'పెట్రో' కష్టాలు తీరేదెన్నడు?
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:07 AM
: పట్టణంలోని పెట్రోల్ బంకులు శనివారం వాహనదారులతో కిటకిటలాడాయి. శుక్రవారం బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్, డీజిల్స్‌కు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
డోన్, బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో వాహనదారుల ఇబ్బందులు
క్యాన్లలో తీసుకెళ్తుండటంతో నిల్వలు ఖాళీ
పలుచోట్ల బంకుల మూత
డోన్ రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పెట్రోల్ బంకులు శనివారం వాహనదారులతో కిటకిటలాడాయి. శుక్రవారం బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడంతో పెట్రోల్, డీజిల్స్‌కు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం డీజిల్, పెట్రోల్ పోస్తున్నారన్న సమాచారంతో వాహనదారులు బంకుల వద్దకు పరుగులు తీయడంతో బంకులన్నీ కిక్కిరిశాయి.
చాగలమర్రి: మండల కేంద్రంలో 4, నగల్లపాడులో, పెద్దబోదనం గ్రామాల సమీపంలో రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే ఆయిల్ కంపేనీల నుంచి సరఫరా సరిగా లేక కొరత ఏర్పడిందని బంకుల యజమానులు తెలిపారు. డిజిల్, పెట్రోల్ కొరత ఉండటంతో వాహనదారులు, రైతులు క్యాన్లు తీసుకొని బంకుల వద్ద శనివారం నిరీక్షించారు. అధికారులు స్పందించి కొరత లేకుండా చూడాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
పెట్రోల్, డిజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ ఫణింద్రుడు హెచ్చరించారు. ‘పెట్రో పాట్లు’ శీర్షికన శనివారం ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన తహసీల్దార్ ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ బంకులను తనిఖీ చేసి, స్టాక్ రిజిస్ట్రర్లను, పెట్రోల్, డిజిల్ నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించి పెట్రోల్ కొరత లేకుండా అన్నివిధాలా జాగ్రత్తలు తీసుకోవాలని యజమానులకు సూచించారు. ఇంధనం నిల్వ ఉంచుకొని కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. ఆర్‌ఐ అబ్దుల్‌సత్తార్, వీఆర్వోలు పాల్గొన్నారు.
బ్లాక్ మార్కెట్‌తోనే కొరత
ప్యాపిలి: వ్యాపారులు పెట్రోలు, డీజిల్‌ను బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వ చేస్తున్నందుకే ఇంధన కొరత తీవ్రంగా మారిందని సీపీఐ మండల కార్యదర్శి మహేష్ ఆరోపించారు. శనివారం మాట్లాడుతూ కొరత కరాణంగా వ్యవసాయం, రవాణా రంగాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. అధికారులు కారణాలను అన్వేషించి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే బంకులను సీజ్ చేస్తాం
బనగానపల్లె: డీజల్, పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే బంకులను సీజ్ చేస్తామని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు. తహసీల్దార్ రాజీవ్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పెట్రోల్ బంకులను ఆర్‌ఐ నాయక్, వీఆర్‌వోలు తనిఖీలు చేశారు. ఆర్‌ఐ మాట్లాడుతూ బనగానపల్లెలో పెట్రోల్ కొరత లేదని, డీజల్ సరఫరా కాస్త ఆలస్యంగా వస్తోందన్నారు. రెండు రోజుల్లో డీజల్‌ను కూడా సరఫరా చేస్తామన్నారు. బంకుల యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటా మన్నారు. పెట్రోల్ అన్ని దుకాణాల్లో పుష్కలంగా ఉందని వాహనదారులు అవసరం మేరకే పెట్రోల్ పోయించుకోవాలని కోరారు.
వాహనదారులు ఆందోళన చెందవద్దు
బేతంచెర్ల: మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, వాహనదారులు ఆందోళన చెందవద్దని తహసీల్దార్ నాగమణి తెలిపారు. శనివారం మాట్లాడుతూ బంకుల యాజమాన్యంతో చర్చించగా భద్రతా కారణాల దృష్ట్యా బాటిళ్లు, క్యాన్లలో పెట్రోల్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. వాహనాల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ పోయించుకోవాలన్నారు. వాహనదారులు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ఆమె కోరారు.