పీపీపీ ఏమైంది?
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:14 AM
వివిధ దశల్లో ఆగిపోయిన వైద్య కళాశాలల భవనా లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ - పీపీపీ) విధానంలో పూర్తి చేయడానికి సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు అఽధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఆదోని మెడికల్ కాలేజీ భవిష్యత్ అగమ్యగోచరం
అసంపూర్తిగా భవనాలు
క్యాంపు ఎత్తేసిన కాంట్రాక్ట్ సంస్థ
టెండరు దశలోనే ఆగిపోయిన పురోగతి
2026-27లో వైద్య విద్యార్థుల ప్రవేశం అనుమానాస్పదమే
వివిధ దశల్లో ఆగిపోయిన వైద్య కళాశాలల భవనా లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్ - పీపీపీ) విధానంలో పూర్తి చేయడానికి సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు అఽధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి దశలో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందులు మెడికల్ కాలేజీల అభివృద్ధి, ఆర్‌ఎఫ్‌పీ ముసాయిదా, రాయితీ ఒప్పందాలకు ఆమోద ముద్ర వేశారు. టెండర్లు ద్వారా పీపీపీ విధానంలో ముందుకు వచ్చే సంస్థలకు కళాశాల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఈ ఏడాది నుంచే వైద్య విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారని ఆశించారు. నెలలు గడస్తున్నా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. కాంట్రాక్ట్ సంస్థ క్యాంపు కార్యాలయం ఎత్తేసింది. అసంపూర్తి భవనాలకు రక్షణ కరువైంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
కర్నూలు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఆదోని వైద్య కళాశాల నిర్మాణ పనులను గత వైసీపీ ప్రభుత్వం ఆరంభించింది. 420 బెడ్స్ ఉన్న బోధనాస్పత్రి ఇది. 2024-25 నాటికి పూర్తి చేసి వైద్య విద్య తరగతులు ప్రారంభిస్తామని ఆనాటి ప్రభుత్వం ఆర్భాటం చేసింది. నాడు-నేడు కింద రూ.475 కోట్లు మంజూరు చేస్తూ 2021 మార్చి 22న జీవోఎంఎస్: 33 జారీ చేసింది. ఈ మొత్తం నాబార్డు రుణంగా ఇస్తుంది. హైదరాబాద్‌కు చెందిన కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ టెండరు దక్కించుకుంది. సివిల్ పనులు రూ.355.74 కోట్లకు చేసేలా ఆంధ్రప్రవేశ్ మెడికల్ సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎం ఎస్‌ఐడీసీ)తో ఒప్పందం చేసుకున్నారు. 2023 డిసెంబరు 26న ఆ సంస్థకు కళాశాల నిర్మాణాల కోసం 58.44 ఎకరాల భూమిని అప్పగించారు. ఒప్పందం ప్రకారం 2025 జూన్ 6 నాటికి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగిస్తామని కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.78.32 కోట్లు విలువ చేసే వివిధ నిర్మాణాలు చేశారు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు రావనే భయంతో కాంట్రాక్ట్ సంస్థ పనులు ఆపేసింది. 2024 జూన్ 12న సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పర్యవేక్షణ లేకపో వడంతో ముళ్లపొదలు పెరిగి అసంపూర్తి నిర్మాణాలు శిథిలా వస్థకు చేరుకుంటున్నాయి. పనులు నిర్మాణాలు నీళ్లలో ముని గిపోవడంతో స్టీల్ తుప్పుపట్టి, ఆ తరువాత నిర్మాణాలకు అనువుగా ఉంటాయా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసంపూర్తి భవనాలకు రక్షణేది..?
ఆదోని వైద్య కళాశాలను పీపీపీ విధానంలో నిర్వహణకు టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, ఆ పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ క్యాంప్ కార్యాలయం ఎత్తేసింది. ఇనుప రేకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రహరితో పాటుగా మొత్తం నిర్మాణ సామగ్రిని కూడా అక్కడి నుంచి తరలించారు. దీంతో ఇప్పటికే రూ.78.32 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, వివిధ దశల్లో ఆపేసిన కాలేజీ భవనాలకు రక్షణ ఏదనే ప్రశ్న తలెత్తింది. గుర్తు తెలియన వ్యక్తులు రాత్రిళ్లు బైట పడేసిన నిర్మాణ సామగ్రిని దొంగలించుకువెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే నిర్మాణంలో ఉన్న పిల్లర్ల ఇనుప రాడ్లు (కడ్డీలు) కోసుకువెళితే, ఆ తరువాత భవన నిర్మాణాలకు ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు స్పందించి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఆరేకల్లు గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ప్రజా ప్రతినిధులు చొరవ చేయాలి
ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే పశ్చిమ ప్రాంతం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ విభాగా లకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు, ప్రొఫె సర్లు ఇక్కడే అందుబాటులో ఉంటారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా జిల్లా మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు సహా ఆదోని, ఎమ్మిగ నూరు ఎమ్మెల్యేలు డాక్టర్ పార్థసారథి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని, ఆలూరు, మంత్రాలయం ఇన్‌చార్జిలు మాజీ ఎమ్మెల్యే కె. మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, ఎన్. రాఘవేంద్రరెడ్డి, ముఖ్య నాయకులు సమష్టిగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరో గ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లపై ఒ త్తిడి తెచ్చి పనులు మొదలు పెట్టేలా కార్యాచ రణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నెలలు గడుస్తున్నా..!
రాష్ట్రంలో వివిధ దశల్లో ఆగిపోయిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని నిర్ణయించాక ఈ విధానంలో వైద్య కళాశాలలు నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బృందం పర్యటించింది. ఆ రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో ఎలా నిర్వహిస్తున్నదీ అధ్యయనం చేసింది. కళాశాలను ప్రారంభించాక ఓపీ, ఐపీ అంచనాలు, రోగ నిర్ధారణ పరీక్షల యంత్రాలు, పరికరాల కొనుగోళ్లకు అయ్యే వ్యయం, వైద్యసీట్లు ద్వారా వచ్చే ఆదాయం, వైద్యులు, సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు.. ఇలా సమగ్ర వివరాలతో ఇచ్చిన అధారంగా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. టెండర్లు నిర్వహించి, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలకు నిర్వహించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం అప్పగించాల్సి ఉంది. నెలలు గడస్తున్నా ఆ దిశగా టెండర్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఈ ఏడాది కళాశాలలో వైద్య విద్యార్థుల ప్రవేశాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఆదోని మెడికల్ కళాశాల, బోధనాస్పత్రి ప్రారంభమైతే ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుంది. చిన్న జబ్బు చేసినా, ప్రమాదాలు జరిగినా 75-100 కి.మీల దూరంలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వెళ్లే పని ఉండదు. కర్నూలు జీజీహెచ్ వైద్యులపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంది.
కాంట్రాక్ట్ ఒప్పందం రద్దు కాలేదు
ఆదోని మెడికల్ కళాశాల కాంట్రాక్ట్ సంస్థ కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ క్యాంప్ కార్యాలయం ఎత్తేసిన మాట నిజమే. ఆ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం రద్దు కాలేదు. పీపీపీ విధానంలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో నిర్వహణకు ముందుకు వచ్చే సంస్థకు టెండర్ల ద్వారా అప్పగిస్తారు. ఆ ప్రక్రియ హెడ్ ఆఫీసులో జరుగుతుంది.
- చిరంజీవులు, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ, కర్నూలు