Share News

రాయలసీమకు ఏం చేశారో చెప్పాలి..?

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:08 PM

రాయలసీమ ప్రాజెక్ట్‌ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్న వైసీపీ నేతలు జగన్‌ హయంలో రాయలసీమకు చేసిందేమిటో చెప్పాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు.

రాయలసీమకు ఏం చేశారో చెప్పాలి..?
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుడ్డా

ఆర్భాటం కోసమే రాయలసీమ ఎత్తిపోతలు ప్రారంభం

వైసీపీ నేతలపై ఎమ్మెల్యే బుడ్డా ఆగ్రహం

ఆత్మకూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ప్రాజెక్ట్‌ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్న వైసీపీ నేతలు జగన్‌ హయంలో రాయలసీమకు చేసిందేమిటో చెప్పాలని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సిద్దాపురం ఎత్తిపోతలపథకం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్ట్‌ కనీస అవగాహన లేకుండా ఆర్భాటం కోసం పనులను ప్రారంభించి అభాసు పాలయ్యారని విమర్శించారు. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ) అనుమతులు లేకుండా పనులను చేపట్టి చివరి చివాట్లు తిని జరిమానాలు చెల్లించాల్సిన దుస్థితికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. అలాగే అపెక్స్‌ కౌన్సిల్‌లో కూడా వాదనలు వినిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాసుకున్న రాజ్యాంగంలోనూ, డిక్షనరీలోనూ ఎక్కడా నిజాలు చెప్పడం ఉండవని మండిపడ్డారు. 2019-24 వరకు ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌ ప్రభుత్వం రూ.12లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే అందులో రాయలసీమ ప్రాజెక్ట్‌లకు ఇచ్చింది కేవలం రూ.2వేల కోట్లు మాత్రమేనని అందులోనూ.. రూ.900కోట్లను మట్టిపనుల పేరిట కాజేశారని ఆరోపించారు. అదే 2014-19 టీడీపీ హయంలో రాయలసీమ ప్రాజెక్ట్‌లకు రూ.12వేట కోట్లను ఖర్చు చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి పాలనలో కూడా ఇప్పటి వరకు రూ.3,830 కోట్ల బడ్జెట్‌ను సీమ జిల్లాలోని ఇరిగేషన్‌ అభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అలగనూరు ప్రాజెక్ట్‌కు రూ.35కోట్ల నిధులు కేటాయించామని వివరించారు. మొంథా తుఫాన్‌ ధాటికి వరదరాజ స్వామి ప్రాజెక్ట్‌, భవనాశి వాగు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను గుర్తించి రూ.150కోట్లతో అభివృధ్ది చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, కేసీకెనాల్‌ ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ బన్నూరు రామలింగారెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 11:08 PM