3.36 లక్షల ఓటర్లు ఏమైనట్లు?
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:32 PM
కర్నూలు జిల్లాలో 3.36 లక్షల ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్‌వోలకు చేరలేదు. అందులో దాదాపు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డూప్లికేట్ ఓటర్లు దాదాపు 2.65 లక్షల మంది ఉన్నారు.
కర్నూలు జిల్లాలో ఓటర్లు 20,86,119
బీఎల్‌వోలకు చేరిన ఎన్యుమరేషన్ ఫారాలు 17.50 లక్షలు
మ్యాపింగ్ చేయనివి 39 వేలు
మూడు రోజులే గడువు
కర్నూలు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో 3.36 లక్షల ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్‌వోలకు చేరలేదు. అందులో దాదాపు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన, డూప్లికేట్ ఓటర్లు దాదాపు 2.65 లక్షల మంది ఉన్నారు. మిగిలిన ఓటర్లు ఏమైనట్లు..? ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియకు మిగిలిన గడువు నేటితో మూడు రోజులే. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. బీఎల్‌వోలు ఇంటింటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవడమే కాకుండా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి భర్తీ చేసిన ఫారాలు సేకరించారు. రాజకీయ పార్టీలు కూడా ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి సర్ సక్సెస్‌కు సహకరించారు. ఎల్లుండితో గడువు ముగుస్తుండడంతో మిగిలిన వారు తమ వద్ద ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలను బూత్ స్థాయి అధికారుల(బీఎల్‌వో)కు అందించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.
జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండ, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)’ ప్రక్రియ ప్రారంభించే నాటికి జిల్లాలో 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 12న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్‌వోలు 20,86,119 ఓటర్లకు (వంద శాతం) ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. వాస్తవంగా ఈ నెల 14న గడువు ముగిసే నాటికి అన్ని వివరాలు నింపి తిరిగి ఇచ్చిన ఫారాలను 99.87 శాతం డిజిటలైజ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు గడువు పొడిగించింది. ఫారాలు పంపిణీ, డిజిటలైజ్ వంద శాతం పూర్తి అయిందని జిల్లా ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
తిరిగివ్వని ఫారాలు 3.36 లక్షలు
ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాల్లో మంగళవారం నాటికి బీఎల్‌వోలకు చేరింది 17.50 లక్షలు అని తెలుస్తోంది. అంటే 3.36 లక్షల ఫారాలు బీఎల్‌వోలకు చేరలేదు. వాటిలో మరణించిన (డెత్), శాశ్వతంగా వలస వెళ్లిన (పర్మనెంట్ మైగ్రేషన్), ఒకే వ్యక్తి రెండు అంతకంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారు (డూప్లికేట్) ఓటర్లు దాదాపు 2.65 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. ఇంకా 72 వేల మంది ఓటర్ల లెక్క తేలాల్సి ఉంది. అడ్రస్‌లు దొరకని (నాట్ ట్రేసౌట్) ఓటర్లుగా గుర్తించాల్సి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మూడు రోజులు గడువు ఉండడంతో మరోసారి బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికి వెళ్లి పరిశీలిస్తారు. అర్హత ఉండి, ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకపోతే ఈ నెల 31న ఎన్నికల సంఘం ప్రకటించే ముసాయిదా ఓటర్ల జాబితాలో వారు పేరును కోల్పోతారు. అదే జరిగితే బతికుండగానే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ప్రజలు బాధ్యతగా భావించి ఇంకా ఫారాలు ఇవ్వని వారెవరైనా ఉంటే ఈ మూడు రోజుల్లో స్థానిక బీఎల్‌వోలకు అందజేసి ఓటు హక్కును కాపాడుకోవాలని అధికారులు కోరుతున్నారు.
24లోగా నివృత్తి చేసుకోవాలి
ఓటర్లకు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ పారాల్లో దాదాపు 3.36 లక్షలు తిరిగి వెనక్కి రాలేదు. వారిలో అర్హులు ఉంటే తక్షణమే బీఎల్‌వోలకు ఫారాలు అందజేయాలి. 2002 ఎన్నికల ఓటర్ల జాబితాలో సరిపోల్చి చూసిన తరువాత అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించాం. ఆ జాబితా బీఎల్‌వోల వద్ద ఉంది. అర్హులైన ఓటర్లు ఉన్నా, రాజకీయ పార్టీలు పరిశీలించి ఏమైనా సందేహాలు ఉంటే 24లోగా నివృత్తి చేసుకోవాలి. ఈ నెల 14వ తేది నాటికి 2002 ఓటర్ల జాబితాలో పోలిస్తే 1.30 లక్షల మంది మ్యాపింగ్ జరగలేదు. బీఎల్‌వోలను ఇంటింటికి పంపించి తల్లిదండ్రులు, అవ్వతాతలు, ఇతర బంధువులతో మ్యాపింగ్ చేసి ఆ సంఖ్యను 39 వేలకు తగ్గించాం. ఈ మూడు రోజుల్లో ఆ సంఖ్యను మరింత తగ్గించేందుకు కృషి చేస్తాం. ఆ తరువాత వారికి నోటీసులు ఇస్తాం.
- నూరుల్ ఖమర్, జాయింట్ కలెక్టర్, కర్నూలు