శాయ్ ఎటో?
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:28 PM
కర్నూలులో శాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పోర్ట్స్ హాస్టల్ 2000లో ఏర్పడింది.
తిరుపతికి తరలించే యత్నం
కర్నూల్లోనే ఉంచాలని క్రీడా సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి
కర్నూలు స్పోర్ట్స్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): కర్నూలులో శాయ్(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పోర్ట్స్ హాస్టల్ 2000లో ఏర్పడింది. నగరంలోని డీఎస్‌ఏ ఔట్‌డోర్ స్టేడియం పైఅంతస్తులో ఈ హాస్టల్ కొనసాగుతోంది. శాయ్ హాస్టల్‌కు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్‌ఏ) సహకారం తప్పనిసరి. శాయ్ హాస్టల్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రధాన కార్యాలయం ఢిల్లీ, రీజనల్ కార్యాలయం బెంగుళూరులో ఉన్నాయి. గతంలో బాస్కెట్ బాల్, హాకీ, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్ తైక్వాండో క్రీడాకారులు హాస్టల్‌లో ఉంటూ శిక్షణ తీసుకునేవారు. బాస్కెట్ బాల్, హాకీ క్రీడాకారులు డే బోర్డర్‌గా ఉండేవారు. ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, తైక్వాండో క్రీడాకారులు హాస్టల్‌లో ఉండేవారు. క్రీడాకారులకు యూనిఫాం, షూ, భోజన వసతి, స్కూల్ ఫీజు (విద్య కోసం), ఇన్సురెన్స్ హాస్టల్ సౌకర్యం కేంద్ర ప్రభుత్వం (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సమకూర్చుతుంది. శాయ్ హాస్టల్ తిరుపతికి తరలించాలనే అంశం జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. హాస్టల్‌ను తిరుపతికి తరలించాలనే యత్నాలు జరగనున్నాయని అనుమానం. క్రీడాకారులు, క్రీడాభిమానులు, స్థానికులు ఆగ్రహంలో ఉన్నారు. కొంతమంది కోచ్‌లు సూత్రధారులనే అంచనా ఉంది. కోచ్‌లు నాణ్యమైన శిక్షణ క్రీడాకారులకు ఇవ్వాలి. అలా కాకుండా సెంటర్ మార్పు కోసం ఫైరవీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కర్నూలు శాయ్ హాస్టల్‌లో 25 సంవత్సరాలుగా జిల్లాలో అనేక పేద, ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆశ్రయంగా నిలిచింది. ఫుట్ బాల్, హాకీ, బాస్కెట్ బాల్, తైక్వాండో, హ్యాండ్‌బాల్ వంటి క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని ప్రతిభ చాటారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్‌లో అనేక మంది క్రీడాకారులు ఉద్యోగాలు సాధించారు. ఈ హాస్టల్ ఇన్‌చార్జిలు విజయ్, రమేష్‌బాబు, చెన్నారెడ్డి, దేవేందర్, చంద్రశేఖర్ 2000-2022 వరకు కొనసాగారు. 120 మంది క్రీడాకారులు ఉండేవారు. ప్రస్తుతం హ్యాండ్‌బాల్, తైక్వాండోలో 44 మంది మాత్రమే ఉన్నారు. 2005లో ఆదరణ లేని కారణంగా హాకీ, బాస్కెట్ బాల్‌ను తొలగించారు. ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ క్రీడను కూడా తొలగించారు.
నివేదిక ఆధారంగా
గత కొన్ని నెలల క్రితం ఇంజనీర్ల బృందం శాయ్ హాస్టల్‌ను పరిశీలించింది. భవనం శిథిలావస్థలో ఉందని మరమ్మతులు పూర్తయ్యే వరకు కొత్తగా నిర్మించిన డీఎస్‌ఏ మల్టీపర్పస్ భవనంలో కొనగించాలని క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. క్రీడా కేంద్రం తరలించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తప్పనిసరి. క్రీడాసంఘాల ప్రతినిధులు క్రీడాకారులు, క్రీడాకారుల అభిప్రాయాలు తీసుకోవాలి. తమిళనాడుకు చెందిన శిక్షకులు దీని తరలింపునకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో కర్నూలు కేంద్రానికి తప్ప అన్ని కేంద్రాల్లో శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. శిక్షకులు క్రీడాకారులను సెలవు సాకుతో ఇళ్లకు పంపారు. నెల రోజులుగా కోచ్ సెలవులో ఉన్నారు. నెల రోజులు సెలవు ఇవ్వడంతో అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయాన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. శాయ్ హాస్టల్ ఎక్కడికీ పోదనీ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించి కేంద్ర క్రీడామంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారు.
డీఎస్‌ఏ ఆధ్వర్యంలో ఉండే నూతన మల్టీపర్పస్ భవనం పై అంతస్థులో షిఫ్టు చేసి అక్కడ శాయ్ హాస్టల్‌ను కొనసాగించాలని క్రీడాసంఘాల ప్రతినిధులు సునీల్ కుమార్, నాగరత్నమయ్య, రుద్రరెడ్డి, అవినాష్ గుప్త, రామాంజనేయులు కోరుతున్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు: హాస్టల్ తరలింపు యత్నంపై కలెక్టర్ సిరికి, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు క్రీడాభిమానులు ఫిర్యాదు చేశారు. కర్నూలు క్రీడా భవిత ప్రభుత్వంపై ఉందని వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
స్పోర్ట్స్ హాస్టల్ కర్నూలులోనే ఉండాలి
కర్నూలు స్పోర్ట్స్ హాస్టల్ సాధనకు గతంలో మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ పట్టుదలతో హాస్టల్‌ను ఏర్పాటుకు సహకరించారు. హాస్టల్ వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు వివిధ మెడల్స్, పతకాలు సాధించారు. హాస్టల్‌కు మరమ్మతులు చేయించి హాస్టల్‌ను ఇక్కడే ఉంచాలని వేయి సంతకాలు చేయించాం. మంత్రి టీజీ భరత్ చొరవ తీసుకోవాలి.
- నాగరత్నమయ్య,
విలువిద్య సంఘం కార్యదర్శి
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుచుకోవాలి
గతంలో బాలసాయి పాఠశాల సమీపంలో 12 ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించింది. వీరు ఆసక్తి చూపలేదు. ప్రభుత్వ స్థలం వెనక్కి తీసుకుంది. రాయలసీమలో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ క్రీడలకు మంచి ఆదరణ ఉంది. ప్రభుత్వం హాస్టల్‌ను విస్తరించాలి.
- కార్తికేయన్, శాయ్ హాస్టల్ ఇన్‌చార్జి, తైక్వాండో కోచ్