Share News

వక్ఫ్‌ భూములంటే ఒప్పుకోం

ABN , Publish Date - May 22 , 2026 | 12:09 AM

మండలంలో లక్ష్మీనగరం, కలగొట్ల, సూదేపల్లి గ్రామాల రైతులు మూడు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నారు.

వక్ఫ్‌ భూములంటే ఒప్పుకోం
తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రిజిస్ర్టేషన్‌ పత్రాలతో రైతులు

మూడు తరాలుగా సాగు చేసుకుంటున్నాం

మా పూర్వీకులు కొన్న భూములను వదులుకోం

ఆగ్రహిస్తున్న భూ యజమానులు

వెల్దుర్తి, మే 21(ఆంధ్రజ్యోతి): మండలంలో లక్ష్మీనగరం, కలగొట్ల, సూదేపల్లి గ్రామాల రైతులు మూడు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నారు. 1958లో వారి పూర్వీకులు భూములను కొనుగోలు చేసుకుని రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. రిజిస్ర్టేషన్‌ ఉండడంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. బ్యాంకులో రుణాలు కూడా పొందారు. 66 సంవత్సరాల తరువాత ఇప్పుడు హఠాత్తుగా ఆ భూములు మీకు సొంతం కావని వక్ఫ్‌ బోర్డుకు చెందుతాయని ‘జిల్లా వక్ఫ్‌ బోర్డు’ నోటీసులు జారీ చేయడంతో గుండె పగిలినంతా పనైందని రైతులు వాపోయారు. గురువారం మండల రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి రాగా తహసీల్దార్‌ ‘ఒక నెల-ఒక గ్రామం’ కార్యక్రమానికి నరసాపురం గ్రామానికి వెళ్లడంతో సోమవారం కర్నూలులో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరుకు వినతి పత్రం అందజేస్తామని వెనుదిరిగారు. రైతులు మాట్లాడుతూ తమ పూర్వీకులు కొనుగోలు చేసిన భూములను 66 ఏళ్ల తరువాత ఇప్పుడు వక్ఫ్‌ భూములు అంటున్నారని మండిపడ్డారు. సొంత భూములకే లీజు చెల్లించాలంటున్నారని, ఇది ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

మండలంలో కలగొట్ల రెవెన్యూ పరిధి 128, 324, 379, 405, 698 సర్వే నెంబరులో 95 ఎకరాలు, లక్ష్మీనగరం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 103, 344, 366, 369లో 105 ఎకరాలు, సూదేపల్లి రెవెన్యూ పరిధిలో 52 1, 66 1, 77 2, 87, 108 2, 175, 176, 194, 517, 700 సర్వే నెంబరులో 111 ఎకరాలు వక్ఫ్‌ బోర్డుకు చెందుతాయని జిల్లా వక్ఫ్‌ బోర్డు నోటీసులు జారీ చేసిందని రైతులు తెలిపారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌వర్మను ఆంధ్రజ్యోతి ఫోన్‌లో సంప్రదించగా వక్ఫ్‌ బోర్డు భూముల క్రయవిక్రయాలు చెల్లవన్నారు. గతంలో తప్పులు జరిగిండొచ్చని, రైతులు వక్ఫ్‌ బోర్డులోనే తేల్చుకోవాలని వివరణ ఇచ్చారు.

మూడు తరాలుగా సాగులో ఉన్నాం

నాకు ఎకరా భూమి ఉంది. మా తాత మాదన్న కొనుగోలు చేశారు. రిజిస్ర్టేషన్‌ పత్రాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సబ్సిడీ పథకాలు, పంట నష్ట పరిహారాలు అన్నీ అందుతున్నాయి. మూడు తరాలుగా మా కుటుంబం సాగులో ఉంది. - మాధవస్వామి, యాదరాళ్ల గ్రామం, వెల్దుర్తి మండలం

ఆత్మహత్యలే శరణ్యం

మా నాన్న లక్ష్మన్న పేర 2 ఎకరాలు ఉంది. బోరు బావులు తవ్వుకొని మామిడి చెట్లు పెంచుతున్నాం. మసీదు మాన్యం అని నోటీసులు ఇచ్చారు. వక్ఫ్‌బోర్డు పేరు చెప్పి భూములు లాక్కొవాలని చూస్తున్నారు. భూములు లాక్కుందామనుకుంటే అక్కడే ప్రాణలు వదులుతాం. - రమేష్‌, గోవర్థనగిరి

Updated Date - May 22 , 2026 | 12:09 AM