పొలాలు ఇచ్చాం.. పరిహారం ఏది?
ABN , Publish Date - Jul 22 , 2026 | 12:05 AM
విద్యుత్ టవర్ల ఏర్పాట్ల కోసం తాము సాగు చేసే పొలాలను ఇచ్చామని, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
పట్టించుకోని అధికారులు
ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజన రైతులు
తుగ్గలి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ టవర్ల ఏర్పాట్ల కోసం తాము సాగు చేసే పొలాలను ఇచ్చామని, ఇంతవరకు పరిహారం ఇవ్వలేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు సరఫరాకు ఏర్పాటుచేసే టవర్లకు తమ పొలాలు ఇవ్వమని గిరిజన రైతులు ఆందోళన చేస్తే అధికారులు, పోలీసులు రైతులకు నచ్చజెప్పి టవర్లు ఏర్పాటు చేసేందుకు విద్యుత్ టవర్లు వెళ్లేందుకు పొలాలు ఇచ్చారు. పొలాలు ఇచ్చిన రైతులకు ఏపీ ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. పొలాలు కోల్పోయిన రైతులు ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అదిగో ఇదిగో కాలక్షేపం చేస్తున్నారే గానీ డబ్బులు ఇవ్వడం లేదని, తమ పరిస్థితి ఏమిటని గిరిజన రైతులు ఆందోళ చెందుతున్నారు. వివరాలు.. కర్నూలు జిల్లా తు గ్గలి మండలంలోని చెరువు, రోళ్లపాడు, ఎల్లమ్మగుట్ట తండాల మీదుగా పవర్‌గ్రిడ్ సంస్థ విద్యుత్ టవర్లు, స్తంభాలు ఏర్పాటు చేసేందుకు పొలాలను ఇవ్వాలని ఆయా గ్రామాల రైతులకు కోరింది. కొందరు ఇచ్చేందుకు మొగ్గు చూపగా, మరికొందరు రైతులు పండ్ల తోటల సాగుతో పాటు వ్యవసాయ భూముల కింద పంటలు సాగు చేసుకుంటున్నామని ఇవ్వలేమన్నారు. వ్యవసాయంపైన ఆధారపడి జీవిస్తున్నామని, పొలాలు ఇచ్చేది లేదని ఆందోళనకు దిగారు.
ఎకరాకు ప్రభుత్వ రేటు కంటే..
విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు పొలాలను ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోవడంతో జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, పోలీసులు రైతుల వద్దకు వచ్చి పొలాలు ఇస్తే పరిహారం ఇస్తామని చెప్పి నమ్మించారు. ఎకరాకు ప్రభుత్వ రేటు కంటే ఎక్కువ ఇస్తామని నమ్మబలికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడు కొంతమొత్తం ఇచ్చి మిగిలిన వాటిని కొద్ది రోజుల్లో చెల్లిస్తామని చెప్పారు. రైతులు నెలల పాటు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మాట ఇచ్చిన ప్రకారంగానే పరిహారం అంతా చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
30 మంది రైతులను ఒప్పించి..
రైతులు ఆందోళనలు చేపట్టగా కంపెనీ యాజమాన్యం, పోలీసులు, అధికారుల సాయంతో దాదాపు 30 మంది రైతులను ఒప్పించి కొంత నగదును రైతులకు ఇచ్చారు. మిగిలిన నగదును కొద్ది రోజుల్లో చెల్లిస్తామని నమ్మబలికి విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇవ్వడం లేదు. ఒక్కో రైతుకు రూ.5లక్షల నుంచి రూ.25లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. విద్యుత్ స్తంభాలు వేయించేందుకు వచ్చిన అధికారులు మాత్రం రైతులకు నగదు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన నగదును ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
జేసీనీ కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదు
తహసీల్దార్, జాయింట్ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ దాదాపు 20 సార్లు తిరిగాం. పట్టించుకోవడం లేదు. కంపెనీ యాజమాన్యానికి తెలియజేస్తామని చెబుతున్నారు. నా రెండెకరాల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి ఐదు నెలలు గడిచిం ది. రూ.35లక్షలు ఇవ్వాల్సి ఉండగా రూ.10లక్షలు మాత్రమే ఇచ్చారు. కంపెనీ యాజమాన్యం వద్దకు వెళ్లినా లాభం లేదు. ఇంకా రూ.25లక్షలు పరిహారం రావాల్సి ఉంది. - సురేష్ నాయక్, రోళ్లపాడు తండా, తుగ్గలి