విచారణ జరిపి న్యాయం చేస్తాం
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:44 PM
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 125 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు శివశంకర్, రమేశ్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
వచ్చిన ఫిర్యాదులు
ఎండోమెంటు డిపార్టుమెంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.10 లక్షలు తీసుకుని ఇద్దరు వ్యక్తులు మోసం చేశారని పత్తికొండ లక్ష్మీనగర్‌కు చెందిన లోకేశ్‌బాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరులో ఎస్‌బీఐ కస్టమర్ సర్వీసు పాయింట్ నిర్వహిస్తున్నానని, అయితే పగిడ్యాల మండలం ప్రాతకోటకు చెందిన ముల్లా ముస్తాక్ ఫోన్ పే చేయించుకొని డబ్బులు ఇవ్వడం లేదని గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన చిన్న లక్ష్మన్న ఫిర్యాదు చేశారు. తమ అవ్వకు హాస్పిటల్‌లో సీరియస్‌గా ఉందని, క్రెడిట్ కార్డు ద్వారా ఇస్తానని చెప్పి ముస్తాక్ రూ.1.10 లక్షలు ఫోన్ పే చేయించుకున్నాడని చెప్పారు. అయితే రూ.50వేలు మాత్రమే ఇచ్చి మిగతా డబ్బు ఇవ్వకుండా మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అల్లుడికి, తన స్నేహితుడు కుమారుడికి ఢిల్లీ, ముంబై చెందిన ప్రవీణ్, బద్రి నారాయణ, కండేలేవాల్, మిథున్ దాష్.. రైల్వే, ఇన్‌కం ట్యాక్స్, నామినేటెడ్ ఉద్యోగాలు, ప్రాజెక్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.20లక్షలు తీసు కుని మోసం చేశారని కర్నూలు బాలాజీ నగర్ చెందిన మన్సూర్ అహ్మద్ ఫిర్యాదు చేశారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని, తన కుమారుడు రవి సరిగా చూసుకోకుండా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన విజయ కుమార్ ఫిర్యాదు చేశారు. తనపై చెడు ప్రయోగాలు చేసి ఆరోగ్యం బాగా లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామానికి చెందిన మహ్మద్ షఫీఉల్లా ఫిర్యాదు చేశారు.