Share News

రాజకీయ బెదిరింపులను సహించం

ABN , Publish Date - Sep 28 , 2026 | 11:28 PM

మద్యం దుకాణాల దరఖాస్తు విషయంలో ఏవైనా రాజకీయ బెదిరింపులు, ఇతర దౌర్జన్యాలు జరిగినట్లయితే సహించే ప్రసక్తే ఉండదని ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రవికుమార్‌ హెచ్చరించారు.

రాజకీయ బెదిరింపులను సహించం
మాట్లాడుతున్న ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌

ఆసక్తి ఉన్నవారు మద్యం దుకాణాలకు నిర్భయంగా దరఖాస్తు చేసుకోండి

ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ రవికుమార్‌

ఆత్మకూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల దరఖాస్తు విషయంలో ఏవైనా రాజకీయ బెదిరింపులు, ఇతర దౌర్జన్యాలు జరిగినట్లయితే సహించే ప్రసక్తే ఉండదని ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రవికుమార్‌ హెచ్చరించారు. పట్టణంలోని ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌ను సోమవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 113 మద్యం దుకాణాలు ఉండగా ఇందులో 89 దుకాణాలు రెన్యువల్‌ అయ్యాయని చెప్పారు. మిగిలిన 24 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 24 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. జిల్లాలో మద్యం దుకాణాలకు ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు నిర్భయంగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర ప్రాంతాల వారు కూడా దైర్ఘ్యంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారులకు పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్‌శాఖలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌తో పాటు హైబ్రిడ్‌ విధానంలో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. అక్టోబరు 1వ తేది అర్ధరాత్రి వరకు రూ.3 లక్షల నాన్‌ రీఫండబుల్‌ రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 5వ తేది ఉదయం 8గంటలకు కలెక్టర్‌ చేతుల మీదుగా పారదర్శకంగా మద్యం దుకాణాల ఎంపిక చేస్తామని వెల్లడించారు. సమావేశంలో ఆత్మకూరు, నందికొట్కూరు ఎక్సైజ్‌ సీఐలు ఇరిగెల మోహన్‌రెడ్డి, రామాంజనేయులు ఉన్నారు.

Updated Date - Sep 28 , 2026 | 11:28 PM