కార్మికుల హక్కులను హరిస్తే సహించం
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:12 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కు లను హరిస్తే సహించమని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షురాలు హేమలత హెచ్చరించారు.
సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత
నంద్యాల రూరల్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కు లను హరిస్తే సహించమని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షురాలు హేమలత హెచ్చరించారు. శుక్రవారం సీఐటీయూ 17వ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని నంద్యాలలోని టెక్కె మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్‌టౌన్ హాల్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలకు కార్మికుల ఓట్లు కావాలి కానీ, వారి భద్రత, జీవన విధానాలను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు లేబర్ కోడ్ విధానం అమలులోకి వస్తే కార్మికులపై భారాలు పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. అఖిల భారత కోశాధికారి సాయిబాబు మాట్లాడుతూ కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చేందుకు ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నా యని ఆరో పించారు. సినీ రచయిత, హీరో మాదాల రవి మాట్లాడుతూ సంపద మొత్తం ఐదు శాతం మంది చేతుల్లోనే ఉందన్నారు. అభ్యుదయ కమ్యూనిస్ట్‌లు, ప్రజాసంఘాలు ఏకమై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హక్కుల కోసం పోరాడుతున్న అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిం చడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు, గౌస్, లక్ష్మణ్, వెంకటలింగం తదితరులు పాల్గొన్నారు.