ఎంత పని చేశావమ్మా!
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:17 AM
ఎంత పని చేశావమ్మా!
ఇద్దరు బిడ్డలకు విషమిచ్చిన తల్లి
ఆపై ఆమె బలవన్మరణం
దంపతుల మధ్య విభేదాలే కారణం
నంద్యాల పట్టణంలో విషాదం
అమ్మా.. నువ్వేనా ఇలా చేసింది?
ఊపిరి తీయడానికేనా కన్నది
నీవు పస్తులున్నా మా కడుపు నింపావే
గోరుముద్దలు కొసిరి తినిపించావే
ఆ చేతులేనా మాకు విషమిచ్చింది?
నీకెంత కష్టం వచ్చినా
మమ్మల్ని చూసి మురిసిపోయేదానివిగా..
సుఖీభవ అని దీవించిన నీకు
చంపాలన్న మనసెలా వచ్చిందమ్మా?
నీకు, నాన్నకు గొడవ జరిగితే బాధేసేది
రాత్రంతా హత్తుకుని పడుకుంటే
నీవే సర్వస్వం.. అనుకున్నాం..
ఏదో గ్లాసులో పోసిస్తే
అమ్మ కదా అని నమ్మి తాగేశాం..
చివరి నిమిషంలో మా నవ్వులు
చూసైనా మనసు కరగలేదా?
చివరకు నీవు కూడా మాతోపాటే..
ఎంత పని చేశావమ్మా..
ఏమైనా నీవు మా అమ్మవి
ఐలవ్ యూ మమ్మీ..
ఇలాంటి మరణం మరొకరికి వద్దమ్మా..!
నంద్యాల క్రైం, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): తల్లిలేని ఆమె కోటి ఆశలతో మెట్టినింటికి వెళ్లింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఐదేళ్లకు ముద్దులొలికే ఓ చిన్నారి జన్మనిచ్చింది. చందమామ లాంటి ఇద్దరి పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తూ... ఆప్యాయతానురాగాలు పంచుతూ బిడ్డలే సర్వస్వంగా ఆ తల్లి బతికింది. ఎదుగుతున్న బిడ్డలు మాట్లాడు తున్న ముద్దులొలికే మాటలతో ఆ తల్లి ఎంతో ఆనందపడింది. చక్కని సంసారంలో కుటుంబ కలహాలు ఆ తల్లిని కుంగదీశాయి.
బలీయమైన విధి చేతిలో ‘అమ్మ’గా ఆమె ఓడిపోయింది. బిడ్డల భవిష్యత్తుపై పూర్తిగా ఆశలు వదులుకున్న ఆ మాతృమూర్తి వారి గొంతులో గరళం పోసింది. ఆపై తానూ తనువు చాలించింది. కన్నబిడ్డలను చంపేసి.. తల్లి ఉరేసుకున్న ఈ విషాదకర సంఘటన శనివారం నంద్యాల పట్టణంలో పెను విషాదాన్ని నింపింది. అప్పటివరకు ఆడుతూపాడుతూ కనిపించిన ఆ చిన్నారులు అచేతన స్థితిలో ఉండటాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు ఆగలేదు.
పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు.. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీకు చెందిన ఉపాధ్యాయుడు బసవ ప్రసాద్ కుమార్తె మల్లికా సుఽధ (27) తల్లి చిన్నప్పుడే దూరమైంది. తల్లి లేకపోయినప్పటికీ బసవ ప్రసాద్ కుమార్తెను మల్లికా సుధను అల్లారుముద్దుగా పెంచి ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. తర్వాత నంద్యాల పట్టణంలోని లలితానగర్‌కు చెందిన ఉదయ్ కిరణ్‌తో ఏడేళ్ల క్రితం మల్లికా సుధకు వివాహమైంది. ఉదయ్ కిరణ్ ఫెర్టిలైజర్స్ వ్యాపారి. వీరు లలితానగర్‌లోని ఇంటిలో మొదటి ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు ఇసాంత్ సాయి, ఏడు నెలల కుమార్తె పర్నిక సంతానం. కొంత కాలంగా దంపతుల మధ్య కుటుంబ సమస్యల కారణంగా తరచూ గొడవలు జరిగేవి. శుక్రవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో మల్లికా సుధ తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాక శనివారం ఉదయం కన్నబిడ్డలకు పురుగుల మందు తాపించింది. ఈ క్రమంలో చిన్నారుల ఏడుపులు విన్న కింది ఇంట్లోని బంధువులు, మృతురాలి సోదరుడు కార్తీక్ అక్కడకు చేరుకున్నారు. అప్పటికే మల్లికా సుధ బిడ్డలకు పురుగుల మందు తాపించి ఆపై ఆమె కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తలుపులు బద్దలు కొట్టిన కార్తీక్.. కొన ఊపిరితో ఉన్న ఆమెను, పిల్లలను కారులో ఆసుపత్రికి తరలించాడు. మార్గమధ్యంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా మల్లికా సుధ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న నంద్యాల టూటౌన్ సీఐ అస్రార్‌బాషా, పోలీసులు మృతురాలి ఇంటికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఇంట్లో ఉన్న రెండు పురుగుల మందు డబ్బాలను సీజ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కాగా మృతురాలు మల్లికా సుధ శరీరంపై పలుచోట్ల గాయాలు ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగిన వెంటనే మృతురాలి భర్త ఉదయ్ కిరణ్ పరారయ్యాడు. భార్యాబిడ్డల మృతికి కారణమైన ఉదయ్ కిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ముగ్గురిపై కేసు నమోదు
మల్లికా సుధ ఆత్మహత్య కేసులో భర్త ఉదయ్ కిరణ్, తోడికోడలు ప్రసన్న, ఆడపడుచు గీతపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి సోదరుడు కార్తీక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.