Share News

బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చుతాం

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:51 PM

బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని ఇచ్చిన మాటను నెరవేర్చి తీరుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు.

బీసీలకు ఇచ్చిన మాట నెరవేర్చుతాం

మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి

బనగానపల్లె, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తామని ఇచ్చిన మాటను నెరవేర్చి తీరుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో ఆయన టీడీపీ శ్రేణులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం పార్టీ టికెట్లు కేటాయించాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కానీ వైసీపీ నాయకులు కోర్టులకు వెళ్లి ఆ జీవోలను సవాల్‌ చేశారన్నారు. అయినప్పటికీ పార్టీ పరంగా అంతకుమించి బీసీలకు సీట్లు కేటాయిస్తామని తమ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారన్నారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీసీల రాజకీయ సాధికారకత, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ప్రాతినిథ్యం పెంపు పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించామన్నారు. బీసీల అభ్యున్నతికి, రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించి టీడీపీ తీసుకున్న నిర్ణయాలను గ్రామస్థాయికి తీసుకు తీసుకెళ్లాలని కేడర్‌కు పిలుపునిచ్చారు. బీసీలకు వైసీపీ చేసిన మోసాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. ఎప్పటికైనా బీసీలు టీడీపీ వెంటే ఉంటారని మంత్రి తెలియజేశారు.

Updated Date - Oct 12 , 2026 | 11:51 PM