గురుకులం తరలింపును ఒప్పుకోం
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:33 PM
మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఉద్రిక్తతలకు దారి తీసిన విద్యార్థి ఆందోళన
బైఠాయింపుతో స్తంభించిన రాకపోకలు
ఆందోళనకారుల అరెస్టు
పత్తికొండ టౌన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ సంఘటన మంగళవారం పత్తికొండ పట్టణంలో చోటు చేసుకుంది. మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల బాలుర పాఠశాలను ప్రభుత్వం నియోజకవర్గానికి మంజూరు చేసింది. ఈ పాఠశాలను పత్తికొండలోనే ఏర్పాటు చేయాలంటూ ఏఐఎ్‌సఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ పాఠశాలను కంబాలపాడుకు తరలించవొద్దంటూ ఏఐఎ్‌సఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పట్టణంలో మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహిస్తూ నాలుగు స్తంభాల కూడలికి చేరుకున్నారు. అక్కడ ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ జయన్న సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, హుకుం జారీ చేశారు. దీంతో ఏఐఎ్‌సఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు ససేమిరా అంటూ రోడ్డుపైన అలాగే ఆందోళన కొనసాగించారు. దీంతో అటు పోలీసులకు, ఇటు విద్యార్థి యువజన సంఘాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. మహాత్మాజ్యోతిరావుపూలే పాఠశాలను తన సొంత గ్రామమైన కంబాలపాడుకు తరలిస్తున్న ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమేష్, ఏఐఎ్‌సఎఫ్ నాయకులు శ్రీరాములు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం వద్దకు డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి అక్కడికి చేరుకుని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఈ రాస్తారోకోలో విద్యార్థి యువజన సంఘం నాయకులు శ్రీరాములు, బాషా, హనుమేష్, పెద్దయ్య, అల్తాఫ్, సిద్ధు, ఉపేంద్ర ఆచారి పాల్గొన్నారు.