Share News

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం

ABN , Publish Date - Oct 03 , 2026 | 11:30 PM

అన్నదాతను అన్ని విధాలా ఆదుకొని వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తాం
సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేస్తున్న మంత్రి బీసీ

జిల్లాకు 38,000 క్వింటాళ్ల శనగ విత్తనాలు కేటాయించాం

రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ

కొలిమిగుండ్ల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతను అన్ని విధాలా ఆదుకొని వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కొలిమిగుండ్లలో రబీ సీజన్‌కు సంబంధించి సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి బీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా ఈఏడాది రబీ సీజన్‌ ప్రారంభానికి ముందే సబ్సిడీ విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నంద్యాల జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 38,000 క్వింటాళ్ల సబ్సిడీ శనగలు కేటాయించినట్లు తెలిపారు. 3400 క్వింటాళ్ల మినుము, 500 క్వింటాళ్లు ఉలువలు, 300 క్వింటాళ్లు కొర్రలు కేటాయించామని, అవసరమైతే మరిన్ని విత్తనాలు అందిస్తామని మంత్రి అన్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. సాగు సమయంలో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సూచనలు తప్పక పాటించాలని అన్నారు. నంద్యాల జిల్లాలో 28 మండలాలను ఇప్పటికే కరువు మండలాలుగా ప్రకటించినట్లు మంత్రి బీసీ వెల్లడించారు. అనంతరం నూతనంగా నిర్మించిన మండల పరిషత్‌ సమావేశ మందిరాన్ని మంత్రి బీసీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఏవో శారదాదేవి, ఎంపీడీవో దస్తగిరిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, వీఆర్‌ లక్ష్మీరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, గొంగటి హుస్సేన్‌రెడ్డి, నంద్యాల ప్రసాదు, అంబటి వివేకానందరెడ్డి, నాగేశ్వరరెడ్డి, గండా పరమేశ్వరరెడ్డి, జయరామిరెడ్డి, నాయకులు గూలి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 11:30 PM