సమావేశం ఎప్పుడు?
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:18 AM
నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గత నెల 19న వైసీపీ, టీడీపీ సభ్యుల వాగ్వాదంతో మున్సిపల్ కౌన్సిల్ వాయిదా
మరో రెండు నెలల్లో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం
నగరంలో నిలిచిన అభివృద్ధి పనులు
కర్నూలు న్యూసిటీ, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతి 90 రోజలకోసారి నిర్వహించి, అభివృద్ధి పనులను ఆమోదించాల్సి ఉంది. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సాధారణంగా సమావేశం నిర్వహణకు కమిషనర్ మేయర్‌కు ప్రతిపాదనలు పంపుతారు, దీన్ని మేయర్ ఆమోదిస్తే సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే కర్నూలు కార్పొరేషన్ మేయర్‌కు కమిషనర్ పలుమార్లు ప్రతిపాదనలు పంపినా, మేయర్ నుంచి అనుమతి రావడం లేదని సమాచారం.
అడ్డుకుంటున్న వైసీపీ కార్పొరేటర్లు
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్‌లో 52 డివిజన్లు ఉండగా 34మంది కార్పొరేటర్లు వైసీపీ తరపున ఎన్నిక కాగా 18మంది టీడీపీ తరపున ఎన్నికయ్యారు. నగరంలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా కార్పొరేషన్ కౌన్సిల్‌లో ఆమోదించాల్సి ఉంటుంది. అయితే 2024లో టీడీపీ గెలవడంతో, వైసీపీ కార్పొరేటర్లు అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా అడ్డుకుంటున్నారని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
సమావేశంలో గందరగోళం..
గత సంవత్సరం జులైలో ఓసారి, డిసెంబర్‌లో మరోసారి నిర్వహించగా, సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో వాయిదా పడింది. గత నెల 19న నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో వైసీసీ, టీడీపీ కార్పొరేటర్ల వాగ్వాదం కారణంగా అజెండాను చర్చించకుండానే వాయిదా పడిది. అనంతరం నెల గడుస్తున్నా ఇప్పటి వరకు సమావేశం నిర్వహణపై పాలకవర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు రాకపోవడంతో కమిషనర్ సమావేశాన్ని బాయికాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ కార్పొరేటర్లు కలగజేసుకుని అజెండా చదవకముందే బాయ్‌కాట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ కార్పొరేటర్లు వెళ్లిపోయిన సమావేశాన్ని నిర్వహించాలని పట్టుబట్టారు. కౌన్సిల్‌లో గందరగోళంత మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
రెండు నెలల్లో ముగియనున్న పాలకవర్గం..
మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్ పదవీ కాలం మార్చి20కి ముగుస్తుంది. దీంతో సమావేశం నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. త్వరలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు నగరంలో అభివృద్ధి పనులు ఆమోదం పొందే అవకాశం లేదు. ఆర్థిక సంవత్సరం ముగియకముందే సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులు ఆమోదం పొందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.