమోదం తెలిపింది. 2007 జనవరి 11న జీవో ఎంఎస్ నం.11 కింద పరిపాలన అనుమతి ఇస్తూ రూ.11.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది జూన్ 5న నాటీ సీఎం వైఎస్ రాజశేకర్‌రెడ్డి శిలాఫలకం వేశారు.
చేతులెత్తేసిన కాంట్రాక్టర్
జలశయం పనులు చేపట్టేందుకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన ప్రకా్‌షరెడ్డి అనే కాంట్రాక్టరు పనులను దక్కించుకున్నాడు. కాగా పనులు చేపడితే తమకు వాటాలు(పర్సంటేజీ) ఇవ్వాల్సిందేనంటూ అప్పట్లో ముఖ్య రాజకీయ నాయకులు కొందరు ఆయనపై ఒత్తిడి తేవడంతో టెండర్ ఒప్పందం ప్రకారం పనులు చేయించాల్సిన ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పనులు నిలిచిపోయ్యాయి.
2016లో చంద్రబాబు హామీ
జిల్లా పర్యటనలో భాగంగా ఆలూరు మండలం కురువల్లిలో నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వచ్చారు. నగరడోన జలాశయ నిర్మాణం, హంద్రీనీవా నుండి ఆలూరు బ్రాంచి కెనాల్‌కు నీటిని ఇవ్వాలని రైతులు విన్నతుల మేరకు నగరడోన జలాశయం నిర్మాణానికి అవసరమైన రూ.32 కోట్లు నిధులు ఇచ్చేందుకు హామీ ఇచ్చారు.
రూ.59 కోట్లకు పెరిగిన వ్యయం
గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జయరాం నగరడోన ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.59 కోట్లు బడ్జెట్‌ను పెంచేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు తెచ్చారు. ఆరకొర పనులు చేసిన కాంట్రాక్టర్ పనులు నిలిపేసి వెళ్లిపోయారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వంలోనైనా పూర్తి అవుతుందనే ఆశాభావాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్తాం
నిలిచిపోయిన నగరడోన ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తాం. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యేలా చూసి రైతులకు సాగునీరు అందేలా చూస్తాం. - వైకుంఠం జ్యోతి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి
ప్రాజెక్టు పూర్తయితే రైతుల కల నేరవేరినట్లే
నగరడోన రిజర్వాయర్ పూర్తైతే రైతుల చిరకాల కోరిక నేరవేరి సాగు నీటికి ఇబ్బందులు ఉండవు. దాదాపు 14,255 ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది. - నగరడోన కిష్టప్ప, ఆలూరు బ్రాంచ్ కెనాల్ డిస్టిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు