రతనాల సీమగా మార్చుతాం
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:04 AM
రతనాల సీమగా మార్చుతాం
2027 నాటికి రైతులందరికీ పట్టాదారు పాసు బుక్కులు
2,074 ఎకరాలకు 22ఏ నుంచి విముక్తి
బనగానపల్లెలో మరో 101 ఎకరాలు తొలగింపు
ఉమ్మడి జిల్లాకు మరిన్ని పరిశ్రమలు
సీఎం నారా చంద్రబాబు నాయుడు
బనగానపల్లెకు పోటెత్తిన జనం
చంద్రబాబును చూసేందుకు వేలాదిగా అభిమానులు
నంద్యాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ‘రాయలసీమను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం రతనాల సీమగా మారబోతోంది. నంద్యాల, కర్నూలు జిల్లాలను ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నాం. పరిశ్రమలతో పాటు హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం...’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామసభను నిర్వహించారు. అంతకుముందు బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను మంత్రి నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామ సభలో పాల్గొని రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె మండలంలోని కాపులపల్లె, అప్పలాపురం రైతులు సుబ్బతులశమ్మ, రామాంజనేయులుకు చంద్రబాబు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రకాశ్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, న్యాయ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారితో పాటు కాపులపల్లెకు చెందిన సుబ్బతులశమ్మ, అప్పలాపురం గ్రామానికి చెందిన రైతు రామాంజనేయులు వేదికపై చంద్రబాబుతో పాటు కూర్చున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హాబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రవేట్ పెట్టుబడులతో హార్టికల్చర్ రంగాన్ని విస్తరించి కోల్డ్‌స్టోరేజ్‌లు, విలువ ఆధారిత పరిశ్రములు, ఎగుమతులకు అవకాశం కల్పించి రైతుల ఆదాయాన్ని పెంచుతామన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడంతో పాటు ఫీడర్ చానెళ్ల అభివృద్ధి, చెక్ డ్యాంల నిర్మాణం విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగంతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి కరువు సీమను రతనాల సీమగా మార్చుతామన్నారు. త్వరితగతిన రీ సర్వే పూర్తి చేసి 2027 మార్చి నాటికి అందరికీ రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు అందజేస్తామన్నారు. గత వైసీపీ చేసిన పాపాలు నేటికి ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాతో పాటు అభివృద్ధి ఆగిపోయిందన్నారు. వైసీపీ చేసిన తప్పులను రెండేళ్లలో సరిచేశామన్నారు. బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామంలో 897 మంది రైతులకు సంబంధించిన 2,074 ఎకరాల భూములను వైసీపీ అనవసరంగా 22-ఏలో చేర్చింది. రైతుల విజ్ఞప్తి మేరకు ఆ భూములను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగించామన్నారు. అదేవిధంగా బనగానపల్లెలో 101 ఎకరాలను తొలగించి బాధిత రైతులకు ఊరట కల్పించామన్నారు. బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. ఓ వైపు మంత్రిగా, మరో వైపు స్థానిక ఎమ్మెల్యేగా బనగానపల్లెను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
సీఎంకు మంత్రి బీసీ వినతి
శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్(ఎస్సార్బీసీ) దిగు వ కాలువలకు నీటి సరఫరా చేసే విధంగా అవకాశం కల్పించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. తద్వారా సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా బనగానపల్లెలో 920 మంది విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాల కోసం బీసీ బాలుర వసతి గృహాన్ని మంజూరు చేయాలని కోరారు. పలు పరిశ్రమలు బనగానపల్లెలో నెలకొల్పాలని సీఎంను కోరారు. మంత్రి విజ్ఞప్తులను పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు విధ్వంస పాలన చేశారని అన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకుసాగుతోందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సైతం సమన్వ యంతో పనిచేసి జిల్లా పురోగతిని పెంచాలని దిశ నిర్దేశం చేశారు. బనగానపల్లెలోని రవ్వల కొండ తవ్వకాలను అడ్డుకున్నామన్నారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పత్రాలను తగలబెట్టిన విష యాన్ని గుర్తు చేశారు. కూటమి పాలనలో పలు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికి అందించేలా కృషి చేయాలన్నారు.
పరిశ్రమల హబ్‌గా సీమ
రాయలసీమ రైజింగ్ సీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఓర్వకల్లులో అనేక పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఐదో జనరేషన్ పైటర్ జెట్‌లు తయారవుతున్నారు. కర్నూలులో నాడు ఆశోకుడు పాలించిన జొన్నగిరి నేడు స్వర్ణగిరిగా మారిందన్నారు. భవిష్యత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు కూడా సీమ నుంచే తయారవుతాయన్నారు. బనగానపల్లెలో సిమెంట్ పరిశ్రమలు మరిన్ని రాబోతున్నాయన్నారు. వర్షాభావ పరిస్ధితుల నేపథ్యంలో నీటి సమస్య తల్తెకుండా జలధార- జలహారతి కార్యక్రమం చేపట్టామన్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్‌లు బందోబస్తును పర్యవేక్షించారు.
ఐదేళ్ల వైసీపీకి అంతం పాడారు
బనగానపల్లె ప్రజల రుణం తీర్చుకోలేనిది
రింగ్ రోడ్డు మంజూరు చేయించిన ఘనత చంద్రబాబుదే
21 కిలో మీటర్ల అండర్ డ్రైనేజీ పనులు పూర్తి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు జనం చరమగీతం పాడారని, అయినా వైసీపీలో మార్పు రాలేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. గురువారం సీఎం నారాచంద్రబాబునాయుడు బనగానపల్లె పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి బీసీ మాట్లాడారు. కాలజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన బనగానపల్లె నియోజకవర్గానికి సీఎం చంద్రబాబునాయుడు సహకారంతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన టీడీపీ కార్యకర్తలకు, బనగానపల్లె ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు గొప్పదార్శనికుడు, అభివృద్ధి ప్రదాత అన్నారు. బనగానపల్లెకు ఆర్డీవో కార్యాలయం మంజూరు చేయించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ ఐదేళ్ల నరక పాలనలో నంద్యాల పార్లమెంట్ పరిధిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు గొడ్డలిపార్టీ వైఖరి వల్ల అనేకమందిపై తప్పుడు కేసులు, జైళ్లకు వెళ్లారన్నారు. దౌర్జన్యాలతో చెలరేగిపోయారన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను సామాన్యులను హింసించారన్నారు.పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా కమీషన్ల కోసం వైసీపీ నాయకులు బెదిరించి అడ్డుకున్నారన్నారు. గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు, నారాలోకేశ్‌లు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. రాయలసీమవాసులకు వైసీపీ నాయకులు నమ్మకద్రోహం చేశారన్నారు. రాయలసీమ అభివృద్ధిపై వైసీపీ నాయకులు డిబేట్‌కు రావాలని బహిరంగ సమావేశంలో సవాల్ విసిరారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి వ్యవస్థలను గాడిలో పెట్టిందన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు రావడానికి ప్రధాన కారకుడు చంద్రబాబే అన్నారు. రామ్‌కో సిమెంట్, అల్ర్టాటెక్ సిమెంట్ కంపెనీల రాకకు చంద్రబాబు ఎంతో కృషి చేశారన్నారు. బనగానపల్లెలో గంటలకొద్దీ ట్రాఫిక్ ఉండడంతో రింగ్ రోడ్డు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అయితే అఽధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బనగానపల్లె రింగ్ రోడ్డును రద్దు చేసిందన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రూ.50 కోట్లతో రింగ్ రోడ్డుకు చంద్రబాబు మంజూరు చేయడంతో పనులు వేగవంతం చేశామన్నారు. 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. బనగానపల్లె పట్టణంలో అండర్‌డ్రైనేజీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. బనగానపల్లె పట్టణంలో 41 కిలోమీటర్ల అండర్ డ్రైనేజీ పనులకు గాను ఇప్పటి వరకు 21 కిలోమీటర్లు పూర్తి చేశామన్నారు. డిసెంబరు నాటికి అండర్‌డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స, డీఎంఎఫ్ నిధులతో కోట్లాధి నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎస్సార్బీసీ కాల్వ చివరి ఆయకట్టుకు సుమారు 25వేలు ఎకరాల భూములకు పంటకాల్వలు లేవని నిధులు మంజూరు చేయాలని, కాల్వల నీటి సరఫరాకు మెరుగైన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును మంత్రి కోరారు. అలాగే బీసీ గురుకుల పాఠశాలలో 920 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని బీసీ బాలుర వసతి గృహాన్ని మంజూరు చేయాలని కోరారు.
రాయలసీమ అభివృద్ధికి కృషి : బైరెడ్డి శబరి
రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కట్టుబడి ఉన్నారని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిపోయిన రాయలసీమకు సాగునీరు వసతి కల్పించి రైతులకు సేవలందించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రైతులకు సాగునీటి వసతి కల్పించి వలసలు లేని రాయలసీమగా మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాయలసీమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. గంజాయి, బ్లేడ్‌బ్యాచ్, రౌడీలను వైసీపీ ప్రోత్సహిస్తోందని ఎంపీ మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత టీడీపీకే దక్కిందన్నారు. వైసీపీ నాయకులకు మహిళలంటే గౌరవం లేదన్నారు వైసీపీ పాలనలో మహిళలపై, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు. చంద్రబాబు నాయకత్వలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎండా ఎగురవేస్తామన్నారు.
డిసెంబరు నాటికి వందశాతం పట్టాదారు పుస్తకాలు ఇస్తాం : కలెక్టరు రాజకుమారి
డిసెంబరు నాటికి వందశాతం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలు మంజూరు చేస్తామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. నంద్యాల జిల్లాలో 432 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని ఇప్పటి వరకు 203 గ్రామాల్లో 1.10 లక్షల మందికి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేశామన్నారు. ఇంకా 229 గ్రామాల్లో 2.75 లక్షల మందికి పంపిణీ చేయాలన్నారు. 155 గ్రామాల్లో 8 లక్షల ఎకరాల్లో రీ సర్వే చేయాల్సి ఉందన్నారు. దీన్ని డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో డోన్ తర్వాత బనగానపల్లె నియోజకవర్గంలో స్థూల జిల్లా ఉత్పత్తి కలిగిన ప్రాంతంగా బనగానపల్లె నిలిచిందన్నారు. ఎస్సార్బీసీ ద్వారా 1.14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నందున, మినరల్స్ వల్ల ఆదాయం వస్తుందన్నారు. స్వచ్చ బనగానపల్లె కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. జలధార, జలహారతి కార్యక్రంలో భాగంగా ప్రజలు, మంత్రి బీసీ స్వచ్చందంగా ముందుకు రావడంతో కార్యక్రమం విజయవంతమైందన్నారు. 57 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టామని దశల వారిగా లక్ష ఎకరాల సాగు వరకు పెంచనున్నట్లు తెలిపారు. ఉద్యాన వన పంటల సాగులో మో 20వేల ఎకరాలకు పెంచనున్నట్లు తెలిపారు.
సీఎంకు కృతజ్ఞతలు
పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చినందుకు హర్షం
బనగానపల్లె, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలు ఇచ్చినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు కాపులపల్లెకు చెందిన మహిళా రైతు సుబ్బతులశమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం బనగానపల్లె ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం చంద్రబాబునాయుడు నుంచి ఆమె పట్టాదారు పుస్తకం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త మృతి చెందడంతో పట్టాదారు పుస్తకం కోసం వైసీపీ ప్రభుత్వ హయంలో కాళ్ళరిగేలా తిరిగానన్నారు. తనకు వారసత్వంగా 3 ఎకరాలు నూతన రాజముద్రతో కూడిన పట్టాదారు పుస్తకాలు సీఎం చంద్రబాబు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. మీ భూమి, మీ హక్కు కింద కాపులపల్లె, అప్పలాపురం గ్రామాలను ఎంపిక చేసి పట్టాదారు పుస్తకాలు అందించారు. కొత్తపాసు పుస్తకంలో రైతుల పేరు, ఫొటో, ఆధార్ నంబరు, మొబైల్ నంబరుతో పాటు క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా అంశాలు పొందు పరచడంతో పారదర్శకంగా ఉంటాయన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా రైతుల్లో తమ భూమిపై హక్కు, భద్రత, నమ్మకాన్ని మరింత పెంచిందని ప్రజలు అభిప్రాయపడ్డారు.