ఆటగదరా శివా..!
ABN , Publish Date - Aug 25 , 2026 | 11:00 PM
ఓ వైపు అప్పులు భారం.. మరో వైపు కుటుంబ సభ్యుల బాధ్యత.. వివాహం చేసుకుని భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ యువకుడి జీవితం మల్లన్న చెంత సమాప్తమైంది.
ఓ వైపు అప్పులు భారం.. మరో వైపు కుటుంబ సభ్యుల బాధ్యత.. వివాహం చేసుకుని భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన ఆ యువకుడి జీవితం మల్లన్న చెంత సమాప్తమైంది. ఇద్దరు అక్కలు, ఓ చెల్లెలు, మేనల్లుడితో కలసి ఆ యువకుడు కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. నిత్యం శివయ్య జపం చేస్తూ చివరికి ఆ ఐదుగురు శివ సన్నిధిలోనే కన్నుమూశారు. మహా దైవ క్షేత్రంలో ఇలాంటి మరణశాసనం మహా పాపం అని తెలిసినా ఆ కుటుంబం మొత్తం ఎవరూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలోని వడ్డెర సత్రంలో ఐదుగురు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. నిత్యం శివనామస్మరణ.. ఘంటానాదాలు వినిపించే చోట మరణఘోష వినిపించింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ కుటుంబం బతుకు పోరాటంలో ఓడి శివయ్య చెంత ప్రాణాలొదిలింది. బత్తలపల్లికి చెందిన పల్లపు సుధాకర్ (36), ఇద్దరు అక్కలు గోగుల ఆదిలక్ష్మి (50), మల్లీశ్వరి (45), చెల్లెలు పల్లపు శ్రీదేవి (33), మేనల్లుడు మణికంఠ (15) వడ్డెర సత్రంలోని 11 నంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.