గేట్లకు మరమ్మతులెప్పుడో..?
ABN , Publish Date - Aug 07 , 2026 | 12:24 AM
: రాజోలి ఆనకట్ట వద్ద కుందూ గేట్ల మరమ్మతులో తీవ్ర జాప్యం జరుగుతోంది. టెండర్ పూర్తయినా సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. ఆనకట్ట వద్ద కేసీ ప్రధాన కాలువ వైపు నీరు వెళ్లే విధంగా 5 గేట్లు ఉన్నాయి.
కుందూకు నీరు రాకముందే పనులు పూర్తి చేస్తే ప్రయోజనం
రాజోలి ఆనకట్ట వద్ద మొరాయిస్తున్న కుందూ గేట్లు
చాగలమర్రి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): రాజోలి ఆనకట్ట వద్ద కుందూ గేట్ల మరమ్మతులో తీవ్ర జాప్యం జరుగుతోంది. టెండర్ పూర్తయినా సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. ఆనకట్ట వద్ద కేసీ ప్రధాన కాలువ వైపు నీరు వెళ్లే విధంగా 5 గేట్లు ఉన్నాయి. కుందూ దిగువకు నీరు మళ్లించేందుకు 6 గేట్లు ఉన్నాయి. ఇక్కడ కేసీ ప్రధాన కాలువ ద్వారా కడప జిల్లాలోని దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట మండలాల ఆయకట్టుతో పాటు కర్నూలు జిల్లాలోని చాగలమర్రి, రాజోలి ఆయకట్టు ప్రాంతాలకు నీరు సరఫరా అవుతోంది. రెండేళ్ల కింద 5 గేట్లు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. దీంతో నీరు విడుదల సమయంలో లస్కర్లు, అధికారులు అవస్థలు పడుతున్నారు. కుందూ నీరు దిగువవైపుకు వెళ్లే ప్రాంతంలో 6 గేట్లు ఉండగా ఇందులో 3 గేట్లు తుప్పుపట్టి కదలడం లేదు. వీటి షెట్టర్లు, రాడ్లు మొరాయిస్తున్నాయి. కేసీ ప్రధాన కాలువకు నీరు మళ్లించే విషయంలో సిబ్బంది, అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసి ఎగువ నుంచి వరద నీరు ఆనకట్టకు చేరితే పనులు చేయడానికి ఇబ్బందిగా ఉంది. త్వరగా పనులు చేస్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల చేయడంతో రాజోలి ఆనకట్టకు నీరు చేరితే పనులు చేసేందుకు వీలుండదు. ఇప్పుడే పనులు జరిగితే బాగుంటుందని రైతులు అంటున్నారు. గేట్ల వద్ద కూడా నీరు లేకపోవడంతో పనులు చేసేందుకు అవకాశం ఉందని, అధికారులు చొరవ తీసుకొని టెండర్ వేసిన కాంట్రాక్టర్‌చే తక్షణమే పనులు మొదలు పెట్టేలా చూడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.