Share News

రిజర్వాయర్‌ లీకేజీలని అరికడతాం

ABN , Publish Date - Jan 08 , 2026 | 11:20 PM

అవుకు రిజర్వాయర్‌ లీకేజీలను పూర్తి స్థా యిలో అరికడతామని జలవనరులశాఖ సీఈ సీడీవో శివకుమార్‌రెడ్డి అన్నారు.

రిజర్వాయర్‌ లీకేజీలని అరికడతాం
పరిశీలిస్తున్న సీఈ సీడీవో శివకుమార్‌రెడ్డి, అధికారులు

రివిట్‌మెంట్‌ పనులను పరిశీలించిన సీఈ సీడీవో శివకుమార్‌రెడ్డి

మంత్రి బీసీ చొరవతో నిధులు మంజూరు

అండర్‌ వాటర్‌ కాంక్రీట్‌తో లీకేజీల నియంత్రణ

అవుకు, జనవరి 8 (ఆంధ్రజ్యోతి) : అవుకు రిజర్వాయర్‌ లీకేజీలను పూర్తి స్థా యిలో అరికడతామని జలవనరులశాఖ సీఈ సీడీవో శివకుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సీఈ కబీర్‌బాషా, మద్రాస్‌ ఐఐటీ ప్రొఫెసర్‌ సుబ్బారావు, క్వాలిటీ కంట్రోల్‌ ఎస్‌ఈ మునీర్‌బాషాతో కలసి రిజర్వాయర్‌ వద్ద లీకేజీని అరికట్టే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ సీడీవో మాట్లాడుతూ రిజర్వాయర్‌ 4.148 టీఎంసీల సామర్థ్యంతో 2009లో పూర్తయిందన్నారు. రిజర్వాయర్‌లో అంతర్భాగమైన తిమ్మరాజు చెరువుకు గతంలో ఉన్న పాత తూము వద్ద నిర్మాణ లోపం జరిగినట్లు గుర్తించామన్నారు. రిజర్వాయర్‌లో నీటి ఉధృతి పెరిగే కొద్ది కింద ఉన్న మట్టికట్ట నుంచి నీరు లీకవుతున్నదని అన్నారు. 2015లో డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్‌ బృందం పరిశీలించారన్నారు. అప్పట్లో ఉన్న టెక్నాలజీతో పాత తూము నిర్మాణంలోని ప్రాంతంలో మట్టికట్టల పైభాగం నుంచి రంధ్రాలు వేసి ప్లాస్టిక్‌ పైపుల ద్వారా కాంక్రీట్‌ను లోపలికి పంపి లీకేజీని కొంతమేర అరికట్టారని అన్నారు. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నింపగా 2024 సెప్టెంబరు 25న తిమ్మరాజు చెరువు రివిట్‌మెంట్‌ కొంత మేర కుంగిందన్నారు. గత ఏడాది అక్టోబరు 3న గతంలో కుంగిన ప్రాంతంలోనే రెండో సారి రివిట్‌మెంట్‌ కుంగిపోయి మూడంచెల భద్రతతో నిర్మించిన మట్టికట్టల నుంచి నీరు బయటకు వచ్చిందన్నారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి లీకేజీని పరిశీలించి మరమ్మతు పనుల కోసం రూ. కోటి మంజూరు చేయించారన్నారు. కర్ణాటక బెల్గాంకు చెందిన అక్షిత అండర్‌ వాటర్‌ కాంక్రీట్‌ ఏజెన్సీకి రూ. 57 లక్షలకు పనులు అప్పగించామన్నారు. గత డిసెంబరు నెల 12వ తేదీన పనులు చేపట్టి 26న లీకేజీ ప్రాంతాన్ని గుర్తించారన్నారు. నిపుణుల సలహాల మేరకు లీకేజీని అరికట్టే విధంగా అండర్‌ వాటర్‌ కాంక్రీట్‌ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం స్పిల్‌వే గేట్ల లీకేజీలను పరిశీలించారు. గ్యాంట్రీ క్రేన్‌ సహాయంతో స్టాఫ్ట్‌లాక్‌ గేట్‌ను అమర్చి ఒక్కొక్క గేటును బయటకు తీసి పరిశీలించాలన్నారు. స్పిల్‌వే గేట్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టరును హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కంట్రోల్‌ ఈఈ కేదార్‌నాథ్‌రెడ్డి, ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌, మెకానికల్‌ అడ్వయిజర్‌ కృష్ణారావు, ఈఈలు విజయసారధి, వెంకటరాముడు, డీఈలు సాయికిరణ్‌, మల్లికార్జున, జేఈ సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2026 | 11:20 PM