ఆసుపత్రిలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు ఎప్పుడో..
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:50 PM
ఎమ్మిగనూరు ప్రాంతంలో ప్రజలకు వైద్యసౌకర్యాలు అందించే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు, వెంట వచ్చే బంధువులకు, వైద్యసిబ్బందికి భద్రత ప్రశ్నార్థకంగా మారింది
ఆసుపత్రిలో కరువైన భద్రత, ఆందోళనలో రోగులు
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు ప్రాంతంలో ప్రజలకు వైద్యసౌకర్యాలు అందించే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు, వెంట వచ్చే బంధువులకు, వైద్యసిబ్బందికి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆసుపత్రిలో కాన్పుకోసం కూతురు వెంట వచ్చిన తల్లిని ఆమె భర్త అందరు చూస్తుండంగానే అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆసుపత్రిలో వైద్యసిబ్బందిని, రోగులను, వారి బంధువులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి బంధువు ఆసుపత్రి సిబ్బందిపై దాడిచేశాడు. అదే ఆసుపత్రిలో పోలీసు ఔట్‌పోస్టు ఉన్నట్లైతే ఈ సంఘటన జరిగేది కాదేమోనని ప్రజలు చర్చించు కుంటున్నారు. గతంలో సైతం ఓ మహిళా వైద్యసిబ్బందిని ఓ ఆకతాయి వేధించిన సంఘటన చోటుచేసుకుంది. మండలంలో ఓ గ్రామం నుంచి వైద్యం కోసం వచ్చిన వ్యక్తి మృతి చెందటంతో బంధువులు, వారికి సంబంధించిన రాజకీయ నాయకులు అప్పటి వైద్యుడిపైన, సిబ్బందిపై దాడికి దిగారు. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నా అధికారుల్లో స్పందన కరువైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ప్రభుత్య ఆసుపత్రి స్థాయి సైతం 50 పడకల నుంచి 100 పడకలకు పెరింగింది. దీంతో వైద్య సిబ్బందితో పాటు రోగుల సంఖ్య పెరగటంతో నిత్యం ఆసుపత్రి జనంతో కిటకిటలాడుతున్నది.
రోజు 350 పైగా ఓపి ః ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు కలపి ఎమ్మిగనూరులో ఒక్కటే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. దీంతో వైద్యం కోసం ఈ రెండు నియోజకవర్గాలతో పాటు సి,బెళగల్ మండలంలోని ఆయా గ్రామాల నుంచి నిత్యం 350పైగా రోగులు వస్తుంటారు. వారితో పాటు వారి బంధువులు వస్తుండటంతో దాదాపు 700 నుంచి 800 మంది వరకు ఆసుపత్రిని సందర్శిస్తుంటారు. రోజు 5 నుంచి 6 కాన్పులు, మూడు సిజేరియన్ ఆపరేషను,్ల రెండు కంటి ఆపరేషన్లు జరుగుతుంటాయి. అంతేగాక రోజు 15 నుంచి 20 మంది ఆసుపత్రిలో వైద్యం కోసం (ఇన్‌పేషెంట్స్) చేరుతుంటారు. ఇక ఆసుపత్రిలో 14 మంది వైద్యులతో పాటు 94మంది వైద్యసిబ్బంది పనిచేస్తున్నారు.