దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:12 PM
డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాను జాతీయ స్థాయి హబ్‌గా మారుస్తాం
సీఎం చంద్రబాబు విజన్‌తో ఓర్వకల్లు డ్రోన్ సిటీకి శ్రీకారం
ఇక్కడ సమగ్ర డ్రోన్ ఎకో సిస్టమ్ అభివృద్ధే లక్ష్యం
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు
మంత్రికి ఘనస్వాగతం పలికిన నాయకులు, అధికారులు
స్టాళ్లను పరిశీలించిన అతిథులు
ఓర్వకల్లు, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పాలకొలను, చింతలపల్లె, కొమరోలు, పొలిమేరల్లో ఉన్న కర్నూలు డ్రోన్ సిటీలో ఏర్పాటుచేసిన డ్రోన్ ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను తిలకించారు. అక్కడే అక్కడే ఏపీ డ్రోన్ పరిశ్రమల సీఈవోల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి పాల్గొన్నారు. మంత్రికి టీడీపీ నాయకులు సీఎన్ సుధాకర్‌రెడ్డి, పుసులూరు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరమణతో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ కర్నూలు డ్రోన్ సిటీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. దేశంలోనే కర్నూలు డ్రోన్ సిటీ మొట్టమొదటిది అని.. డ్రోన్ టెక్నాలజీలో కర్నూలు జిల్లాను జాతీయస్థాయి హబ్‌గా అభివృద్ది చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్‌తో ఓర్వకల్లు డ్రోన్ సిటీకి శ్రీకారం చుట్టారన్నారు. 2024లో అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్‌లోనే సీఎం చంద్రబాబు కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారన్నారు. ఇది ఆయన ముందు చూపునకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ఏ-1 మిషన్ లెర్నింగ్ క్వాంటమ్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ వంటి భవిష్యత్ సాంకేతికతను ప్రోత్సహించడంలో సీఎం ఎప్పుడూ ముం దుంటారన్నారు. డ్రోన్ తయారీ టెస్టింగ్ పరిశోధన, శిక్షణ, ఆవిష్కరణలు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు డ్రోన్ సిటీని జాతీయ, అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో తయారీ పరిశోధన, శిక్షణ టెస్టింగ్ సర్టిఫికేషన్ సేవలను అనుసంధానించి సమగ్ర డ్రోన్ ఏకో సిస్టమ్‌ను అభివృద్ది చేయడమే లక్ష్యమన్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సీఐ-డీజీసీఏ తదితర సంస్థల సమన్వయంతో సాండ్ బాక్స్ టెస్టింగ్ సర్టిఫికేషన్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
వంద కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు
రానున్న పదేళ్లలో దేశంలోనే వంద కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు 5 లక్షల మంది విమాన ప్రయాణాలు చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరో 1700 విమానాలు రానున్న నేపథ్యంలో డ్రోన్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ లక్ష్యాలను అనుగుణంగా డ్రోన్ పరిశ్రమను కీలకరంగంగా అభివృద్ది చేసేందుకు డ్రోన్ రూల్స్ పీఎల్‌ఐ దిగుమతి నియంత్రణలు వంటి చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈజీసీఏ 2.0 ద్వారా దరఖాస్తుల స్థితి అనుమతుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకు పురోగతి సమీక్షిస్తామన్నారు. దేశంలోనే బలమైన డ్రోన్ తయారీ, అభివృద్ధిపై ప్రత్యేకదృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. 6 లక్షల పైగా గ్రామాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రామానికి కనీసం ఒక డ్రోన్‌ను అందుబాటులోకి వస్తే భారీ మార్కెట్ అవకాశాలు ఏర్పాడుతాయన్నారు. ప్రస్తుతం 30.35శాతం మా త్రమే ఉన్న స్వదేశీకరణలను పెంచేందుకు ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థలతో కలిసి ఆల్ అండ్ డీ ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. భారతదేశాన్ని స్వాతంత్య్ర శతాభ్ది నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. డ్రోన్ శక్తిని యువ శక్తిగా మార్పు చెందేలా యువత డ్రోన్ టెక్నాలజీలో పూర్తి స్తాయిలో భాగస్వాములు కావాలన్నారు. యువత ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు, ప్రజా ప్రతినిధుల సమిష్టి కృషితో ఓర్వకల్లు డ్రోన్ సిటీ కర్నూలు ఆర్థికాభివృద్దికి కీలక కేంద్రంగా ఎదుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. డ్రోన్ పాలసీ 4.0పై డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 25 వేల మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలట్లకు శిక్షణ అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందన్నారు. కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిత్వ అడిషినల్ సెక్రటరీ పునీత్ కన్సర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఎవియేషన్ జాయింట్ డైరెక్టర్ జనరల్ భరత్ భూషణ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీడీజీ అజిత్ కోశాయ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తులసిరామన్, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సీశ్రిత్ షా, కలెక్టర్ డా.ఏ.సిరి, డ్రోన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గీతాంజలి శర్మ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ర్టీరియల్ ఇన్‌ప్రా స్ట్రక్చర్ కార్పొరేషన్‌ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి, జేసీ నూరుల్ ఖమర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో నాగ అనుసూయ తదితరులు పాల్గొన్నారు.
ఓర్వకల్లును పారిశ్రామి కేంద్రంగా అభివృద్ధి..
ఓర్వకల్లు ప్రాంతాన్ని రాష్ట్రంలోనే పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 13 పారిశ్రామిక కేంద్రాల్లో ఓర్వకల్లు ప్రాంతం ఒకటిగా నిలిచిందన్నారు.
బస్తిపాటి నాగారాజు, ఎంపీ, కర్నూలు
డ్రోన్ సాంకేతికతను..
డ్రోన్ సాంకేతికతను వ్యవసాయం, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, ప్రజాభద్రత, పాలన రంగాల్లో అభివృద్ధి చేస్తూ డ్రోన్ రంగంలో ఏపీనిదేశంలోనే అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశీ డ్రోన్లను నియంత్రించడం, దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు అమలు చేసిన ప్రొడక్షన్ లింక్‌డ్ ఇన్సెంటివ్ బీఎల్‌ఐ పథకం వంటి చర్యలు దేశీయ డ్రోన్ తయారీ రంగానికి బలమైన పునాది వేసింది. రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ పాలసీ 4.0ద్వారా పాలసీ కాల వ్యవధిలో సుమారు రూ.500 కోట్లను కేటాయించింది.
గీతాంజలి శర్మ, ఎండీ, డ్రోన్ కార్పొరేషన్ ఎండీ
మొత్తం 600 ఎకరాల్లో అభివృద్ధి
డ్రోన్ సిటీని తొలి విడతలో 120 ఎకరాలు, రెండో విడతలో 480 ఎకరాలు, మొత్తం 600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తాం. విస్తృతమైన పారిశ్రామిక వసతులు, నైపుణ్య మానవ వనరులు రవాణా సదుపాయాలు, అందుబాటులో ఉన్నాయి.
యశ్వంత్ కుమార్‌రెడ్డి, ఈడీ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ర్టీరియల్ ఇన్‌ప్రాస్ట్రకచర్ కార్పొరేషన్