Share News

పేదల సంక్షేమమే లక్ష్యం : మంత్రి భరత్‌

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:48 PM

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను క్రమం తప్పకుండా సేకరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

పేదల సంక్షేమమే లక్ష్యం : మంత్రి భరత్‌
మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌ ,అక్టోబర్‌ 1(ఆంధ్రజ్యోతి): సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలను క్రమం తప్పకుండా సేకరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ అన్నారు. గురువారం నగరంలోని బిర్లా కాంపౌండ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పేదల సేవలో కార్యక్రమంలో కలెక్టర్‌ డా. ఏ. సిరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు సాధించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయిలో కర్నూలు నియోజకవర్గం మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానానికి చేరుకునేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మరింత కృషి చేయాలని కోరారు. ప్రజలకు అందుతున్న పెన్షన్లు సకాలంలో అందుతున్నాయా...? పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా,...? అనే అంశాలపై క్రమబద్ధంగా ప్రజల నుండి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుటున్నారా.. అని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాల ఆధారంగా పాజిటివ్‌ పర్సెప్షన్‌ రూపొందుతుందని మంత్రి పేర్కొన్నారు. వివిధ వర్గాల ప్రజలకు రూ. 4వేల నుంచి రూ. 15 వేల వరకు సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తోందని మంత్రి తెలిపారు. అమర్‌ రాజా బ్యాటరీ సంస్థలో 200 మంది ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, కలెక్టర్‌ కూడా పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కర్నూలు విమానాశ్రయం ద్వారా జిల్లాలో పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని తెలిపారు. ఇటీవల ప్లైయింగ్‌ ట్రైనిగ్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌టీఓ)ప్రారంభమైందని, ఇంటర్మీడియట్‌ అనంతరం సంబంధిత శిక్షణ పొందిన యువతకు విమానయాన రంగంలో కేరీర్‌ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ చల్లా ఓబులేసు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రావు, ఎస్‌ఈ రమణమూర్తి, కల్లూరు తహసీల్దార్‌ ఆంజనేయులు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2026 | 11:48 PM