Share News

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:34 PM

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ

బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు క్రైం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ హుస్సేన్‌ పీరా, సీఐలు శివశంకర్‌, ఇస్మాయిల్‌, మస్తాన్‌వలి పాల్గొన్నారు.

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన ఫిర్యాదులు

నరసరావుపేట ఆర్మీ అకాడమీలో శిక్షణ పొందుతున్న తమ ఇద్దరు కుమారులకు పరిచయమైన తిరుమలేశ్‌, మాలవతి కిషోర్‌ రైల్వే శాఖలో ఆర్‌పీఎఫ్‌, గ్రూప్‌-డి, గ్రూప్‌-సీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నకిలీ ఆర్డర్‌ కాపీ ఇచ్చి రూ.36 లక్షలు తీసుకుని మోసం చేశారని పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన శివారెడ్డి ఫిర్యాదు చేశారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామం సమీపంలోని 3.15 ఎకరాల భూమిని అమ్ముతామని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఓ మహిళపై చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం పసుపుల గ్రామానికి చెందిన మహబూబ్‌ బాషా ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు, కోడలు మూడు తులాల బంగారు గొలుసు తీసుకున్నారని మార్కాపురం రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, రంగయ్య దంపతులు ఫిర్యాదు చేశారు. తమ మరిది కుమారులు తమ ప్లాట్‌ను ఇళ్లను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ, ఇంటిని విక్రయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నార ని కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన లలితమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన చిన్న కుమారుడికి విద్యుత్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50 వేలు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు కొత్తపేట చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించి పొలంలోకి వచ్చి కంది పంటను నాశనం చేశారని, పొలం ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారని హొళగుంద మండలం పెద్దగోనేహల్‌ గ్రామానికి చెందిన ప్రేమవర్దిని రెడ్డి ఫిర్యాదు చేశారు.

Updated Date - Jun 29 , 2026 | 11:34 PM