ప్రామాణికత ఏమిటి ?
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:19 AM
ప్రతి యేటా స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
సేవలందించిన వారికి మొండిచేయి
సేవలకా.. పైరవీలకా..!
స్వాతంత్య్ర వేడుకల్లో ప్రశంసా పత్రాలు అందజేత
ప్రామాణికతను పాటించని ఉన్నతాధికారులు
క్షేత్రస్థాయిలో పనిచేసిన ఉద్యోగులకు దక్కని గుర్తింపు
కమిటీలతో ఎంపిక చేయాలంటున్న ప్రజా సంఘాలు
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రతి యేటా స్వాతంత్య్ర దినోత్సవం సం దర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు. అయితే వీటికి ప్రామాణికత ఏమిటీ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు అందిం చిన సేవల ఆధారంగానా.. పైరవీలు చేసేవారికా ప్రశంసా పత్రాలా అన్న సందిగ్ధం నెల కొంది. జిల్లాలోని ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, అధికారులు, సిబ్బందికి కలెక్టర్ చేతుల మీదుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రశంసా పత్రాలు అందజేస్తారు.
ప్రతిసారీ చర్చ..
ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేసినవారిని ప్రోత్సహించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రశంసా పత్రాల ఎంపికలో పారదర్శకతపై ప్రతి సారీ చర్చ జరు గుతోంది. నిజంగా ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ గుర్తింపు దక్కుతోందా ..లేక శాఖల్లో ఉన్నతాధికారులకు దగ్గరగా ఉండే వారికి ప్రాధాన్యం లభిస్తోందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి..
రెవెన్యూ శాఖలో సబార్డినేట్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వరాదని ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పనిచేసే సిబ్బంది నుంచి ఉన్నతఽఅధికారులు వరకు వారి పని తీరును పరిశీలించి అర్హత ఆధారంగా ఎంపిక చేయాలని పలువురు కోరుతున్నారు.
రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి
ప్రశంసా పత్రం అనేది ఉద్యోగి సేవలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు. అలాంటి పురస్కారాల ఎంపికలో వ్యక్తిగత పరిచయాలు, పైరవీలు, అధికారుల అనుకూలత కాకుండా పనితీరే ప్రామాణికంగా ఉండాలని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రజల సమస్యలను పరి ష్కరించడంలో చొరవ చూపిన క్షేత్రస్ధాయి ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని గుర్తిం చాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శాఖలో శాఖాపరమైన విచారణలు లేదా చర్యలు ఎదుర్కొంటున్న వారి పేర్లను ప్రశంసా పత్రాల కోసం పరి శీలించే సందర్భంలో సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
కాగితం కాదు.. సేవలకు ఇచ్చే గుర్తింపు
ప్రశంసా పత్రం అంటే అధికారిక కార్యక్రమంలో ఇచ్చే కాగితం కాదు. ఉద్యోగి సేవలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు. అర్హత, పనితీరు, నిజాయితీ ఆధారంగానే ఎంపిక జరగాలి. శాఖల వారీగా కమిటీ లు ఏర్పాటుచేసి పారదర్శకంగా పరిశీలించిన తర్వాతే పేర్లును ఖరారు చేయాలని ప్రజా సంఘాలు, ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఈసారైనా ఎంతమేరకు ప్రజలకు సేవ చేశారన్న దానినే ప్రామాణికంగా తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.
సమస్యలు పరిష్కరించిన వారికి ఇస్తాం..
ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రజల సమస్యలను పరిష్కరించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తాం. - నూరల్ ఖమర్, జేసీ, కర్నూలు