Share News

మాదకద్రవ్యాలను నియంత్రిస్తాం

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:40 PM

మాదక ద్రవ్యాలను నియంత్రించి నంద్యాలను డ్రగ్‌-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఖాదర్‌బాషా అన్నారు.

మాదకద్రవ్యాలను నియంత్రిస్తాం
మాట్లాడుతున్న ఏఎస్పీ ఖాదర్‌బాషా

అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు

ఏఎస్పీ ఖాదర్‌బాషా

నంద్యాల క్రైం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలను నియంత్రించి నంద్యాలను డ్రగ్‌-ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దుతామని జిల్లా అడిషనల్‌ ఎస్పీ ఖాదర్‌బాషా అన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ఏఎస్పీ ఎస్‌. ఖాదర్‌బాషా అధ్యక్షతన జిల్లాస్థాయి ఎన్‌సీఓఆర్‌డీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్‌, పోలీసు, విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉద్యానవనం, అటవి, రైల్వే, రవాణా, మహిళా-శిశు సంక్షేమం, డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌, మున్సిపల్‌ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి అవసరమైతే డీ-అడిక్షన్‌, పునరావాస కేంద్రాలకు పంపించాలని, వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, విద్యాసంస్థల్లో ఈగల్‌ క్లబ్స్‌ ఏర్పాటు చేసి మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అన్నారు. ప్రతి శనివారం డ్రగ్‌ ఫ్రీ ప్రతిజ్ఞ, నెలవారీ అవగాహన కార్యాక్రమాలు, తల్లితండ్రులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. అన్ని విద్యాసంస్థల చుట్టూ 500 మీటర్ల పరిధిని మాదకద్రవ్య ప్రాంతంగా ప్రకటించి కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా పెంచడంతోపాటు అలవాటుగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడేవారిపై ‘పిట్‌ ఎన్‌డీపీఎస్‌ యాక్టు, 1988’ కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రోన్‌ సర్వైలెన్స్‌, సీసీటీవీ నెట్‌వర్క్‌, సీసీటీఎన్‌ఎస్‌, డేటా అనలిటిక్స్‌, హాట్‌స్పాట్‌ మ్యాపింగ్‌, సోషల్‌ మీడియా మానిటరింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, క్రయ, విక్రయాలను మందస్తుగా గుర్తించి అరికట్టాలన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:40 PM