సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:14 PM
‘సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తున్నాం.
కష్టకాలంలోనూ పథకాల అమలు
పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న లోకేశ్
పశ్చిమాన సాగు, తాగునీటి కోసం మాస్టర్ ప్లాన్
జిల్లా ఇన్‌చార్జి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల
కర్నూలు నగరంలో రూ.142 కోట్లతో అభివృద్ధి పనులు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
సుదీర్ఘంగా ‘జిల్లా బడ్జెట్ ఔట్రీచ్ 2026-27’
కర్నూలు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్‌గా అమలు చేస్తూనే.. రాష్ట్రాన్ని, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం’ అని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా బడ్జెట్ ఔట్రీచ్ 2026-27 కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌గుప్తా, కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సహా ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ శాఖ ద్వారా వస్తున్న ఆదాయంపై చర్చించారు. 2026-27లో జిల్లాకు గ్రామీణ అభివృద్ధి, వైద్యం, పాఠశాల విద్యా శాఖ, పంచాయతీరాజ్, ప్రజా రవాణా సహా 53 విభాగాలకు రూ.2,833.48 కోట్లు కేటాయింపులు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు ఎన్టీఆర్ భరోసాకు రూ.1,233.52 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.612.10 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకానికి రూ.384.55 కోట్లు, దీపం-2కు రూ.110.99 కోట్లు, స్త్రీశక్తి పథకానికి రూ.31.74 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రూ.21.33 కోట్లు చొప్పున సూపర్ సిక్స్‌కు రూ.2,394.25 కోట్లు జిల్లాకు కేటాయించారు. కర్నూలు జిల్లా 2024-25 జీడీడీపీ రూ.52,820 కోట్లు కాగా, 2025-26లో రూ.61,746 కోట్లకు చేరింది. జిల్లా తలసరి ఆదాయం 2024-25లో రూ.1,92,651 ఉంటే, 2025-26లో రూ.2,24,628కు చేరింది. వివిధ రంగాల ద్వారా జిల్లాకు వస్తున్న ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిం పులు, చేపట్టాల్సిన సంక్షేమం, అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానా యుడు మాట్లాడుతూ ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ హబ్‌ను అభివృద్ధి చేసు ్తన్నామన్నారు. మంత్రి నారా లోకేశ్ పాద యాత్ర సమయంలో పశ్చిమ ప్రాంత పలె ్లసీమల్లో కరువు, వలస కష్టాలు కళ్లారా చూశార న్నారు. ఆ ప్రాంతంలో తాగు, సాగునీరు అందించే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని వివరించారు. అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్, నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్, కర్నూలు ఆర్డీఓ సందీప్‌కుమార్, సెట్కూరు సీఈవో వేణుగోపాల్, ఎల్లెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ టిప్పుసుల్తాన్, సీపీవో భారతి, కురువ, వాల్మీకి కార్పొరేషన్ల అఽధ్యక్షులు మాన్వి దేవేంద్రప్ప, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, డైరెక్టర్లు మురళీనాయుడు, మంజునాథ్, జనసేన జిల్లా అధ్యక్షుడు సురేశ్ తదితరులు ప్రసగించారు.
నగరంలో రూ.142 కోట్లతో ప్రగతి
కర్నూలు నగరంలో 21 నెలల్లో రూ.142 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. పత్తికొండ వద్ద టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు వద్ద టెక్స్‌టైల్ పార్క్ పనులు జరుగుతున్నాయి. ఏపీఐఐసీ ద్వారా రెండవ దశ పనులు కూడా జరిగేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా బడ్జెట్ కేటాయింపులపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన కర్తవ్యం అందరిపై ఉంది.
మంత్రి టీజీ భరత్
జిల్లాకు రూ.2,833 కోట్లు బడ్జెట్
జిల్లాలో గామీణాభివృద్ధి, పాఠశాల విద్య, వైద్యం, మౌలిక వసతులు, పంచాయతీరాజ్ సహా 52 విభాగాలకు రూ.2,833 కోట్లు బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది. జిల్లాకు రాబోయే కాలంలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. 33 ప్రాజెక్టులు రానున్నాయి. రూ.98,979 కోట్లు పెట్టుబడులు, తద్వారా 28,903 మందికి కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమవేశంలో ఉంచిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదించారు. ముఖ్యంగా ఉర్దూ వర్సిటీకి రూ.2.50 కోట్లు, జీజీహెచ్ ఐడీపీ బ్లాక్‌కు రూ.27.60 కోట్లు, హంద్రీనీవా కాలువ స్లూయిస్‌కు రూ.4 కోట్లు, డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జిలకు రూ.2.13 కోట్లు.. ఇలా ఇచ్చిన ప్రతిపాదనలన్నీ ఆమోదించారు.
- డాక్టర్ ఎ.సిరి, జిల్లా కలెక్టర్
విద్యా, వైద్యానికి ప్రాధాన్యత
జిల్లాకు కూటమి ప్రభుత్వం రూ.2,833 కోట్లు కేటాయించడం అభినందనీయం. విద్యా, వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా పనులు చేపట్టాలి. నియోజకవర్గ కేంద్రాల్లోని ఏరియా ఆస్పత్రులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రులను అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
- డాక్టర్ పార్థసారథి, ఆదోని ఎమ్మెల్యే
జొన్నగిరి చెరువుకు కృష్ణా జలాలు మళ్లించాలి
హంద్రీనీవా ప్రాజెక్టు 67 చెరువులు నింపారు. జొన్నగిరి చెరువు పనులు కూడా పూర్తి చేసి కృష్ణా జలాలతో నింపాలి. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్. రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధిలో జోడు గుర్రాల్లా పరుగులు పెట్టిస్తున్నారు. పీ-4 ఎంతో ఉత్తమమైన కార్యక్రమం. ప్రతిఒక్కరు సంపూర్ణ సహకారం అందించాలి.
- కేఈ శ్యాంబాబు, పత్తికొండ ఎమ్మెల్యే
ఎల్లెల్సీ ఆధునికీకరణ చేయాలి
హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు విజయవంతంగా పూర్తి చేసి రాయలసీమ జిల్లాకు కృష్ణా జలాలు మళ్లించి దీర్ఘకాలంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరించారు. టీబీపీ ఎల్లెల్సీ కాలువను ఆధునికీకరణ చేస్తే మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తాగు, సాగునీరు సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చు. ఆర్డీఎస్, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేస్తే పశ్చిమ ప్రాంతంలో తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా నివారించవచ్చు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుంది.
- బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
పీ-4 పేదలకు వరం
విజన్-2047లో భాగంగా చేపట్టిన పీ-4 ద్వారా బంగారు కుటుంబాల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం పేదలకు వరం. కోడుమూరు నియోజకవర్గం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తాగునీటి కోసం రూ.64 లక్షలు, దేవమల ప్రాంతానికి రూ.1.25 కోట్లు, అంబేడ్కర్‌నగర్ అభివృద్ధికి రూ.2.19 కోట్లు మంజూరు చేశారు. కోడుమూరు నియోజకవర్గం తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.33 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభినందనలు.
- బొగ్గుల దస్తగిరి, కోడుమూరు ఎమ్మెల్యే
పశ్చిమ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి
నిత్యం కరువు, వలసలతో తల్లడిల్లే పశ్చిమ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. ఆర్డీఎస్, వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఆదోనిలో పరిశ్రమలు తీసుకురావడంలో మంత్రి టీజీ భరత్‌గుప్త ప్రత్యేక కృషి చేయాలి. మహిళల ఆర్థికాభివృద్ధికి చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించాలి.
- గుడిసె కృష్ణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు
గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం
నియోజకవర్గంలో ప్రాధాన్యతగా రోడ్లు నిర్మాణం పూర్తి చేశాం. గ్రామాల్లో రోడ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇన్‌డోర్ స్టేడియం నిర్మాణానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు. కోసిగిలో వాల్మీకి భవన్ నిర్మాణానికి అనుమతి వచ్చింది. మంత్రాలయంలో షాదీఖాన నిర్మాణానికి రూ.1.22 కోట్లు మంజూరు చేశారు. ఉరుకుందు-కోసిగి నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.
- ఎన్.రాఘవేంద్రరెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి