ఈఎస్‌జీలో ఏ గ్రేడ్
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:18 PM
ఆర్థిక వృద్ధి, సామాజిక, సుపరిపాలన (ఈఎస్‌జీ)లో కర్నూలు జిల్లా మెరుగైన ప్రగతి నమోదు చేసుకుంది. జిల్లా ఫ్రంట్ రన్నర్‌లో ఏ గ్రేడ్ దక్కించుకుంది.
ఆర్థిక, సామాజిక రంగాల్లో మెరుగైన ప్రగతిలో కర్నూలు
సుపరిపాలనలో వెనకడుగు
అభివృద్ద్ధి బాటలో పారిశ్రామిక రంగం
కలెక్టర్ల సమావేశంలో దిశా నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
హాజరైన మంత్రి టీజీ భరత్, కలెక్టర్ ఏ.సిరి
ఆర్థిక వృద్ధి, సామాజిక, సుపరిపాలన (ఈఎస్‌జీ)లో కర్నూలు జిల్లా మెరుగైన ప్రగతి నమోదు చేసుకుంది. జిల్లా ఫ్రంట్ రన్నర్‌లో ఏ గ్రేడ్ దక్కించుకుంది. ఆర్థిక వృద్ధిలో భాగంగా ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలు, వనరుల నిర్వహణ, వ్యర్థాల నిర్వహణలో 86 పాయింట్లు, సామాజిక (సోషియల్) వృద్ధిలో భాగంగా ఆరోగ్య సేవలు, విద్యా ప్రమాణాలు, సామాజిక భద్రతలో 91 పాయింట్లతో ఫ్రంట్ రన్నర్-ఏ గ్రేడ్ దక్కించుకోగా, సుపరిపాలన(గవర్నెన్స్)లో భాగంగా డిజిటల్ సేవలు, ఫిర్యాదుల పరిష్కారం, శాంతిభద్రతలు, నిధుల వినియోగంలో 67 పాయింట్లతో బీ గ్రేడ్‌తో సరిపుచ్చుకుంది. కీలక పనితీరులో కూడా 82 పాయింట్లతో ఏ గ్రేడ్‌లో నిలిచింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి జిల్లా మంత్రి టీజీ భరత్‌గుప్తా, కలెక్టర్ ఏ. సిరి హాజరయ్యారు. జిల్లా పురగతిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్థికాభివృద్ధి సూచికగా నిలిచే జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ), జిల్లా తలసరి ఆదాయం (పీసీ) వృద్ధి రేటులో 2025-26లో జిల్లా బాగా వెనుకబడింది. తలసరి ఆదాయంలో ప్రమాదకర స్థాయిలో 24వ ర్యాంక్‌తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు సాధించాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు సూచించారు. వ్యవసాయం సహా అనుబంధ రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాల్లో మెరుగైన ప్రగతి సాధించాలని దిశానిర్దేశం చేశారు. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్, మైనింగ్ వంటి కీలక శాఖల ద్వారా ఆదాయం రాబడి పెంచాల్సి ఉంది. అదే క్రమంలో వివిధ శాఖ పనితీరును మెరుగైన వృద్ధిని సాధించి ప్రజలకు సేవలు విస్తృతం చేయాలి. టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆన్‌లైన్‌లో ఫైల్స్, డేటాలేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. ప్రతి రంగంలోనూ ప్రజల సంతృప్తి ఎంతో ముఖ్యం. స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో రాష్ట్రం జీవీఏ క్వార్టర్ (క్యూ)-1 రూ.3,44,832 కోట్లలో శాతం వృద్ధి (గ్రోత్) సాధిస్తే, కర్నూలు జిల్లా వ్యవసాయ రంగంలో 2025-26లో క్వార్టర్-1 రూ.1,205 కోట్లు రాబట్టి 23 ర్యాంక్‌లో నిలిస్తే, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఒక క్వార్టర్‌లో రూ.1,373 కోట్లు రాబట్టి అదే 23వ ర్యాంక్‌తో సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. అయితే.. ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయం రంగంలో జీవీఏ బాగా వెనుబడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
సీమ హార్టికల్చర్ హబ్ కింద రూ.219.6 కోట్లు
కేంద్ర ప్రభుత్వ సహకారంలో చేపట్టే రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ సమావేశాలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మూడేళ్లలో రూ.1,533 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లాలో 2026-27లో 187.3 కిలో మీటర్లు ఉద్యాన పంటలు సాగు చేసి రూజ113.9 కోట్లు, 2027-28లో 96.8 కిలో మీటర్లు, రూ.58.9 కోట్లు, 2028-29లో 78.2 కిలో మీటర్లు ఉద్యాన పంటలకు రూ.46.9 కోట్లు చొప్పున మూడేళ్లలో 362.4 కిలో మీటర్లు ఉద్యాన పంటలకు రూ.219.6 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా రైతాంగాన్ని సన్నద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ప్రగతి బాటలో పారిశ్రామిక రంగం
జిల్లా పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతుంది. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ ఎంతో అభివృద్ధి వేగం అందుకుంది. తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద రూ.689 కోట్లతో నిర్మించిన జియో మైసూర్ గోల్డ్ ప్రాజెక్ట్ పరిశ్రమను ఈ ఏడాది జూన్ 24న సీఎం చంద్రబాబును ప్రారంభించారు. రూ.2 వేల కోట్లతో టాటా రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు జూలై 30న యువనేత నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. జిల్లాలో 20 పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంలో ఎంవోయూ చేసుకోగా, అందులో 11 పరిశ్రమలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టాయి. అదే క్రమంలో 31 పరిశ్రమలు ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ అప్రూవల్ పొందగా 11 పరిశ్రమలు నిర్మాణ దశకు చేరుకున్నాయి. ఈ విషయంలో జిల్లా ఆశాజనంగా పురోగతి సాధించిందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. అదే క్రమంలో జిల్లాలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు 6,335.08 ఎకరాల భూములు కావాలని వినతలు ఇవ్వగా, ప్రభుత్వ నిబంధనల మేరకు 2,385.15 ఎకరాలు ఏపీఐఐసీ ఆయా పరిశ్రమలకు అప్పగించింది.
జిల్లాలో పీఎంఏవై -0.1, 0.2 కింద 70,092 పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపడితే 42,501 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. 26,660 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 61 శాతం పురోగతిలో జిల్లా 23వ స్థానంలో ఉంది. ఈ నెల 25వ తేది నాటికి ఏపీ టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు పూర్తిగా అందజేయాలని ప్రభుత్వ లక్ష్యం నిర్దేశించింది. అది సాధ్యమా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.
కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీల్లో 1,86.722 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటే 1,16,776 కుళాయి కనెక్షన్లు ఇచ్చి 72.78 శాతంతో సరిపుచ్చుకున్నారు. ఇంటింటి చెత్త సేకరణలో 92.44 శాతం, వీధి దీపాలు 97.93 శాతం ఏర్పాటు చేశారు. వంత శాతం ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు.
జిల్లాలో 26 మండలాల్లో 439 గ్రామాలు ఉన్నాయి. మొదటి, రెండు విడతల్లో ఆదర్శ గ్రామాల సర్వే వంద శాతం పూర్తి చేశారు. 721 హ్యాబిటేషన్లు ఉంటే, ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్లు తాగునీరు ఇవ్వాలని లక్ష్యం కాగా, 2024 వరకు 19 హ్యాబిటేషన్స్ కవర్ చేయగా, 2024-29 మధ్య కాలంలో 524 హ్యాబిటేన్లను కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
733 హ్యాబిటేషన్స్ ఉంటే 677 హ్యాటేషన్స్‌కు రోడ్డు సౌకర్యం కల్పించగా, 12 గ్రామాలకు రోడ్డు పనులు వివిధ దశల్లో ఉంటే, 22 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో స్పష్టంగా వివరించారు.
జిల్లాలో రూ.71.2 కోట్లు నిధులు కలెక్టర్ వద్ద అందుబాటులో ఉండగా రూ.55.4 కోట్లు (78 శాతం) మాత్రమే ఖర్చు చేశారు.
ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 11 పరిశ్రమలు రూ.10 వేల కోట్లు పెట్టుబడులు, 6,800 మందికి ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఆ పరిశ్రమలకు ప్రతి రోజు 68 ఎంఎల్‌డీ నీరు అవసరం ఉంది. ఈ హబ్ వాటర్ సప్లయ్ స్కీం పూర్తి దశలో ఉంది. 90 శాతం పనులు పూర్తయ్యాయి. జిల్లాలో నేషనల్ హైవే-40 క్రాసింగ్ అప్రూవల్, రైల్వే అప్రోచ్‌రోడ్డు, పైపులైన్ పనులకు భూ సేకరణ సమస్యలు ఉన్నాయి. తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించాలి.
జలధార-జలహారతి పనుల్లో జిల్లా ఆశాజనంగా పురోగతి సాధించిందని చంద్రబాబు అభినందించారు. 6,764 పనులు చేపట్టారు. 3,668 కిలోమీటర్లు ఫీడర్ ఛానల్స్ పనులు, 56.38 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తొలగించారు.