Share News

రోగులపై బాధ్యతను విస్మరించం

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:39 PM

రోగులపై బాధ్యతను విస్మరించం

రోగులపై  బాధ్యతను విస్మరించం
రక్తదానం చేస్తున్న జూడాలు

75 మంది జూడాల రక్తదానం

కర్నూలు హాస్పిటల్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): రోగులపై తమ బాధ్యతను విస్మరించబోమని, ఆపదలో, అవసరంలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేసినట్లు జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు డా.టి. నిశాంత్‌ పేర్కొన్నారు. స్టైఫండ్‌ పెంచాలని కోరుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. ఆసుపత్రి ఆవరణలోని ఓల్డ్‌ సీఎల్‌జీ దీక్ష శిబిరంలో గురువారం జూనియర్‌ డాక్టర్లు 75 మంది రక్తదానం చేశారు. సమ్మెలో భాగంగా తాము వైద్యుసేవలకు దూరంగా ఉన్నప్పటికీ రోగులపై తమ బాధ్యతను ఎప్పటికీ మరిచిపోమని ఆయన అన్నారు.

‘ఆ ప్రకటన ఏకపక్ష నిర్ణయం’

ఇంటర్న్‌లకు 5శాతం, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ పీజీ విద్యార్థులకు 3 శాతం స్టైఫండ్‌ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి జి. వీరపాండియన్‌ చేసిన ప్రకటన ఏకపక్ష నిర్ణయమని జూడాల సంఘం అధ్యక్షుడు డా.నిషాంత్‌ అన్నారు. ఈ ప్రకటనలో సీనియర్‌ రెసిడెంట్ల ప్రస్తావన లేదని, వారు జూనియర్‌ డాక్టర్లలో అంతర్భాగమని అన్నారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిమితులను ఏపీ జూడాల సంఘం గుర్తిస్తుందని, మొదట కోరిన 30 శాతం స్టైఫండ్‌ పెంపు డిమాండ్‌ను 20 శాతం తగ్గించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. తమ సమస్యలు, డిమాండ్లను సమగ్రంగా చర్చించేందుకు సంఘం రాష్ట్ర నాయకులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి, డీఎంఈతో కలిసి చర్చించేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

Updated Date - Aug 20 , 2026 | 11:40 PM