బఫర్ అయితే మాకేం?
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:08 AM
మంత్రాలయంలో వైసీపీ నాయకుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ వంక, పోరంబోకు భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లలో కలిపేసుకుంటున్నారు.
బరితెగించి తుంగభద్ర పరివాహకంలో వెంచర్లు, నిర్మాణాలు
తుంగలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
ఆర్థికంగా నష్టపోతున్న ప్లాట్ల కొనుగోలుదారులు
మంత్రాలయంలో వైసీపీ నాయకుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ వంక, పోరంబోకు భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లలో కలిపేసుకుంటున్నారు. అక్రమార్కులు ఇంకా బరితెగిస్తే ఎలా ఉంటుందో బఫర్ జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వేయడం, ప్లాట్ల అమ్మకాలు, నిర్మాణాలను చూస్తే అర్థమవుతుంది. తుంగభద్రలో ప్రభుత్వ నిబంధనలు తుంగలో కలిపేసి బఫర్ జోన్‌లోనూ ఇష్టారాజ్యంగా వెంచర్లు వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాన్ని సంరక్షించాల్సిన జలవనరుల అధికారులు సిబ్బంది కొరత ఉందంటూ తప్పించుకుంటున్నారు. అక్రమ వెంచర్లపై కఠినంగా వ్యవహరించాల్సిన ‘కుడా’ కాసుల వేటలో కళ్లకు గంతలు కట్టుకుందనే ఆరోపణలు ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలు, మార్గదర్శకాలను తుంగలో కలిపేస్తున్నారు. మంత్రాలయం కేంద్రంగా సాగుతున్న రియల్ దందాపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నది ఉగ్ర రూపానికి పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం గతంలో తీవ్రంగా నష్టపోయింది. 2009 సెప్టెంబరు 2న మంత్రాలయం సహా నదీతీర పల్లెలు జలమయమయ్యాయి. తుంగభద్ర ముంచె త్తడంతో మంత్రాలయం అతలాకుతలమైంది. నదీ ప్రవాహానికి అడ్డంగా వెళితే ఎంతటి ఉపద్రవం ముంచుకొస్తుందో ఆ వరద విధ్వంసం కళ్లకు చూపించింది. అయినా.. మనవాళ్లకు కనువిప్పు కలగడం లేదు. కొందరి అక్రమార్కుల ధనాపేక్ష, స్వార్థానికి నదీ బఫర్ జోన్లు మాయం అవుతున్నాయి. మంత్రాలయం (మంచాల) రెవిన్యూ గ్రామాన్ని ఆనుకొని దాదాపు 3-4 కిలో మీటర్లు తుంగభద్ర ప్రవహిస్తుంది. రెవిన్యూ రికార్డులు ప్రకారం రివర్ బౌండరీస్ (నది సరిహద్దు), గరిష్ఠ వరద ప్రవాహ అంచుల (మ్యాగ్జిమమ్ ఫ్లడ్ లెవల్-ఎంఎఫ్‌ఎల్) నుంచి 50 మీటర్లు (150 అడుగులు) బఫర్ జోన్ ఉంటుందని జలవనరుల శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. నది సరిహద్దు నుంచి ప్రభుత్వ భూములైనా, ప్రైవేటు పట్టా భూములైనా ఎలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయడం, నిర్మాణాలు చేపట్టకూడదని అంటు న్నారు. ఇందుకు విరుద్ధంగా బఫర్ జోన్ కలిపేసుకొని వెంచర్లు వేయడమే కాకుండా ప్రహరీ సైతం నిర్మాణాలు చేయడం విమర్శలకు తావిస్తుంది.
యథేచ్ఛగా ఎన్జీటీ నిబంధనల ఉల్లంఘన
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి దాదాపు కిలోమీటరు దూరంలో వైసీపీ నాయకులు సుమారు 3.50 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ప్లాట్లు విక్రయాలకు పెట్టారు. ఈ వెంచర్‌లో ప్రధాన భాగస్వామిగా వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి అన్న కుమారుడు, ఆ పార్టీ యువనేత ఉన్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పట్టా భూమి అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. అయితే.. ప్రైవేట్ భూమి అయినా సరే బఫర్ జోన్‌లో వెంచర్లు, ప్లాట్లు వేయడం ఎన్జీటీ మార్గదర్శకాలకు విరుద్ధమని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాదు.. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము వేసే రియల్ వెంచర్ల మధ్య లేదా అనుకొని వంకలు, వాగులు ఉంటే వాటితో పాటు బఫర్ జోన్లను సంరక్షించాలి. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రభుత్వ వంక పోరంబోకు భూములు సైతం కబ్జా చేసి వెంచర్లలో కలిపేసుకోవడం విమర్శలకు తావిస్తుంది. మంత్రాలయం కేంద్రంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలు, సుప్రీమ్ కోర్టు ఆదేశాలు యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా రెవిన్యూ, జలవనరులు, కుడా, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణులు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లే-అవుట్లు వేసి దర్జాగా ప్లాట్లు విక్రయించడాన్ని అడ్డుకోవాల్సిన ‘కుడా’ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణులున్నాయి. నదీ బఫర్ జోన్ అంటే నదీ తీరం లేదా ప్రవాహానికి పక్కనే ఉండే రక్షిత ప్రాంతం. ఈ జోన్‌లో ఉండే చెట్టు, పొదలు, గడ్డి వరద నీటిలో మురుగు, రసాయనాలు వడగట్టి నదిలోకి చేరకుండా నదీ కాలుష్య నియంత్రణకు అడ్డుకట్టగా పని చేస్తుందని, పర్యావరణ సమతుల్యత, జీవవైవిధ్యాన్ని కాపాడడంలో కీలకంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. నదీతీరాల సహజ స్వరూపం కాపాడటానికి, వరద ముప్పును తగ్గించడం కోసం బఫర్ జోన్లో ఎలాంటి శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సరస్సులు చుట్టూ ఎఫ్‌టీఎల్ నుంచి 75 మీటర్లు, ప్రధాన నదుల తీరంలో రివర్ బౌండరీస్ (నది సరిహద్దు) నుంచి 50 మీటర్లు, ద్వితీయ శ్రేణి కాలువ చుట్టు 35 మీటర్లు, టెర్షియరీ కాలువల చుట్టూ 25 మీటర్లు, చెరువులు, కుంటలు పది హెక్టార్లు కంటే తక్కువ ఉంటే 9 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఉంటే 30 మీటర్లు, వాగులు, వంకలు పది మీటర్లు వెడల్పు ఉంటే 9 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఉంటే 30 మీటర్లు బఫర్ జోన్‌లుగా గుర్తించాల్సి ఉంటుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్సష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను నిరోధించడానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీం కోర్టు సైతం ఆదేశాలను జారీ చేసింది. మంత్రాలయంలో మాత్రం ఎన్జీటీ మార్గదర్శకాలు, ఆదేశాలు ఉల్లంఘనలు జరుగుతున్నా నిరోధించే చర్యలు తీసుకోకపోవడం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇలా చేస్తే..:
కర్నూలు నగరంలో హంద్రీ నదితీర ఆక్రమణలు నిరోధించడానికి గతేడాది ఇక్కడ పని చేసి జాయింట్ కలెక్టర్ బి. నవ్య ఆదేశాల మేరకు రెవిన్యూ, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి రివర్ బౌండరీస్ గుర్తించారు. సరిహద్దు వరకు సిమెంట్ కాంక్రీట్ పిల్లర్లు పాతారు. ఆ పిల్లర్ల నుంచి 50 మీటర్లు బఫర్ జోన్ ఉంటుందని, ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. మంత్రాలయంలో తుంగభద్ర నదీ బఫర్ జోన్లో సైతం వేస్తున్న వెంచర్లు నిరోధించేందుకు కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రెవిన్యూ, జలవనరులు, కుడా, పంచాయతీ అధికారులో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నదీ సరిహద్దులు గుర్తించి సరిహద్దు పిల్లర్లు ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి 50 మీటర్ల బఫర్ జోన్లో ఎలాంటి వెంచర్లు, ప్లాట్లు, శాశ్వత నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. 2009 నాటి వరదలు వస్తే ఆ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు శాశ్వత భవనాలు నిర్మించుకున్న సామాన్యులు నష్టపోయేది.
చర్యలు తీసుకుంటాం
మంత్రాలయం సహా ఎక్కడైనా నదీ పరివాహక బఫర్ జోన్‌లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా, శాశ్వత నిర్మాణాలు చేపట్టినా కుడా అప్రూవల్ ఇవ్వదు. చర్యలు తీసుకుంటాం.
- సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్, కర్నూలు:
అనుమతులు ఇవ్వం
నదితీరంలో 50 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. ఆ ప్రాంతంలో వెంచర్లు, నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వం. మంత్రాలయంలో తుంగభద్ర తీరంలో బఫర్ జోన్‌లో వెంచర్లు వేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. రెవిన్యూ, పంచాయతీ అధికారులతో కలసి సర్వే చేస్తాం. బఫర్ జోన్‌లో ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
కుడా డిప్యూటీ సిటీ ప్లానర్ మోహన్‌కుమార్